పొన్నారం అన్నదాతల ఆగ్రహం
వడ్ల బస్తాలకు నిప్పు పెట్టి రైతుల నిరసన
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, మిల్లర్ల దోపిడీకి నిరసనగా ఆగ్రహోదగ్రులైన రైతులు కొనుగోలు కేంద్రంలోని ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి తమ నిరసనను తెలియజేశారు.ఐకేపీ సెంటర్‌కు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు తూకం వేయడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అసలు ఈ కొనుగోలు సెంటర్ ఏర్పాటు కొరకు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 15 రోజుల పాటు పోరాటం చేసి సాధించుకున్నామని,తీరా సెంటర్ తెరిచాక కూడా తమకు కష్టాలు తప్పడం లేదని వారు మండిపడ్డారు.ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా మోసపోతున్నారని ఆరోపించారు.ఒకవైపు సకాలంలో తూకాలు వేయకపోగా,మరోవైపు మిల్లర్లు దందాలకు పాల్పడుతూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నియమ నిబంధనల ప్రకారం 40 కిలోలు జోకవలసిన సంచిని 41 కిలోలుగా జోగుతూ.. మళ్లీ అందులో తరుగు, రాళ్లు ఉన్నాయనే సాకుతో బస్తాకు 38 కిలోలుగానే లెక్కిస్తున్నారని,ఇలా ప్రతి బస్తాకు మూడు కిలోల చొప్పున కటింగ్ చేస్తూ అన్యాయం చేస్తున్నారని రైతులు ధ్వజమెత్తారు.మిల్లర్ల అక్రమ దందాకు వ్యతిరేకంగా కొనుగోలు కేంద్రంలో రైతులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని,రైతులను నష్టపరుస్తున్న మిల్లర్ల దందాను అంతం చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి,మిల్లింగ్ దోపిడీపై చర్యలు తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని పొన్నారం రైతులు డిమాండ్ చేస్తున్నారు.
