తమిళనాడులో మారుతున్న రాజకీయాలు
అమిత్ షాను కలిసిన ఏఐడీఎంకే నేత పళనిస్వామి
సినీనటుడు విజయ్ కొత్త పార్టీతో ద్రవిడ పార్టీలకు సరికొత్త సవాలు
జయలలిత భజన ఏఐడీఎంకేకు ఎంతోకాలం లాభించకపోవచ్చు
ఛరిష్మా నాయకుడు లేక కునారిల్లుతున్న పార్టీ
స్టాలిన్ తర్వాత డీఎంకే పరిస్థితీ ఇంతే
క్రమంగా ప్రజల్లో పట్టు సాధిస్తున్న సనాతనధర్మ వాదం
బీజేపీతో మైత్రి తప్ప ఏఐడీఎంకేకు మరో మార్గంలేదు
ఎన్నికలకు ఏడాదిముందునుంచే పదునెక్కుతున్న వ్యూహాలు
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఒకప్పుడు కలిసుండి తర్వాత ఎడమొ హం పెడమొహంగా మారిన పార్టీలు ఎన్నికలు సమీపంలోకి వచ్చేసరికి, జ్ఞానోదయమై మళ్లీ ‘అవసరం’రీత్యా తిరిగి సన్నిహితం కావడం రాజకీయాల్లో అత్యంత సహజ పరిణామం. ఇక్కడ అధికారమే అవసరం కనుక విభేదిస్తే మునిగిపోతామన్న సత్యం రాజకీయ నాయకులను, శాశ్వత శత్రువులుగా కొనసాగనివ్వదు. ప్రస్తుతం తమిళనాడులో ఇదే జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఇప్పటినుంచే రాజకీయంగా హాట్‌హాట్ గా వున్న రాష్ట్రంలో పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయనడానికి మంగళవారం ఏఐడీ ఎంకే నాయకుడు పళనిస్వామి, కేంద్ర హోమంత్రి అమిత్ షాను ఢల్లీిలో కలవడం ఒక ఉదా హరణ. నిజానికి 2016లో జయలలిత మరణం తర్వాత ఏఐడీఎంకే, భారతీయ జనతాపార్టీతో జట్టు కట్టింది. అయితే ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసినా 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అప్రతిహత విజయం సాధించిన తర్వాత ఈ పొత్తు అచ్చిరాలేదన్న ఉద్దేశంతో 2023లో పళనిస్వామి బీజేపీకి రాంరాం చెప్పారు. అయినప్పటికీ అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. అయితే పొత్తు లేకపోవడంతో, బీజేపీ ఫైర్‌బ్రాండ్ అధ్య క్షుడుగా తనను తాను నిరూపించుకున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై, ఎన్నికల ప్రచారంలో ద్రవిడ పార్టీలను తన విమర్శల వాగ్ధాటితో చీల్చి చెండాడారు. ఈ ఎన్నికల్లో ఏఐడీఎం కే సోదిలో లేకుండా పోవడానికి, అన్నామలై అప్రతిహత విమర్శల దాడులే కారణమని తమిళ నాడు రాజకీయ పండితులు మాత్రమే కాదు, అన్నాడీఎంకేలోని తలపండిన నాయకులుకూడా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అన్నామలై అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా విమర్శించకుండా వదిలిపెట్టలేదు. జయలలిత భజనను నమ్ముకున్న ఏఐడీఎంకే నాయకులకు అన్నామలై వ్యవహారశైలి నచ్చకపోవడం కూడా పొత్తునుంచి విరమించుకోవడానికి ఒక కారణంగా చెబుతారు. పొత్తునుంచి బయటకు వచ్చినా ఏఐడీఎంకే గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీకి రాష్ట్రంలో బలం లేదు కనుక పెరిగే ఓట్లశాతం పరంగా లాభం తప్ప, సీట్లు సాధించే స్థాయికి ఎదగలేదు. ఇక్కడ ఏఐడీఎంకేలో ఛరిష్మా నాయకుడు లేకుండా, ఇంకా జయలలిత భజనతో సీట్లు సాధించలేరన్నది గత ఎన్నికలు స్పష్టం చేశాయి.
తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త మార్పు సినీ స్టార్ విజయ్ రూపంలో రాబోతున్నది. మరో సినిమానటుడు కమల్‌హసన్ ప్రభావం తమిళ రాజకీయాలపై లేదన్న సంగతి తేలిపోయింది. మరి విజయ్ ‘తమిళ వెట్రి కజగం’ (టీవీకే) అనే కొత్త పార్టీని పెట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. తమిళనాడులో ఆయనకు గొప్ప పాలోయింగ్ వున్నదన్న సంగతి అందరికీ తెలిసినప్పటికీ, ఈ ‘ఛరిష్మా’ ఎంతవరకు ‘ఓటు బ్యాంకు’ను సృష్టిస్తుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. కాకపోతే ప్రస్తుతం ప్రధానంగా తలపడే రెండు ద్రవిడపార్టీల అవకాశాలను విజయ్ దెబ్బకొట్టే అవకాశాలే ఎక్కువ. గత ఎన్నికల పోరాటాల్లో ఘోరంగా ఓటమిపాలై తిరిగి సత్తువ కూడగట్టుకో లేని స్థితిలో ఉన్న ఏఐడిఎంకేపైనే విజయ్ ప్రభావం పడకూడదనేం లేదు. ఆయన అధికారంలోకి వస్తారా, రారా అన్నది కాదు ప్రశ్న. ఆయన చీల్చే ఓట్లు ఎవరి కొంప ముంచుతాయన్నది అసలు పాయింటు. ఈ లెక్కలు వేసుకున్న అన్నాడీఎంకే నాయకులు, తాము ముందుగా మేల్కనక పోతే పార్టీ అడ్రస్‌లేకుండా పోయే ప్రమాదం ఉన్నదని గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యమే పళనిస్వామి ఢల్లీిపయనం, అమిత్‌షాతో ములాఖాత్ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. నిజం చెప్పాలంటే ఏఐడీఎంకేకు ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే ప్రస్తుతం అన్నామలై స్టార్ లీడర్‌గా ఎదుగుతున్నారు. ఆయన ప్రసం గాల ప్రభావం ప్రజలపై చాలా అధికంగా వుంటోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఆయన నేతృత్వం లో బీజేపీ రాబోయే ఎన్నికల్లో మరింత పుంజుకొని తమిళ యవనికపై తన గుర్తింపును ప్రస్ఫు టంగా చూపగలిగే అవకాశాలే ఎక్కువ. ఇప్పటికే క్రమంగా ఓట్ల శాతం పెంచుకుంటూ వస్తున్న బీజేపీ రాబోయే ఎన్నికల నాటికి సీట్లు సాధించే స్థాయికి ఎదిగితే ఇక ద్రవిడవాదానికి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం కూడా అన్నాడీఎంకే నేతల్లో వుంది.
