votuku velaye, ఓటుకు వేళాయే…

ఓటుకు వేళాయే…

– ఓటింగ్‌కు సర్వం సిద్దం చేసిన ఎన్నికల కమీషన్‌

– పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది

– కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసుశాఖ

– ఎన్నికల విధులకు గైర్హాజరైన పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

– ప్రత్యేక రైళ్లను కేటాయించిన రైల్వేశాఖ

– సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

నేటిధాత్రి బ్యూరో : మొదటిదశ పార్లమెంట్‌ ఎన్నికలకు సర్వం సిద్దమయింది. మరికొద్ది గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఉదయం 8గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్‌ సాయంత్రం 5గంటలకు ముగియనుంది. పోలింగ్‌ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ఎన్నికల కమీషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. వివిధ పోలింగ్‌ కేంద్రాలలో పోలింగ్‌ సరళిని పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం పోలింగ్‌ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వేసవికాలం అయినందున పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎండ తీవ్రతను తగ్గించేందుకు చలువ పందిళ్లు, షామియానాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు పోలింగ్‌ సిబ్బంది బుధవారం ఉదయమే వివిధ పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో పోలీస్‌శాఖ అదనపు భద్రత ఏర్పాట్లను చేసింది.

మొదటి దశకు అంతా సిద్ధం

లోక్‌సభ మొదటి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాజకీయ నేతల భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో ఓట్ల ద్వారా దేశ ప్రజలు తీర్పునివ్వనున్నారు. దేశంలోని 543 స్థానాల్లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 11న (గురువారం) దేశంలోని మొత్తం 91 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలను సిద్ధం చేశారు. అవి మొరాయిస్తే వెంటనే సరిచేయడానికి నిపుణులను నియమించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 25, తెలంగాణలోని 17, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 2, అసోంలోని 5, బిహార్‌లోని 4, ఛత్తీస్‌గఢ్‌లోని 1, జమ్ముకశ్మీర్‌లోని 2, మహారాష్ట్రలోని 7, మణిపూర్‌లోని 1, మేఘాలయలోని 2, మిజోరంలోని 1, నాగాలాండ్‌లోని 1, ఒడిశాలోని 4, సిక్కింలోని 1, త్రిపురలోని 1, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8, ఉత్తరాఖండ్‌లోని 5, పశ్చిమ్‌బెంగాల్‌లోని 2, లక్షద్వీప్‌లోని 1, అండమాన్‌ నికోబార్‌లోని 1స్థానాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయి.

అసెంబ్లీ ఎన్నికలు..

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయి.

ఒడిశాలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలు 147 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటికి ఏప్రిల్‌ 11, 18, 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌లో 2 లోక్‌సభ స్థానాలు 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటన్నింటికీ గురువారం ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి.

సిక్కింలో ఒక లోక్‌సభ స్థానం, 32శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటికీ గురువారం ఒకేదశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎన్నికల వేళ.. 36 ప్రత్యేక రైళ్లు!

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. వేలాదిమంది ప్రయాణికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్వస్థలాలకు బయలుదేరారు. ఈ సందర్భంగా దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో సతీష్‌ మాట్లాడుతూ ప్రతిరోజు హైదరాబాద్‌ నుంచి ఆంధ్రాకు 40రైళ్లు ప్రయాణిస్తున్నాయని తెలిపారు. ఇవేకాకుండా వేసవి, ఎన్నికల రద్దీ దష్ట్యా రానున్న మూడురోజుల్లో ప్రత్యేకంగా 36రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు. గుంటూరు, విజయవాడ, విశాఖకు ప్రతిరోజు 28 రైళ్లు నడుస్తుండగా..రోజుకు 11 రైళ్ల చొప్పున అదనంగా నడపనున్నారు. గుంతకల్‌, కర్నూలు, తిరుపతికి 16 రైళ్లు ఉన్నప్పటికీ అదనంగా 9 రైళ్లు నడుపుతామని తెలిపారు.

తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి…

సీఇఓ రజత్‌కుమార్‌

తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ రాష్ట్ర సిఇఓ రజత్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 15 నియోజకవర్గాలలో పోలింగ్‌ సామగ్రి చేరుకున్నాయని, నిజామాబాద్‌లో సామగ్రి మారుమూల గ్రామాలకు వెళ్ళడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా బుధవారం రాత్రికి పోలింగ్‌ సామగ్రి చేరుకుంటుందని, గురువారం ఉదయం 5.30కి మాక్‌ పోలింగ్‌ ప్రారంభం అవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7గంటల నుండి పోలింగ్‌ ప్రారంభమవుతుందని, నిజమాబాద్‌లో ఉదయం 8నుండి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో 5గంటల వరకు లైన్లో ఉండే వారికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఓటర్‌ స్లిప్‌ ఐడి ప్రూఫ్‌ కాదు..12రకాల గుర్తింపు కార్డులు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవచ్చునని తెలిపారు. 48లక్షల మందికి ఓటర్‌కార్డులు పంపిణీ చేసామని, ఓటరు లిస్ట్‌లో పేరు ఉందో…లేదో చెక్‌ చేసుకోవాలని, ఎపిక్‌ ఉంటే ఓటు ఉన్నట్టు కాదని అన్నారు. ఓటర్లు పోలింగ్‌ బూత్‌లలో మొబైల్‌ అనుమతించబడవని, ఏదైనా ఇబ్బంది కలిగితే తప్ప అక్కడ అధికారి మాత్రమే మొబైల్‌ తీసుకెళ్తారని, కానీ ఎవరూ కూడా పోలింగ్‌ తేదీన మొబైల్‌ తీసుకొని రాకూడదని చెప్పారు.

ఏర్పాట్లు పూర్తయ్యాయి…

నిజామాబాద్‌లో 600మంది ఇంజనీర్లు విధుల్లో ఉంటారని, మొత్తం 2లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై వచ్చిన కంప్లైంట్‌ ఓ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇసిఐ నేడు నోటీస్‌ ఇచ్చిందని, 171 కేసు కింద కొండ సందీప్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యిందని, కానీ కొండ విశ్వేశ్వరరెడ్డికి సంబంధం లేదు అని తాను చెప్పారు…టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఇప్పుడు పిర్యాదు చేసిందని, 55వేల పోలీస్‌ సిబ్బంది పోలింగ్‌ భద్రతలో ఉంటారని, 3లక్షల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. ప్రగతిభవన్‌లో చేరికలు జరుగుతున్నాయని, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారని ఇసిఐకి నివేదించామని, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజామాబాద్‌లో ఒక్కో బూత్‌ లో 12మెషీన్లు వాడుతున్నామని, అదనపు గదులు తీసుకుని మాక్‌ పోలింగ్‌కు ఉపయోగించుకునున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *