మట్టి మాఫియాపై రెవెన్యూ కొరఢా
వరంగల్ నగర శివార్లలో కొందరు అక్రమంగా చెరువులలో మట్టి తవ్వకాలు జరిపి యదేచ్చగా ఇటుకబట్టీలకు అమ్ముకుంటు లక్షల రూపాయల విలువ చేసే మట్టిని వ్యాపారంగా మార్చి ప్రభుత్వ రెవిన్యూ అధికారల కళ్లు గప్పి గుట్టుగా దందా కొనసాగిస్తున్నారని ‘చెరువు మట్టి…మాయమవుతోంది..’ అనే శీర్షికతో ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసిందే. నేటిధాత్రి కథనానికి స్పందించిన రెవిన్యూ అధికారులు ఆదివారం రంగశాయపేట సమీపంలోని దామెర చెరువులో మట్టి వ్యాపారులు అక్రమంగా మట్టిని తవ్వుతుండగా విఆర్వో శ్రీనివాస్, విఆర్‌ఏలు సదానందం, రమేష్‌లు వెళ్లి పరిశీలించగా ఒక జెసిబీతో మట్టిని తవ్వుతుండగా పనులను నిలిపివేసి జెసిబినీ స్శాదీనం చేసుకున్నట్లు విఆర్వో శ్రీనివాస్ తెలిపారు. అనేక సార్లు హెచ్చరించినా మట్టి వ్యాపారలు పెడచెవిన పెట్టడంతో ఆదివారం రాత్రి దామెర చెరువు వద్ద రెక్కి నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని , మట్టిని తరలించే సమయంలో నాలుగు టిప్పర్లు పారిపోయాయని, ఒక జెసిబిని పట్టుకొని కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సిబ్బంది
ఆదివారం రాత్రి వేళలో అక్రమంగా దామెర చెరువులో మట్టి తవ్వకాలు జరుపుతున్నట్టు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లగా చెరువులో తవ్వుతున్న మిషన్‌లను అదులపులోకి తీసుకున్నారు. పారిపోయిన టిప్పర్ల కొసం పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకొని వెళ్లారని వాటి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. అర్ధ రాత్రి పక్కాసమాచారంతో వెళ్లి పట్టుకున్నామని రెవిన్యూ అధికారులు తెలిపారు.
జెసిబిని స్వాదీనం చేసుకున్న రెవిన్యూఅధికారులు
దామెర చెరువులో మట్టిని తవ్వుతున్న టిఎస్ 03 ఇఎఫ్ 4019 అను నెంబర్ గల జెసిబిని రెవిన్యూ అధికారలు నిర్వహించిన దాడిలో పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని తవ్వుతున్నందున ఈ జెసిబిని అదుపులోకి తీసుకొని ఎమ్మార్వో కార్యాలయానికి తరలించామని విఆర్వో తెలిపాడు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎవరైనా చెరువులలో మట్టిని తవ్వినా, మట్టిని తరలించి వ్యాపారానికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.