తహశీల్దార్లకు గుబులు పట్టుకుంది
ఓవైపు రెవెన్యూశాఖలో ప్రక్షాళన దిశగా సీఎం కేసిఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. మరోపక్క రెవెన్యూ బాధితులంతా తమ గోడును సర్కార్‌కు వెళ్లబోసుకుంటున్నారు. మునుపెన్నడు లేనివిధంగా రెవెన్యూశాఖలో ఉద్యోగుల మూలంగా జరిగిన తప్పిదాలన్ని ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నాలుగు అడుగుల భూమి ఉన్న అది మనదే అనిపించుకోవడం కోసం అటు కబ్జాదారులను ఇటు రెవెన్యూ అధికారులను ఎలా ఎదుర్కొవాలో తెలియక మెజార్టీ జనాలు సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో భూకబ్జా ఆరోపణలు వచ్చిన, కబ్జాల్లో తలదూర్చి బాధితులకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. హన్మకొండలోని గోపాల్‌పూర్ భూసమస్యే ఇందుకు తాజా ఉదాహరణ. భూమిని కబ్జా చేసి, నకిలి దస్తావేజులు సృష్టించి కాజేయాలని చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అంతేకాదు ఇందుకు తన రెవెన్యూ తెలివితో సహకరించి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన తహశీల్దార్ నాగయ్యను సైతం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తహశీల్దార్లలో గుబులు
రిటైర్డ్ తహశీల్దార్ నాగయ్య అరెస్ట్‌తో రిటైర్డ్ తహశీల్దార్లలో, ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో గుబులు పట్టుకుందట. సర్వీసులో కొనసాగుతున్న సమయంలో మాజీ తహశీల్దార్ నాగయ్య రెవెన్యూశాఖలో అన్ని తానై వ్యవహరించారు. హన్మకొండ తహశీల్దార్‌గా పనిచేస్తున్నప్పుడు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన అడిగిన వారికల్లా భూమిని పంచిపెట్టాడని అప్పట్లో ప్రచారం జరిగింది. నాగయ్య కొంతమందికి కేటాయించిన భూములను అప్పటి జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుని మరీ వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. అయితే రెవెన్యూ అధికారుల విషయంలో, వారు అనుసరిస్తున్న తీరుపై సర్కార్ డేగకన్ను వేయడంతో తహశీల్దార్లకు భయం పట్టుకుందట. గతంలో చేసిన తప్పిదాలను సైతం వెలికితీస్తు ఆరోపణలు వస్తే విచారణ జరిపి నిజమని తేలితే మాజీ ఉద్యోగులను సైతం అరెస్ట్ చేస్తుండడంతో కొంతమంది మాజీ తహశీల్దార్లు తాము ఎక్కడైన తప్పు చేశామా…? అని సమీక్షించుకునే పరిస్థితి ఏర్పడిందట. రాష్ట్రవ్యాప్తంగా భూసమస్యలు అధికంగానే ఉండగా వీటి పరిష్కారంలో తహశీల్దార్లదే కీలకపాత్ర. అయితే వీరు భూహక్కుదారులతో వ్యవహరిస్తున్న తీరు, వారు పరిష్కారం చేస్తున్న విధానంపై ఇంటలీజెన్స్ వర్గాలు సైతం ఓ కన్నువేసి ఉంచాయట. భూమిసమస్యల పరిష్కారం కోసం భూయజమానుల వద్ద నుంచి డబ్బులు ఆశించడం. అసలు హక్కుదారులను కాదని అన్యాయంగా భూమిని ఆక్రమించుకున్న వారికి తహశీల్దార్లు ఎవరైన సహయం చేసినట్లు తెలిసినా, కావల్సింది తీసుకుని డాక్యుమెంట్లు సృష్టించి ఇచ్చిన కఠినచర్యలు తీసుకోవడానికి పోలీస్‌శాఖ ఎంతమాత్రం వెనుకాడకపోవడంతో తహశీల్దార్లు భూసమస్యల పరిష్కారం విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి సర్కార్ రెవెన్యూశాఖ విషయంలో సీరియస్‌గా ఉండడంతో తహశీల్దార్లలో గుబులు పట్టుకుంది.