జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
జడ్చర్ల /నేటి ధాత్రి
జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగానే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. సుభాష్ చంద్ర బోస్ స్వతంత్ర భారత సమరంలో కీలక పాత్ర పోషించారని, 1930లలో ఆయన గాంధీ మార్గాన్ని అనుసరించి దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు. 1938లో, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన నేతాజీ, దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డారని తెలిపారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ఏర్పాటు చేయడంతో అంతర్జాతీయస్థాయిలో నేతాజీకి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. నేతాజీ సైన్యం జపాన్ మద్దతుతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిందని వెల్లడించారు. ‘నీ రక్తాన్ని నాకు ఇవ్వు.. నీకు నేను స్వేచ్ఛ ఇస్తా’ అంటూ.. నేతాజీ ఇచ్చిన నినాదం దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని మలుపుతిప్పిందన్నారు. జననం తప్ప మరణం లేని మహనీయుడు, దేశం కోసం తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మహానాయకుడు నేతాజీ అని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.