టి ఆర్ పి నాయకుల ధర్నా
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు భూపాలపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి పటేల్ రోడ్డు మీద బైఠాయించి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం మాట్లాడుతూ రవి పటేల్ పేర్కొన్నదేమనగా— తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే ఇప్పుడు పాత రిజర్వేషన్ విధానాలకే కట్టుబడి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం కాంగ్రెస్ మోసపూరిత ధోరణికి నిదర్శనమని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రాజకీయ సత్తా చాటే సమయం ఇదేనని, ఈ వర్గాల్ని ఒక్కటిగా కలుపుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలంగా ముందుకు సాగుతుందని రవి పటేల్ తెలిపారు. “65 శాతం బీసీలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సమూహ బలం కలిసి వస్తే మాత్రమే నిజమైన రాజ్యాధికారం సాధ్యం. ఈ అగ్రవర్ణ పార్టీలు బహుజనులకు న్యాయం చేయవు. కేవలం బీసీల కోసం పుట్టిన పార్టీ మా టీఆర్పీ,” అని అన్నారు.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్పీ పార్టీ పోటీలో ఉన్నదని, ఆసక్తి ఉన్న వారందరూ తమను సంప్రదించాలని, ఎటువంటి భారీ ఖర్చులేమీ లేకుండానే గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని రవి పటేల్ హామీ ఇచ్చారు.
జిల్లాలో బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బహుజనులు కలసి బుద్ది చెప్పాల్సిన రోజులు వచ్చాయని, పెద్ద ఎత్తున యువత టీఆర్పీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు
