ఈటెలా…మన(సు)లో మన మాట!

`ఈటెల గర్‌ వాపసీపై జోరుగా చర్చ

`గులాబీ రమ్మంటోంది…ఈటెల మనసు కోరుకుంటోంది అదే!

`ఈటెల వస్తే గులాబీలో కూడా పండగే!

`ఈటెల గర్‌ వాపసీపై స్పందనలన్నీ నర్మగర్భమే…

`కాదని గులాబీ నేతలు అనడం లేదు…

`అబద్దమని ఈటెల అన్నది లేదు…

` కేసిఆర్‌ కాదనుకున్నడు…కానీ కేటిఆర్‌ వద్దనుకోలేదు?

`ఇప్పటికీ ఈటెల మీద కేటిఆర్‌ ప్రేమ తగ్గలేదు.

`ఈటెల వస్తే బాగుంటుంది… అనుకుంటున్నరన్నది నిజమే?

`ఊగిసలాటలో ఈటెల మనసు..

`కాదనలేని, ఔననలేని సందిగ్ధం…

`ఎంతైనా కమలం కానిదే అనిపిస్తోంది!

`ఎప్పటికైనా చెప్పుకోవడానికి గులాబీ చరిత్రే ఈటెలకున్నది…

`కారే ఈటెల రాజకీయ జీవితానికి పునాది…

`అయిన వాళ్లు తిట్టినా బాగానే వుంటుంది.

`కాని వాళ్ల కనుచూపు కూడా కఠినంగానే వుంటుంది.

`మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు అందరూ విన్నవే!

`టిఆర్‌ఎస్‌ లో వున్నంత స్వేచ్ఛ బిజేపిలో వుందా?

`గులాబీ జెండాకు నేను కూడా బాసే అన్న మాట ధైర్యం బిజేపిలో అనగలడా?

`పరిగలేరుకోవడం కాదు, పంట కావాలన్నంత చనువు బిజేపిలో వుంటుందా?

`పంచాయతీ పెట్టుకున్నా పాలివాడైనా అయిన వాడే?

`కాని వాడు అవసరానికి పొగిడినా కళ్లలో కనిపించేది మోసమే!

`బిజేపిలో చేరి బలపడిన రాజకీయం ఈటెలకు లేదు?

`బిజేపి పెద్దలతో ముందు వరసలో ఈటెలకు స్థానం కుదరదు?

`బిజేపి పల్లకి ఎంత మోసినా నొప్పి పెట్టేది ఈటెల భుజాలే!

`ఎల్ల కాలం ఊరేగేది ఆ పార్టీ పెద్దలే…

`ఎన్నటికైనా ఈటెలకు బిజేపిలో మిగిలేది ఊడిగమే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాలలో ఊహలకు, నిజాలకు మధ్య కనిపించనంత చిన్న గీతైనా వుండొచ్చు. చెరిపేయలేనంత పెద్ద గీతైనా వుండొచ్చు. ఆ గీతలు నాయకులు గీసుకునే విధానాన్ని బట్టే వుంటాయి. ఎవరో గీస్తే వచ్చేవి కాదు..ఎవరో తొలగిస్తే పోయేవి కావు..ఎవరి గీత వారే గీసుకోవాలి. ఎవరి గీత వారే చెరిపేసుకోవాలి. ఒకరి గీత మరొకరు గీసేందుకు అవకాశం లేని ఏకైక ఆట రాజకీయం. అందుకే ఏ ఆటైనా వైకుంఠపాలిలో గెలిచేందుకే…పద్మ వ్యూహాలకు మించిన మలుపులు, లొసుగులు వుండేది రాజకీయంలోనే…ఒక్కసారి రాజకీయం ఒంటబడ్టిన తర్వాత వెనకడుగు వుండదు…తరమత బేధాలుండవు…! అందరూ ఒక్కటే…అందరూ వేరే…అందరూ మిత్రులే..అందరూ శత్రువులే…అందుకే రాజకీయాలలో శాశ్వత శత్రువులు వుండరు. శాశ్వ త మిత్రులు కూడా వుండరు. ఎవరు ఎప్పుడు కలుస్తారో..ఎప్పుడు విడిపోతారో…ఎందుకు ఒకటౌతారో…అన్నది వారి చేతుల్లో కూడా వుండదు. కాలం ఆడే ఆటలో నాయకులు కూడా పావులే…వెనక్కితిరిగిచూసుకోకపోతే అంతా శూన్యమే…! ఇది ఏ నాయకుడైనా తెలుసుకోవాల్సిందే…ఆచరించాల్సిందే…అనుసరించాల్సిందే…అన్వయించుకోవాల్సిందే…!

 ఈ మధ్య రాజకీయాల్లో వినిపిస్తున్న ఆసక్తికరమైన అంశాలలో ఈటెల రాజేందర్‌ తిరిగి సొంత గూటికి అన్నదానిపై చర్చ జోరుగా సాగుతోంది. 

