మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు
జైపూర్, నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని రామారావు పేట మరియు ఇందారం గ్రామాలలో శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని,రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా శుభ్రం చేయించాలని, గ్రామంలో ఎక్కడా ప్లాస్టిక్ చెత్త కనబడకుండా చూసుకోవాలని, ప్రతీ రోజు రహాదారులు మరియు మురుగు కాలువలను శుభ్రం చేయాలని, గ్రామ పంచాయితీ ట్రాక్టర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ వంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు విధిగా నిర్వహించాలని పంచాయితీ కార్యదర్శులకు మరియు పారిశుధ్య కార్మికులకు తెలియజేశారు. గ్రామాలలో ఉన్నటువంటి నర్సరిలో ప్రతీ బ్యాగు తడిచే విదంగా ప్రతీ రోజు ఉదయం సాయంత్రం నీళ్ళు పోయించాలని సూచించడం జరిగింది. సెగ్రిగేషన్ షెడ్ లను సందర్శించి కంపోస్ట్ పిట్ లో కంపోస్ట్ ఎరువు తయారీ విధానమును పరిశీలించి, కంపోస్ట్ ఎరువు తయారీ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని, తయారు చేసిన కంపోస్ట్ ఎరువును నర్సరీ మరియు పల్లె ప్రకృతి వనంలో పెంచుతున్నటువంటి మొక్కలకు వినియోగించాలని పంచాయితీ కార్యదర్శులకు తగు సూచనలు చేయడం జరిగింది. స్మశాన వాటికల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, స్మశాన వాటికల పరిసరాలలో ఉన్న మొక్కలను సంరక్షించాలని తెలిపారు. గ్రామాలలో త్రాగు నీటి సరఫరా చేసే ఓహెచ్ఎస్ఆర్,మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను మరియు బోర్ వెల్ మోటార్ల ను పరిశీలించి, ఎండాకాలంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున గ్రామాలలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య లేకుండా చూసుకోవాలని, ఎక్కడైనా సమస్య ఏర్పడినట్లయితే తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. త్రాగునీటి సమస్యలు ఏర్పడకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పంచాయితి సిబ్బందికి సూచించారు. అనంతరం ఇందారం మరియు రామారావు పేట గ్రామ పంచాయితీ రికార్డులను తనిఖీ చేయడం జరిగింది.ఈ రెండు గ్రామాల పర్యటనలో మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర్ రావు, జైపూర్ మండల పంచాయతీ అధికారి జి.అనిల్ కుమార్, రామారావు పేట గ్రామపంచాయతీ కార్యదర్శి పి.సురేష్, ఇందారం గ్రామపంచాయతీ కార్యదర్శి ఏ.సుమన్ మరియు గ్రామ పంచాయితీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పాల్గొన్నారు.