ఎర్రబెల్లికి సీఎం క్లాస్‌

ఎర్రబెల్లికి సీఎం క్లాస్‌

  • – మంత్రి దయాకర్‌రావు అతిపై ఆరా…
  • – దూకుడు కాస్త తగ్గించాలని సూచన
  • – సీనియర్లతో సమన్వయం పాటించాలని హితవు

నేటిధాత్రి బ్యూరో : మంత్రిగా పదవీబాధ్యలు చేపట్టిన నాటి నుండి మునుపటి కంటే కాసింత దూకుడు ప్రదర్శిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ క్లాస్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఖమ్మం, వరంగల్‌లలో ఎర్రబెల్లి ప్రసంగం ఆయన చేస్తున్న అతిపై ఆరా తీసిన సీఎం గట్టిగానే క్లాస్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించావ్‌ అందరిని కలుపుకుని వెళ్లు, సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ, పార్టీ క్యాడర్‌ పట్ల మర్యాద పాటించాలని సీఎం మంత్రికి చెప్పినట్లు తెలిసింది. వరంగల్‌ నగరంలో నిర్వహించిన డివిజన్ల సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడిన భాషపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు, పార్టీ క్యాడర్‌ను సీనియర్లను అలా సంభోధిస్తే మొదటికే మోసం వస్తుందని సీఎం సూచించినట్లు తెలియవచ్చింది. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉన్నందున పదవికి తగ్గట్టుగా హుందాగా ఉండాలని కేసిఆర్‌ హితవు పలికినట్లు గులాబీవర్గాలు అనుకుంటున్నాయి. మంత్రి పదవి చేపట్టిన నుంచి బ్రేకులు లేకుండా దూసుకువెళ్తున్న మంత్రి దయాకర్‌రావుకు సీఎం కేసిఆర్‌ బ్రేకులు వేశాడని ప్రచారం జరుగుతోంది. కొంతమంది సీనియర్లు, ప్రజాప్రతినిధులు ఎర్రబెల్లి తమను ఎంతమాత్రం లెక్క చేయడం లేదని మాటల విషయంలో సైతం ఇష్టారీతిన మాట్లాడుతున్నాడని సీఎం దృష్టికి తీసుకువెళ్లడంలో కేసిఆర్‌ మంత్రికి ఆక్షింతలు వేసినట్లు టిఆర్‌ఎస్‌ పార్టీలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ మంత్రి ఈ విధంగా ప్రవర్తించలేదని, లేకలేక మంత్రి పదవి దక్కించుకున్న ఎర్రబెల్లి మాత్రం తనకు తోచిన విధంగా ప్రవర్తిస్తు అధినేత దగ్గర మార్కులు కొట్టెస్తున్నానని అనుకున్నాడని, సీన్‌ రివర్స్‌ కావడంతో సీఎం ఆగ్రహానికి గురికావల్సి వచ్చిందని వారు చర్చించుకుంటున్నారు.

కడియంకు అప్పగింత…?

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవర్తన, క్యాడర్‌తో మసలుకుంటున్న తీరుపై గులాబీవర్గాల్లో అంతర్గతంగా నిరసన వ్యక్తం కావడంతో మొన్న జరిగిన వరంగల్‌ సభ బాధ్యతలు చివరి నిమిషంలో సీఎం కేసిఆర్‌ కడియంకు అప్పగించినట్లు తెలిసింది. వరంగల్‌ డివిజన్ల సమావేశంలో ఎర్రబెల్లి మాటలతో మనసు నొచ్చుకున్న కొంతమంది సీనియర్లు, కార్పొరేటర్లు ఈ విషయాన్ని అధిష్టానం దాక తీసుకుపోవడంతో ఇంకా ఎక్కువ నష్టం జరగకుండా ఎర్రబెల్లిని కొనసాగిస్తున్నట్లు సభా బాధ్యతలు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి అప్పగించినట్లు చర్చ జరుగుతోంది. మొత్తానికి సీఎం క్లాస్‌తో మంత్రి ఎర్రబెల్లి ఒక దారికి రానున్నాడని అతి తగ్గించి అందరితో సమన్వయం చేసుకుంటూ పదవికి తగ్గట్టు హుందాగా ప్రవర్తిస్తాడని ప్రస్తుతం గులాబీ శ్రేణులు ఆశిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!