vidudala cheyali, విడుదల చేయాలి

విడుదల చేయాలి

పౌరహక్కుల సంఘం, టివివి విద్యార్థి నాయకులను బేషరతుగా విడుదల చేయాలని యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌ వర్గం నాయకులు, డిఎస్‌ఓ రాష్ట్ర నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారంలోకి రాక ముందు అనేక వాగ్దానాలు చేసారని, వాటిలో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని 49 వేలకుపైగా ఉన్న గొలుసుకట్టు చెరువులను పునర్నిర్మిస్తామని, కోటిఎకరాలకు నీటిని అందిస్తామని వాగ్దానం చేశారని తెలిపారు. గొలుసుకట్టు చెరువులను పునర్నిర్మించకపోగా భారీ ఖర్చుతో కూడిన భారీ ప్రాజెక్టులకు పూనుకున్నారన్నారు. అందులో భాగమే మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారని, దానివలన అనేకమంది రైతులు, కూలీలు, పేద ప్రజలు నిర్వాసితులవుతున్నారని విమర్శించారు. నిర్వాసితులవుతున్న రైతులు, కూలీలు, పేదప్రజలు మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండగా వారిని కలిసి పోరాటానికి సంఘీభావం తెలిపివస్తున్న పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మన్‌, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, సంయుక్త కార్యదర్శి రఘునాథ్‌, మెదక్‌ జిల్లా అధ్యక్షుడు భూపతి లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌తో సహా 10మందిని తోగుట్టస్టేషన్‌ వద్ద అక్రమంగా పోలీసులు నిర్బంధించారని అన్నారు. అలాగే ప్రొఫెసర్‌ సాయిబాబా, వరవరరావులను దేశవ్యాప్తంగా అరెస్టు చేసిన హక్కుల కార్యకర్తలను, ఆదివాసీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని, బీమా కోరేగావ్‌ కేసును రద్దు చేయాలని క్రూరమైన నిర్బంధపూరిత ‘ఉపా’ చట్టాన్ని వెంటనే ఎత్తిచేయాలని చెప్పారు. వరంగల్‌లో రాజ్య నిర్బంధ వ్యతిరేక యాత్రను శాంతియుతంగా నిర్వహిస్తున్న టివివి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌ వర్గం తీవ్రంగా ఖండిస్తూ అక్రమంగా అరెస్టు చేసిన పౌరహక్కుల సంఘం నేతలను, వరంగల్‌లో టివివి విద్యార్థి నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌ వర్గం రాష్ట్ర నాయకుడు జి.సదానందం, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డిఎస్‌ఓ) రాష్ట్ర నాయకుడు అర్షం అశోక్‌, ఎం.అనిల్‌కుమార్‌ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *