Puri’s Slumdog Sparks Industry Debate
స్లమ్‌డాగ్’పై హాట్ డిబేట్
పూరీ @ డూ ఆర్ డై
పూరీ జగన్నాథ్.. ఒకప్పుడు ఈయన డైలాగ్స్ బాక్సాఫీస్ ని ఏ రకంగా చీల్చి చెండాడేవో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అలాంటి పూరి నుండి జస్ట్ సినిమా అనౌన్స్ అయితే చాలు.. షూటింగ్ మొదలవ్వకముందే టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేవి. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. విజయ్ సేతుపతి లాంటి వెర్సటైల్ యాక్టర్ తోడున్నా, టబు లాంటి సీనియర్ స్టార్ ఉన్నా.. ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమాకు ఓటీటీ బయ్యర్లు ముఖం చాటేస్తుండటం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయిపోయింది.
పూరీ మార్కెట్‌ను దారుణంగా దెబ్బతీసింది ‘లైగర్’. కేవలం సినిమా డిజాస్టర్ అవ్వడమే కాదు, ఆ తర్వాత జరిగిన డిస్ట్రిబ్యూటర్ల గొడవలు పూరీ బ్రాండ్ ఇమేజ్ను బాగా డ్యామేజ్ చేశాయి. ఇక డబుల్ ఇస్మార్ట్ కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, ఇప్పుడు ఓటీటీ సంస్థలు “కంటెంట్ చూశాకే.. రేటు చెబుతాం” అంటూ కండిషన్స్ పెడుతున్నాయట.
నిజానికి గ్లామర్, గన్స్, గ్యాంగ్స్టర్స్.. ఇవే పూరీ జగన్నాథ్ బలం. కానీ ఈసారి అందుకు భిన్నంగా స్లమ్ ఏరియా బ్యాక్‌డ్రాప్, బిచ్చగాడి పాత్ర చుట్టూ కథను తిప్పారని ఇన్ సైడ్ టాక్. ఇక సినిమాని మే 2026 నాటికి రెడీ చేయాలనే టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారట. కానీ పూరీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఈ ‘రా అండ్ రస్టిక్’ జోనర్లో వర్కవుట్ అవుతాయా లేదా? అనే డౌట్స్ బయ్యర్లలో బలంగా ఉందన్న టాక్ వినిపిస్తుంది.
ఇక సంవత్సరాల తరబడి సినిమా షూటింగులు జరుపుకుంటున్న ఈ రోజుల్లో స్లమ్‌డాగ్ ని కేవలం 5 నెలల్లో కంప్లీట్ చేశాడంటే పూరిని మెచ్చుకోవాల్సిందే. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ చూసిన పూరీ జగన్నాథ్ కెరీర్ ప్రస్తుతం డూ ఆర్ డై అన్నట్టుగానే ఉంది. చూడాలి బాక్సాఫీస్ వద్ద స్లమ్‌డాగ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో.