నిజంగా కేసిఆర్‌ ఆ ఆలోచనలో వున్నాడా? లేడా? అన్నది దాని గురించే సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది. ఈటెల రాజేందర్‌ వస్తే బాగుండు? అని టిఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా అనుకుంటున్నాయా? అన్నది కూడా వినిపిస్తూనే వుంది. అంతే కాదు ఈటెల రాజేందర్‌ కూడా అదే కోరుకుంటున్నట్లు కూడా కొంత మంది చెబుతున్నారు. ఒక కుటుంబంలో అన్నదమ్ములు మధ్య విభేదాలు వచ్చినా, కాలం గడుస్తున్నకొద్దీ, ఆ కోప తాపాలు దూరమయ్యే అవకాశాలు లేకపోలేదు. వెనక్కితిరిగి చూసుకునే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల ఈటెల వస్తే మళ్లీ పార్టీలో మరో జోష్‌ నెలకొనొచ్చన్న వారు కూడా వున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసిఆర్‌ మనసులో ఏముందనేది తెలిస్తే గాని అసలు చర్చకు ముగింపు వుండదు. 

 ఈటెల రాజేందర్‌ గర్‌ వాపసీ అన్న అంశంపై ఎవరూ నోరు విప్పే అవకాశం లేదు.

 అంతా నర్మగర్భవ్యాఖ్యలు…లేకుంటే మౌనాలు..ఇంతకు మించి ఇప్పుడే సమాధానాలు ఆశించలేం…అందువల్ల ఈటెల ఎపిసోడ్‌లో ఔనని టిఆర్‌ఎస్‌ అనడంం లేదు…కాని ఈటెల కూడా కొట్టేయలేదు. తాజాగా ఈటెల చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఆసక్తికరంగానే వున్నాయి. తనను ముఖ్యమంత్రి కేసిఆర్‌ వద్దనుకున్నాడు…కాని కేటిఆర్‌ వదులుకోవాలనుకోలేదు…అన్నాడు. అంటే టిఆర్‌ఎస్‌ మీద మమకారం ఈటెలకు తగ్గలేదని తేలిపోయింది. కేసిఆర్‌ మీద కోపం లేదన్నది అర్ధమౌతోంది. పొరపొచ్చాలకు కారణమేదో అయ్యింటుందన్నది మాత్రం తెలుస్తోంది. ఆ మబ్బులు వీడితే మళ్లీ వెలుగే అన్నది కూడా వినిపిస్తున్న మాట…ఈటెల టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతాడన్న మాట..! అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పటికీ ఈటెల మీద కేటిఆర్‌కు ప్రేమ తగ్గలేదన్నది పరోక్ష సంకేతాల ద్వారా తెలుస్తోంది. ఈటెల రాజేందర్‌ పుట్టిన రోజున కేటిఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా ఈటెల రాజేందర్‌ తండ్రి స్వర్గస్ధులైనప్పుడు కూడా కేటిఆర్‌ స్పందించారు. నిజానికి ఈటెల వ్యక్తిగతంగా బిజేపిలో వున్నా, మనసు మాత్రం టిఆర్‌ఎస్‌లో వుందని ఆయన సన్నిహితులు చెబుతున్నమాట. టిఆర్‌ఎస్‌లో ఆయనకు జరిగిన ఇబ్బందులు ఆయనకు తప్ప మరెరికీ తెలియవు. కాని ఆయన అనుభవించిన స్వేచ్ఛ మాత్రం ప్రజలు చూశారు. ఈటెలరాజేందర్‌ కుమార్తె పెళ్లి జరిగిన తర్వాత వేములవాడకు వెళ్లిన రోజున ముఖ్యమంత్రి కేసిఆర్‌ చూపిన ప్రేమ ప్రజలు చూసిందే…ఈటెల కుటుంబం కోసం అరగంట పాటు కాన్వాయిని ఆపి మరీ వారిని సిఎం. కేసిఆర్‌ తన వెంట తీసుకెళ్లారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సమయంలోనూ సిఎంతో పాటు, కేటిఆర్‌ లేడు…హరీష్‌రావు లేదు. కాని ఈటెల మాత్రమే వున్నాడు. అంటే ఈటెలపై ఆ రోజుల్లో కేసిఆర్‌కు ఎంత గురి వుండేదో అర్ధం చేసుకోవచ్చు. పొరపొచ్చాలు ఎవరికైనా సహజమే…అవి సమసిపోవడం కూడా అంతే సహజం.

ఈటెల గర్‌వాపసీ అన్నది జరగాలనే అందరూ కోరుకుంటున్నారు. 

