*చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహ దహనంపై భూమన ఆధ్వర్యంలో వైసిపి నిరసన..
*ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి..
తిరుపతి(నేటిధాత్రి) అక్టోబర్04:
ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహ దహనం వంటి దారుణ సంఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ పచ్చ పత్రికల మద్దతుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఫైబర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా ప్రచారం చేయడం దురుద్దేశపూరితమని ఆయన మండిపడ్డారు.
అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం దళితుల ఆత్మగౌరవంపై దాడి అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు సమాజంలో అలజడులు సృష్టించే ప్రయత్నమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ ఘటనపై ఎంపీ మద్దిల గురుమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, కమిషన్ వేగంగా స్పందించి చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసి విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇది దళితుల ఆత్మగౌరవ రక్షణకు సానుకూల పరిణామమని ఎంపీ పేర్కొన్నారు.
ప్రభుత్వం ఈ ఘటనను నిర్లక్ష్యంగా తీసుకోవడం దురదృష్టకరమని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ దహనం జరిగిన మూడు రోజులు గడిచినా నిందితులను పోలీసులు గుర్తించకపోవడం ప్రజల్లో తీవ్ర అసహనం కలిగిస్తోందని పేర్కొన్నారు. దళితుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ఘటనలను సహించబోమని ఆయన హెచ్చరించారుఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, గంగాధర నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.