Government Supports Poor Girls’ Marriages with ₹1.59 Crore Aid
పేద ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం:ఎమ్మెల్యే నాయిని..
#రూ. 1.59 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
#హనుమకొండ, కాజీపేట మండలాల లబ్ధిదారులకు చేయూత..
హన్మకొండ, నేటిధాత్రి:
పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా కొండంత అండగా నిలుస్తోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ గోకుల్ నగర్ లోని అంబేద్కర్ భవన్లో బుధవారం హనుమకొండ మరియు కాజీపేట మండలాలకు సంబంధించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మొత్తం 159 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 1,59,18,444 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆడబిడ్డల వివాహాల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. గతంలో పెళ్లిళ్లు చేయాలంటే పేదలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం లబ్ధిదారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, మండల స్థాయి అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
