నేనే మేయర్‌…నేనే ఎమ్మెల్యే నేనంటే నేనే

నేనే మేయర్‌…నేనే ఎమ్మెల్యే

నేనంటే నేనే

కార్పొరేటర్‌ నుంచి మేయర్‌గా, ఆ తరువాతి సమీకరణలతో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నన్నపనేని నరేందర్‌ వరంగల్‌ తూర్పుతో సహా గ్రేటర్‌ వరంగల్‌ అంతా తన పెత్తనం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పెత్తనం ఎక్కడి వరకు వెళ్లిందంటే గ్రేటర్‌ కాకుండా వరంగల్‌ ఉమ్మడి జిల్లా మొత్తంగా తన పరపతి ఏంటో చూపించుకునే స్థాయికి నరేందర్‌ గూర్చి ఆ పార్టీ నాయకులే కొంతమంది ఎమ్మెల్యేకు ముందు, ఎమ్మెల్యే తరువాత అని చర్చించుకునేలా తయారయ్యిందట. మేయర్‌గా బాద్యతలు చేపట్టి, తన వర్గాన్ని పెంచుకున్న నన్నపనేని ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా అదే విధానాన్ని పాటిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘రామన్న’ ఫోన్‌ చేశాడు జాగ్రత్త…!

ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ తన మాట వినని వారికి కేటిఆర్‌ పేరు చెప్పి వారికి తెచ్చుకుంటాడనే ప్రచారం కొనసాగుతుంది. తనకు సంబంధించిన సొంత పనులు చేయకుండా ఎవరు నిర్లక్ష్యం చేసిన రామన్న ఇప్పుడే ఫోన్‌ చేశాడు…నీ గూర్చి ఫిర్యాదులు వెళ్లాయట అని బెదిరించి తన స్వకార్యాన్ని చక్కబెట్టుకుంటాడట. మేయర్‌గా కొనసాగిన కాలంలో సైతం అధిష్టానానికి అతిదగ్గరగా ఉండే ఓ పార్టీ సీనియర్‌ నేత ఏదో పని విషయమై సంప్రదిస్తే కేటిఆర్‌ పేరు చెప్పి ఆ నేతను హడలెత్తించాడట. పార్టీ మొదలుకుని ఇంటా, బయట ఎక్కడ పనికావాలన్న అవసరం ఉన్నా, లేకున్నా కేటిఆర్‌ పేరును వాడుతూ పనులన్నీ చక్కబెట్టుకుంటున్నాడని, ఎమ్మెల్యే పనులు ఏమోగానీ కేటిఆర్‌ పేరువాడి తలవంపులు తెస్తున్నాడని కొందరు పార్టీ నాయకులే తమలో తాము చర్చించుకుంటున్నారు. తన సన్నిహితుల వద్ద కేటిఆర్‌ నా అన్న…నేను ఎంత చెపితే అంతా అంటూ వ్యాఖ్యానిస్తాడట. నన్నపనేని అనుసరిస్తున్న ఈ విధానంతో వరంగల్‌ తూర్పులో పార్టీ నాయకులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది.

బల్ధియాను వదలడు

మేయర్‌గా కొనసాగుతూనే ఎమ్మెల్యేగా గెలిచిన నన్నపనేని మాత్రం ఇప్పటికి మేయర్‌ పదవి నుంచి ఇంకా బయట పడలేదట. గ్రేటర్‌ పరిధిలో ఏం పనికావాలన్న కార్పొరేటర్లు తననే సంప్రదించాలనే ఆలోచనలో ఉన్నాడట. వివిధ డివిజన్లలో అభివృద్ది పనుల విషయంలో నన్నపనేని జోక్యం రోజురోజుకు మితిమీరిపోతున్నట్లు తెలిసింది. కార్పొరేటర్లు తనను కాదని ఏ పని చేసినా దానికి కావాల్సిన కొర్రీలు పెట్టడం ఆయనకు అలవాటుగా మారిందట. మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు కొనసాగుతున్న ఎమ్మెల్యే నన్నపనేని మాత్రం షాడోలా ప్రవర్తిస్తున్నాడని కొందరు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే ఇంట గ్రేటర్‌ సిబ్బంది

మేయర్‌గా నన్నపనేని కొనసాగినపుడు ప్రభుత్వం కేటాయించిన గ్రేటర్‌ సిబ్బందిని ఇప్పటికి వారి విధుల్లోకి వెళ్లకుండా తన వద్దే పనిచేయించుకుంటున్నట్లు తెలిసింది. సీసీ వినయ్‌, ఆపరేటర్‌ రాజు, డ్రైవర్‌ సంపత్‌, ఇద్దరు వంటమనుషులు గ్రేటర్‌ సిబ్బంది అయిన నన్నపనేని వద్దే విదులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గ్రేటర్‌ అధికారులు ఎమ్మెల్యే తీరుతో భయపడి తమ సిబ్బందిని తాము వెనక్కి పిలిపించుకోని స్థితిలో ఉన్నారట. ఒకవేళ ఎవరైన అధికారి నన్నపనేని వద్ద ఉన్న సిబ్బందిని వెనక్కి పిలిస్తే ఏమవుతుందోనని భయపడిపోతున్నారట. అధిష్టానం అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయని అందరికి సంకేతాలు పంపే ఎమ్మెల్యే నరేందర్‌ను ఇదేంటని ప్రశ్నించే అధికారి తీరట. కమిషనర్‌ సైతం చెప్పినట్లు చేయకుంటే కేటిఆర్‌ పేరు చెప్పి బెదిరింపులకు గురిచేసినట్లు విశ్వసనీయ సమాచారం.

అధిష్టానానికి పితూరీలు

వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న టిఆర్‌ఎస్‌ నాయకులపై అధిష్టానానికి పితూరీలు చెప్పడం ఎమ్మెల్యే నన్నపనేనికి అలవాటయిందట. హైదరాబాద్‌ వెళ్లిందంటే చాలు తనకు గిట్టనివారి గూర్చి ఏదో ఒకటి పితూరీ చెప్పి బేష్‌ అనిపించుకునే ప్రయత్నం చేస్తాడని తెలిసింది. తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా వేరే నియోజకవర్గాల్లో వేలు పెడుతూ అధిష్టానం పేరుతో పెత్తనం చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇంత జరుగుతున్న అధిష్టానం నన్నపనేని వ్యవహారంలో చూసిచూడనట్లు వ్యవహారించడం సీనియర్లలో ఆందోళన కలిగిస్తోంది. వ్యక్తి చెప్పే పితూరీలతో అధిష్టానం తన నిర్ణయాలను మార్చుకుంటుందా…? అని వారు ప్రశ్నిస్తున్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *