`పట్టు పెరుగుతుందా! జారుతోందా!!
`కాంగ్రెస్‌లో వింత ధోరణి!
`మునుగోడు వైపు చూడడమే మానేసిన సీనియర్లు!
`ప్రచారానికి రానని చెప్పేసిన వెంకట రెడ్డి!
`రగిలిపోతున్న మధుయాష్కి!
`సిఎల్పీ లీడర్ మధిరలోనే!
`జగ్గారెడ్డి సంగతి తెలిసిందే!
`హనుమంతన్న కూడా సైలెంటే!!
`ఒంటరిని చేసి రేవంత్ పై భారం వేసి!
`ఒక్కడిని చేసి ఎలా గెలిపిస్తాడో చూద్దామని లెక్కలేసి!
`ఇదే అదును దెబ్బ పడితే…ఇక అంతే!
`రేవంత్ కథ కంచికే!
హైదరాబాద్,నేటిధాత్రి:
పాత్రదారులకు చిత్త శుద్ధి లేదు. సూత్రదారులకు దిక్కులేదు. పిపిసి అధ్యక్షుడు ఒంటరి ప్రయాణానికి దారి కనిపించడం లేదు. మిగతా సీనియర్లంతా కలిసి సాగుదాం…పార్టీకేమైతే మనకేంది? మనం పార్టీలో వున్నా చేసేదేముంది? అవకాశాలొస్తే కనిపిస్తాం…ప్రజలు దీవిస్తే గెలుస్తాం…సీనియర్లమన్న గుర్తింపు చెదిరిపోయేది కాదు… కొత్త వాళ్లెవరొచ్చినా ఎదిరించేది లేదు..పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు. పార్టీని గెలిపించే పలుకుబడి ఎవరికీ లేదు. గొప్ప లీడర్ అని చెప్పుకునేంత పేరు ఎవరికీ లేదు. నా మాట చెల్లుబాటు కావాలన్నంత హుకూం జారీ చేసేంత సీన్ అసలేలేదు. ఎవరికి వారే…యమునా తీరే…ఇది నూటా ముప్పై ఏళ్ల పార్టీయే…వచ్చేవారు వస్తుంటారు..పోయే వారు పోతుంటారు..పార్టీ బతికి బట్టకడితే వుంటాం….లేకుంటే సైలెంటుగా వుంటాం…ఇంతకు మించి మేం చేసేదేమీ లేదు…చేయాల్సిన పని కూడా లేదు…ఎందులో వేలుపెట్టినా ఫలితం దక్కేది లేదు…పేరొచ్చినా పెట్టే కిరీటం లేదు…ఏ మాత్రం ముందడగుడు వేసినా క్రెడిట్ ఇతరుల ఖాతాలో వేసేంత విశాల హృదయం ఎవరికీ లేదు…ఇదీ మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు…!మునుగోడులో పార్టీని ముంచి రాజగోపాల్ వెళ్లిపోయాడు. పార్టీ ఎన్ని అవకాశాల్చినా మోసం చేసి వెళ్లిపోయాడు. ఇలాంటి తరుణంలో పార్టీని ఎలాగైనా గెలిపించుకొని పార్టీకి ఆదరణ తగ్గలేదని నిరూపించుకుందామన్న సోయి ఎవరికీ లేదు….మునుగోడు మనదే అన్న నమ్మకం అంతకన్నా లేదు….గెలిపించుకుందామన్న పట్టుదల లేదు. ఐక్యత అంత కాన్న లేదు…కొత్తగా వచ్చిన పిసిసి. అధ్యక్షుడి ముందు జీ హుజూర్ అనే పరిస్ధితి అసలే లేదు…మీకు మీరే…మాకు మేమే…సీనియర్లమంతా ఒక్కటే…రేవంత్ ఎంత కాలమైనా ఒంటరే…ఇదే కాంగ్రెస్‌లో వినిపిస్తున్న మాట…ఎంత కాలం విన్నా ఇదే మాట…ఎవరు చెప్పాల్సివచ్చినా ఇదే మాట…ఇంతకు మించి చెప్పాల్సినంది లేదే మాట! అయితే మేమే వుంటాం… మాకు మేం కొట్లాడుకుంటాం…కొత్తవారొస్తే మాత్రం అందరిదీ ఒకటే గొంతై అరుస్తాం…నిందిస్తాం…నిలాపనిందలేసి నీరు గారేలా చేస్తాం…తట్టుకొని నిలబడితే నిలబడనీ…పోతే పోనీ…అని మేం కూడా అంటాం…..కోవర్టులు అన్న మాట మాట్లాడిన రేవంత్‌నే వెళ్లగొట్టకుండా వుండలేమన్నదే సీనియర్ల ఆట….