వరంగల్ వస్త్రవ్యాపారానికి గుండెకాయ
వరంగల్ నగరం వస్త్రవ్యాపార రంగానికి గుండెకాయ లాంటిదని కాకతీయ ఆల్‌షాప్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నగరబోయిన బాబురావు అన్నారు. శుక్రవారం వరంగల్‌లోని ఆర్యవైశ్య భవనంలో యూనియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో అనేకమంది కార్మికులు పనిచేస్తున్నారని, కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత లేకుండా పేదరికంలో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు ఇపిఎఫ్, ఇఎస్‌ఐ అమలు జరగడం లేదని అన్నారు. కార్మికులు న్యాయం కోసం ఐక్యంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. యజమానులు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం నగర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.