దత్త జయంతికి దత్తగిరి ముస్తాబు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలోనే దత్తక్షేత్రాలలో ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయతల మధ్య వెలసిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో మార్గశిర పౌర్ణమి ఈ నెల 4న దత్తజయంతి వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దత్తజయంతి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి, సిద్ధేశ్వరానందగిరి మహారాజ్, దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం పర్యవేక్షణలో ఈనెల 2, 3, 4 తేదీల్లో 21 యజ్ఞగుండాలతో దత్తయజ్ఞాలు, శ్రీచండీ హోమం మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు అవధూతగిరి మహారాజ్, సిద్దేశ్వరనందగిరి
పేర్కొన్నారు. యజ్ఞాల కోసం ప్రత్యేక యాగశాల ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తుల తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం పచ్చటి పందిళ్లు, తాగునీరు, భోజన వసతి, భక్తులకు దర్శనం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దత్తాత్రేయ మందిరం, జ్యోతిర్లింగాల మండపం, ఆత్రేయ మహర్షి, అనసూయ, గోమందిరం, రేణుకామాత మందిరాలకు రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరణ చేశారు. వైద్యాధికారి డాక్టర్ రమ్య ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఝరాసంగం ఎస్సై క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
