వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్ మాయం .. ?
నర్సంపేట పట్టణం మున్సిపాలిటీగా మారడంతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం జోరుగా కొనసాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో రియల్‌ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా చోటా..మోటా లీడర్లు రియాల్టర్లుగా అవతారమెత్తుతున్నారు. నర్సంపేట పట్టణంలో చుట్టు శివారు గ్రామాలలో వ్యవసాయ భూములను సైతం ప్లాట్లుగా మార్చి రియల్‌ఎస్టేట్ వ్యాపారాన్ని మూడుపూలు ఆరుకాయలుగా సాగిస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గత పది సంవత్సరాల నుండి లేఅవుట్ పర్మిషన్ ఉన్న 18వెంచర్లు మాత్రమే లెక్కలోకి వచ్చాయని మున్సిపల్ అధికారులు తేల్చి చెప్పారు. కానీ వెంచర్లలో కేటాయించిన గ్రీన్‌ల్యాండ్స్ మాత్రం మాయమైనట్లు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్ కోసం కేటాయించిన స్థలానికి హద్దులు వేస్తూ ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ బోర్డులను ప్రదర్శిస్తూ ఉంటారని, అసలు ఆ బోర్డులను, హద్దులను అధికారులే ప్రదర్శించలేదా..? రియల్ వ్యాపారులే తొలగించారా..? అని పలువురు చర్చించుకుంటున్నారు. వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్ మాయం కావడానికి అధికారుల నిర్లక్ష్యమా..?, మామూళ్ల మత్తులో అధికారులే వదిలేశారా..? అన్న ప్రశ్నలు పట్టణంలో వినిపిస్తున్నాయి. వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్ కోసం కేటాయించిన భూమికి చుట్టూ హద్దులు వేసి బోర్డులను ప్రదర్శించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రీన్‌ల్యాండ్‌లను కూడా రియల్‌ఎస్టేట్ వ్యాపారులే అమ్ముకున్నారని అనుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపాలిటీ అధికారులు స్పందించి గ్రీన్‌ల్యాండ్‌లను గుర్తించి ఆ భూముల్లో బోర్డులు ప్రదర్శన చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్‌ను వివరణ కోరగా వెంచర్లలో గ్రీన్‌లాండ్‌ల సమాచారం నాకు తెలియదని సమాధానం చెప్పారు.