అప్పటిదాకా ఇంతే…గట్టిగా చెప్పాల్సివస్తే…అంతే…రేవంత్ దిగిపోయేదాక అంతు చూడడమే! దించేయడమే…పారిపోయేలా చేయడమే!! ఇదే సీనియర్లు కట్టుకున్న కంకణమే!!! అందుకే ఇంత కాలం ఒకే దారిలో , ఒకే వేదికలో కనిపించిన కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరూ కనిపించడం లేదు… ఎవరు ఏం చేస్తున్నారో అసలే చెప్పడం లేదు. మునుగోడు వైపు చూడడమే మానేశారు…. వెళ్తే రేవంత్ రెడ్డి మాత్రమే వెళ్లాలి…ఆయన వెంట ఎవరూ వెళ్లకూడదు…పిసిసి అధ్యక్షుడిగా ఆయనదే బాధ్యత…అంటూ ఆయనపై పూర్తిగా తేసేసినట్లే వున్నారు. దాంతో రేవంత్ పట్టు పెరుగుతోందా? తగ్గుతోందా? అన్నది కూడా తేలిపోతుంది. ఒక వేళ పార్టీపై రేవంత్ పట్టు పెరుగుతున్నట్లు కనిపిస్తే మళ్లీ వచ్చి జట్టులో చేరొచ్చు. లేకుంటే పట్టు జారిపోయేదాకా రెవంత్ను ఇబ్బంది పెట్టొచ్చు… ఇదీ కాంగ్రెస్‌పార్టీలో కనిపిస్తున్న వింత ధోరణి. రగిలిపోతున్న మధుయాష్కీ..
ఇప్పటికే అనేక మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వూలలో మధుయాష్కీ తాను ఎంత అసహనంగా వున్నాడో చెప్పకనే చెబుతున్నాడు. తాను మునుగోడు వైపు చూడననే చెబుతున్నాడు. తనకు ప్రాధాన్యత లేకుండానే చేస్తున్నారని వాపోతున్నాడు. రేవంత్‌పై గుర్రుగా వున్నాడు. తనను సంప్రదించకుండానే రేవంత్ అన్ని తానై చేసుకుపోతున్నాడు. ఇక నేను చేసేదేముంది? అని మధుయాష్కీ అంటున్నాడు. మునుగోడులో ఏర్పాటు చేసిన సభ నుంచి మొదలు, ఆఖరుకు అభ్యర్ధి ఎంపికలో కూడా తన ప్రమేయం లేకుండానే రేవంత్ రెడ్డి చూసుకున్నారు. తనకు ప్రచార బాద్యతలు అప్పగించినట్లే చేసి, తనతో ఏం సంప్రదించకపోతే…ముందుకెళ్లేదెలా? అంటున్నాడు. తనను ముందు పెట్టినట్లే పెట్టి, తనను కావాలనే రేవంత్ పక్కన పెడుతున్నాడని కూడా యాష్కీ అన్నట్లు తెలుస్తోంది. పైగా సీనియర్లను ప్రతి సందర్భంలోనూ రేవంత్ కించపరస్తున్నాడన్న అసహనం వ్యక్తం చేస్తున్నాడు. మేం లేకుండా మునుగోడులో ఎలా గెలిపిస్తాడో చూస్తాం…సమయం వచ్చినప్పుడు రేవంత్ అంతు చూస్తామన్నట్లుగానే మధుయాష్కి అంతరంగంగా వుంది. ప్రచారానికి రాను…అని ఇప్పటికే పలు మార్లు వెంకటరెడ్డి తేల్చేశాడు…తాజాగా మారోసారి కూడా చెప్పేశాడు.. మీడియా పదే పదే అడుతూనే వుంది…వెంకటరెడ్డి అదే మాట చెబుతూనే వున్నారు…అయినా కాంగ్రెస్ పార్టీలో ఆశ చావడం లేదు. నేను రాను మొర్రో అని వెంకటరెడ్డి ఓ వైపు చెబుతుంటే వస్తాడు నారాజు…ఈ రోజు అన్నట్లు కాంగ్రెస్‌నేతలు చెప్పుకోవడం వింతగా వుంది. అంతే కాదు మునుగోడు అభ్యర్ధిగా బరిలో దిగుతున్న పాల్వాయి స్రవంతి కూడా ఇటీవల తనకు మద్దతుగా ప్రచారం చేయడానికి కోమటిరెడ్డివెంకటరెడ్డి వస్తాడని అమాయకంగా చెప్పడంచూస్తే