డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు డాక్టర్ అంబేద్కర్ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా హక్కుల కోసం చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శమని కొనియాడారు. రాజ్యాంగ రూపకర్తగా ఆయన చేసిన కృషి భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పేర్కొన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం నేటికీ ప్రాసంగికమని తెలిపారు.ఈ వేడుకల్లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నరు
