జిల్లాలో బిజెపి నాయకుల అరెస్టులు
ఇంటర్ విద్యార్థుల మార్కులలో జరిగిన అవకతవకలపై శాంతియుతంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను అప్రజాస్వామికంగా అడ్డుకొని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ కలెక్టరేట్‌ను ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఉదయం నాలుగుగంటల నుండే బిజెపి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అనంతరం బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయం నుండి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు బయలుదేరారు. వీరిని హనుమకొండ ఏసిపి శ్రీధర్ ఆధ్వర్యంలో హంటర్‌రోడ్‌లో భారీగా పోలీసులను మోహరించి కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న బిజెపి నాయకులను అరెస్టు చేసి పోలీస్ వాహనాలలో సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ ఉదయం నుండి బిజెపి నాయకులను ఎక్కడికక్కడే అరెస్టులు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించడాన్ని బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలతో 24మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని చెప్పారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి, ఇంటర్ బోర్డు కార్యదర్శి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంతమంది విద్యార్థులు బలవన్మరణం చెందిన కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. బంగారు తెలంగాణ కాదు…ఆత్మహత్యల తెలంగాణగా ముఖ్యమంత్రి కేసిఆర్ మార్చారని ఎద్దేవా చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేని కేసీఆర్ ప్రభుత్వమని మండిపడ్డారు. ఇక్కడ ఇంతమంది విద్యార్థులు చనిపోతే కేసీఆర్, కేటీఆర్ ఎమ్మెల్యేలను కొనడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. నేటి వరకు కూడా ప్రభుత్వం నుండి స్పష్టమైన స్పందన రాకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇంత మంది విద్యార్థులు ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. మతిచెందిన ప్రతి విద్యార్థి కుటుంబానికి 25లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థ గురించి తెలియదని మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇప్పటి వరకు కూడా అధికారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, వెంటనే న్యాయ విచారణ జరిపించి బాధ్యులైన వారిపై, వారికి అండగా ఉంటున్న పెద్ద తలకాయలపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మే 2న నిర్వహించనున్న బంద్‌లో ప్రజలందరూ స్వచ్చందంగా పాల్గొని విద్యార్థులకు సంఘీభావం తెలిపాలని పిలుపునిచ్చారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బిజెపి రాష్ట్ర నాయకులు గండ్రతి యాదగిరి, రావుల కిషన్, అర్బన్ జిల్లా నాయకులు కొలను సంతోష్‌రెడ్డి, సంగని జగదీశ్వర్, మండల సురేష్, పాశికంటి రాజేంద్రప్రసాద్, బాకం హరీశంకర్, మామిడాల నరేందర్, నర్సింగ్‌గౌడ్, శేషగిరిరావు, గోగికార్ అనిల్‌కుమార్, గడల కుమార్, నవనగిరి నిర్మల, వలబోజు శ్రీనివాస్, చాంద్‌పాషా, కందగట్ల సత్యనారాయణ, కనకయ్య యాదవ్, జాఫర్, పెరుగు సురేష్, రాజేష్ కన్నా, శేఖర్ తదితరులు ఉన్నారు.