అధికార డీఎంకే కూడా ద్రవిడవాద పార్టీయే కనుక ప్రస్తుతం తనకున్న అధికార హంగు, ఆర్భా టాలతో బీజేపీని యధాశక్తి కట్టడిచేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు సాగిస్తోంది. భాషా వివాదం, డీలిమిటేషన్ సమస్యలు ఇందులో భాగమే. అయితే డీఎంకే ఇక్కడ భాష పేరుతో పెంచు తున్న వివాదం దానికే బూమరాంగ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, ఉద్యోగావకాశాలు కేవలం తమిళనాడుకు మాత్రమే కాదు, భారతదేశం యావత్తు విస్తరించాయి. హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం వుంటేనే ఉద్యోగార్థులు రాణిస్తార న్న సత్యం ద్రవిడ పార్టీలకు తెలియంది కాదు. కాకపోతే భావోద్వేగ రాజకీయాలను నెరపడం ద్వారా తమ స్థానాన్ని పదిలం చేసుకోవడం వాటి లక్ష్యం తప్ప, నిజమైన భాషాభిమానం కనిపిం చదు. నిజమైన భాషాభిమాని అన్ని భాషలను సమానంగా ప్రేమిస్తాడు. తన మనుగడకు అవసర మైన ప్రతి భాషను నేర్చుకొని, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి యత్నిస్తాడు. ప్రస్తుతం తమిళనాడులో పాతతరం వారికి భాషా దురభిమానం ఉపయోగపడినా, నేటి తరానికి ఈ వా దం ఎంతమాత్రం ఉపయోగకరమైంది కాదనేది క్షేత్రస్థాయిలో వెల్లడవుతున్న నిష్టుర సత్యం.
దేశవ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్న బీజేపీ, తమిళనాడులో ద్రవిడవాదాన్ని ఎదుర్కోవడానికి సనాతనధర్మ వాదం అనే అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. ఇది ఫలితాలనిస్తోంది కూడా. ఏఐడీఎంకేకు ఇది తెలియంది కాదు. ఏ వాదమైనా కొంతకాలం వరకే ప్రభావం చూపుతుందనేది చరిత్ర చెబుతున్న సత్యం. కొత్త వాదాల హోరులో పాత వాదాలు కొట్టుకుపోవడం సహజం. ఈ నేపథ్యంలో ఏఐడీఎంకే తన స్థానాన్ని కాపాడుకోవడానికి, బీజేపీ అధికాయకత్వంతో బేరసారాలు అడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే, దీన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు ఒక ‘స్టీరింగ్ కమిటీని’ ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే నాయకులు కోరుతున్నట్టు తెలుస్తోంది. అంటే స్టీరిం గ్ కమిటీ పేరుతో అన్నామలే స్వేచ్ఛను కట్టడి చేయాలన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నదని చెబుతు న్నారు.
బుధవారం ఎడప్పాడి కె.పళనిస్వామి ఢల్లీిలో విలేకర్లతో మాట్లాడుతూ కేవలం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరడానికి మాత్రమే తాను అమిత్ షాను కలిసానని యధాలాపం గా చెప్పినప్పటికీ, ఏ రాజకీయ ఉద్దేశము లేకుండా ఇటువంటి సమావేశాలు జరగవన్నది అందరికీ తెలిసిందే. న్యూఢల్లీిలో కొత్తగా ఏఐడీఎంకె పార్టీ ఆఫీసు ప్రారంభం పేరుతో వచ్చిన పళని స్వామి అమిత్ షాతో 45 నిముషాలు భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న భాషావివా దం, టీఏఎస్‌ఎంఏసీపై ఈడీ దాడులు, కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడం వంటి అంశాలను చర్చించి, ముల్లయార్ పెరియార్ డ్యామ్‌ను పటిష్టం చేయడం, కావేరి, గోదావరి న దుల అనుసంధానంతో పాటు రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం జోక్యాన్ని కోరినట్టు ఆయన చెబుతున్నప్పటికీ అంతర్గత వ్యూహం మాత్రం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది మాత్రమే అయివుంటుందన్నది తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి ఇట్టే అర్థమవుతుంది. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విలేకర్లతో మాట్లాడుతూ అమిత్ సా`పళనిస్వామిల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి మరింత విస్త రించే అవకాశాలున్నాయని చెప్పడం గమనార్హం.