ఆశ్చర్యమేస్తుంది. వెంకటరెడ్డి ప్రచారానికి రాడని ఆమెకు తెలుసు. నియోజకవర్గంలోని నేతలందరికీ తెలుసు. సీనియర్లందరికీ తెలుసు. అయినా ఎవరిని మోసం చేయడానికి వాళ్లంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జపం చేస్తున్నారన్నది అర్ధం కావడంలేదు. అసెంబ్లీ సమావేశాలు తప్ప…మిగతా సమయాల్లో సిఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క…తన పూర్తి స్ధాయి సమయాన్ని నియోజకవర్గంలోనే గుడపుతున్నారు. ఎవరెట్ల పోతే నాకేంటి? నా నియోజకవర్గంలో పట్టు తప్పకుండా చూసుకుంటే చాలని అనుకుంటున్నారని పార్టీలో కొందరు అంటున్నారు. అలాంటప్పుడు సిఎల్పీ పదవిలో కొనసాగడమెందుకు అన్నంత మాట కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే పిసిసి. పదవి కన్నా, సిఎల్పీ పదవి ఏం తక్కువ కాదు. పిపిసి అధ్యక్షుడికి ఎంత బాధ్యత వుంటుందో అంతకన్నా ఎక్కువ బాధ్యత సిఎల్పీపై కూడా వుంటుంది. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి కేవలం 26సీట్లు వచ్చాయి. ఆ సమయంలో సిఎల్పీ లీడర్‌గా వున్న పి. జనార్ధన్‌రెడ్డి పార్టీకోసం ఆయన అప్పటి ఉమ్మడి రాష్ట్రమంతా పర్యటనలు చేసేవారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. కార్యకర్తలో ఉత్సహం నింపేవారు. అదీ సిఎల్పీ నాయకుడిగా తీసుకోవాల్సిన బాధ్యత. కాని భట్టి విక్రమార్క మాత్రం అంటీ ముట్టనట్టుగానే వుంటున్నాడని అంటున్నారు.
అదేంటో హనుమంతరావు కూడా ఈ మధ్య సైలెంటుగానే వుంటున్నాడు. వద్దన్నా…ఏదో ఒక వివాదం రేపుతూ, నిత్యం వార్తల్లో వుండే హనుమంతరావు కూడా ఈ మధ్య ఎక్కడా నోరు విప్పుతున్నట్టు లేదు. బైటకు రావడం కూడా మానేశాడు. ఒక వేళ హనుమంతరావు మునుగోడులో ప్రచారం చేయాలనుకుంటే, బాధ్యత తీసుకోవాలనుకుంటే పెద్ద సమస్య కాదు. ఒక దశలో మళ్లీతనకు పిపిసి ఇస్తే , రాష్ట్రమంతా తిరుగుతా? పార్టీని బలోపేతం చేస్తా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా? అని హనుమంతరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే…మరి అలాంటి హనుమంతరావు మునుగోడు వైపు ఎందుకు చూడడం లేదు. రాజగోపాల్‌రెడ్డిని ఎందుకు విమర్శించడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం తప్పని ఎందుకు నిలదీయడం లేదు? ఎందుకు సైలెంట్ అయ్యాడు. హైదరాబాద్‌కు మునుగోడు అతి సమీపంలో వుండే నియోజకవర్గం. రాష్ట్రమంతా పర్యటిస్తా…అని చెప్పిన హనుమంతరావు మునుగోడుకు నిత్యం వెళ్లి ప్రచారం చేయడానికి అభ్యంతరమేమిటి? పార్టీ అభ్యర్ధి ఎంపిక జరిగిపోయింది? అయినా హనుమంతరావు ఎందుకు కదలడం లేదు? ఇదే అదును రేవంత్ మీద మునుగోడు దెబ్బపడితే ఇక రేవంత్కథ కంచికే అన్నది సీనియర్ల ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.