అయితే ఈటెలది కూడా కాదనలేని, ఔననలేని సందిగ్ధ పరిస్ధితుల్లోనే వున్నాడనేది కూడా కొంత వాస్తవం. ఈటెల రాజేందర్‌కు టిఆర్‌ఎస్‌లో వున్నంత స్వేచ్ఛ బిజేపిలో లేదనేది నిజం. ఎందుకంటే టిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు ఈటెల మాటలు తూటాల్లా పేలేవి. ఇప్పుడు మరమరాలకన్నా తక్కువయ్యాయని అంటున్నారు. బిజేపి పెద్దలు రిమోట్‌ పట్టుకొని మాట్లాడిస్తే మాటల్లానే వుంటున్నాయే తప్ప, ఈటెల స్వభావరిత్యా, సహజసిద్దంగా ఆయన గొంతును సవరిస్తే వచ్చే మాటలు రావడం లేదు. అయినా ఈటెల రాజేందర్‌ గురించి ఎవరు చెప్పాలనుకున్నా, ఆయన చరిత్ర అంతా టిఆర్‌ఎస్‌తోనే ముడి పడి వుంటుంది. కమలంలో ఆయన చరిత్ర వెలుగు లేని గుడ్డిదీపంలాగే వుంటుంది. తానేంటో చెప్పాలనుకున్నా టిఆర్‌ఎస్‌లో విజయాలు చెప్పుకోవాల్సిందే…బిజేపిలో వున్న స్ధానమేమిటో ఆయనకు కూడా తెలియందే…అందుకే తన రాజకీయ జీవితానికి పునాది వేసిన టిఆర్‌ఎస్‌కు మళ్లీ వెల్లడం అన్నది జరగడమే ఆయన రాజకీయ జీవితానికి మరో చిగురింపు అని అందరూ అంటున్నారు. ఎందుకంటే చరిత్రలో ఇలాంటి సంఘటనలు అనేకం వున్నాయి. ఒకనాడు ఇందిరాగాంధీ చేత బహిష్కరింపబడ్డ ప్రణబ్‌ ముఖర్జీ, తర్వాత కాలంలో రాజీవ్‌గాంధీకి సన్నిహితమయ్యాడు. తర్వాత కాలంలో కాంగ్రెస్‌కు ఆయనే ఊపిరయ్యాడు. సోనియాగాంధీకి మార్గదర్శకంగా నిలిచారు. కాంగ్రెస్‌పార్టీ మూలంగా రాష్ట్రపతి అయ్యాడు. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు వుండరని ఇందుకే అంటారు. 

 అయిన వాళ్లు తిట్టినా అందంగానే వుంటుంది.

 కాని వాళ్ల కనుచూపు కూడా కఠినంగానే వుంటుంది. ఈటెల రాజేందర్‌ను టిఆర్‌ఎస్‌నుంచి పంపినా, ఆయనపై ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పార్టీ కూడా ఆయనను కించపర్చలేదు. కాని మునుగోడు ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరమీదకు వచ్చిన తొలిరోజు ఈటెల రాజేందర్‌పై కేంద మంత్రి కిషన్‌రెడ్డిచేసిన వ్యాఖ్యలు అందరూ విన్నారు. దాంతో ఈటెలపై బిజేపి నేతలకు ఎంత ప్రేమ వుందో అర్ధం చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఈటెల రాజేందర్‌ టిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు గులాబీ జెండాకు నేను కూడా ఓనర్నే అన్నాడు. ఆ స్వేచ్ఛను చూపించుకున్నాడు. బెరుకుతనం లేకుండా మాట్లాడగలిగాడు. మరి అదే బిజేపిలో అలాంటి మాటలు మాట్లాడే చాన్స్‌ వుందా? టిఆర్‌ఎస్‌లో మంత్రిగా వుంటూనే పరిగలేరుకొని బతకడం కాదు…పంట కుప్ప మీద కూర్చొవాలన్నాడు. బిజేపిలో అలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం వుందా? దేశంలో ప్రజలు అధిక ధరలతో ఇబ్బందిపడుతున్నారని అనగలడా? ప్రజలు మోయలేని పన్నుల బారంతో మధనపడుతున్నారని చెప్పగలరా? అందుకే బిజేపిలో రాజేందర్‌ ఎంత కాలం వున్నా ఆయన బలపడేదిలేదు. ఆయనను బలపడనిచ్చేవారు లేరు. బిజేపి పెద్దల మందు, ముందు వరుసలో కూర్చునేందుకు కుర్చీయేలేదు. ఆఖరుకు రాష్ట్ర పార్టీలోనూ కీలక స్ధానంలోఆయనకు సీటులేదు. బిజేపి పల్లకి ఎంత మోసినా, ఎంత కాలం మోసినొ నొప్పి పుట్టేది ఈటెల భుజాలే…ఎల్ల కాలం ఊరేగేది ఆపార్టీ పెద్దలే…ఎప్పటికైనా బిజేపిలో ఈటెలకు మిగిలేది ఊడిగమే…అని ఆయన శ్రేయోభిలాషులే అంటున్నారు..మరి ఈటెల ఏమనుకుంటున్నారో..! అన్నది కాలమే సమాధానం చెప్పాలి…కనీసం కేటిఆర్‌ కోసమైనా టిఆర్‌ఎస్‌లోకి వస్తాడనుకుంటున్న టిఆర్‌ఎస్‌ శ్రేణుల మాటలన్నా నిజం కావాలి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *