trslo intidonga, టిఆర్‌ఎస్‌లో ఇంటిదొంగ

టిఆర్‌ఎస్‌లో ఇంటిదొంగ

వరంగల్‌ టిఆర్‌ఎస్‌ అర్బన్‌లో ఇంటి దొంగల పోరు పార్టీకి ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే వీరిలో కొంతమంది బయటకు కనపడుతుంటే మరికొంతమంది గుట్టుచప్పుడు కాకుండా పని కానిస్తున్నారు. పార్టీలో కొనసాగుతూనే ఇతర పార్టీలతో అంటకాగుతూ అంతర్గతంగా టిఆర్‌ఎస్‌ పార్టీపై చెప్పరాని విమర్శలు చేస్తున్నారు. వివిధ పార్టీలను వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన కొంతమంది నాయకులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన రాజనాల శ్రీహరి పార్టీలో కొనసాగుతున్నా టిఆర్‌ఎస్‌ పార్టీపై తనకు ఎంత కోపం ఉందో నిరూపించుకున్నాడు. కాంగ్రెస్‌ వాసన పొగొట్టుకోలేక సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి కేసిఆర్‌కు వ్యతిరేకంగా పోస్టింగులు చేస్తూ దొరికిపోయాడు. బుధవారం వరంగల్‌లోని ఓ గ్రూపులో దొర అంటేనే అహంకారం…ఫకర్‌ అంటూ ఉన్న ఓ వీడియోను పోస్టు చేసి తన ఇంటి దొంగ బుద్దిని బయటపెట్టుకున్నాడు. రాజనాల తీరుతో ఆశ్చర్యపోయిన గ్రూపులోని కొంతమంది వ్యక్తులు, జర్నలిస్టులు మీరు పార్టీ ఫిరాయించారా…అని ప్రశ్నిస్తే పొరపాటులో వీడియో సెండ్‌ అయిందని సమాధానమిచ్చాడు. ‘నేటిధాత్రి’ ప్రతినిధి ఫోన్‌ చేసి ఈ విషయమై ప్రశ్నిస్తే వేరే గ్రూపులో పోస్టు చేయబోయి ఆ గ్రూపులో పోస్టు చేశానని చెప్పాడు. రాజనాల సమాధానాన్ని బట్టి చూస్తే మీడియా ప్రతినిధులు ఉన్న గ్రూపుల్లో టిఆర్‌ఎస్‌ వ్యతిరేక వీడియోలు పోస్టు చేయకుండా ఇతర గ్రూపుల్లో వ్యతిరేకంగానే రాజనాల శ్రీహరి పోస్టింగులు చేస్తున్నాడని సమాధానాన్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది. కాంగ్రెస్‌ వాసన ఇంకా పోని రాజనాల టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాడని సోషల్‌ మీడియా గ్రూపుల్లోని సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *