త్వరలో కెయులో డిసాస్టర్ మేనేజ్మెంట్ కోర్సు
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ విద్యాసంవత్సరంలో డిసాస్టర్ మేనేజిమెంట్ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టాలని మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఆర్.సాయన్నను వరంగల్ రెడ్‌క్రాస్ సొసైటీ కోశాధికారి ఎం.నాగయ్య, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడు ఈ.వీ.శ్రీనివాస్‌రావు, జిల్లా పాలకవర్గ సభ్యుడు బొమ్మినేని పాపిరెడ్డి కలిసి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఆర్.సాయన్న మాట్లాడుతూ ఏదేని డిసాస్టర్ జరిగినపుడు ఏ విధంగా ప్రాణాలను కాపాడుకోవాలని, ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలు డిసాస్టర్ మేనేజిమెంట్ చేసిన వారికి తెలుస్తుందని అన్నారు. డిసాస్టర్ మేనేజ్మెంట్ పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, త్వరలో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ విద్యాసంవత్సరంలో డిసాస్టర్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తామన్నారు.
తలసీమియా బాధితుల కోసం…
కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో త్వరలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. వరంగల్ రెడ్‌క్రాస్ సొసైటీ పాలకవర్గ సభ్యులు తలసీమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు రోజు 10 నుండి 20 యూనిట్ల రక్తం అవసరం అని, రక్తనిధి కేంద్రంలో రక్తనిల్వలు తగ్గి వ్యాధిగ్రస్తులు తీవ్రఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్బంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఆర్.సాయన్న కాకతీయ యూనివర్సిటీ అద్వర్యంలో త్వరలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని తెలిపారు.