తెలంగాణ వీరప్పన్ చిక్కాడు
నేటిధాత్రి బ్యూరో : గత కొద్ది సంవత్సరాలుగా అటు పోలీసులను, ఇటు ఫారెస్టు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్ శ్రీను అలియాస్ తెలంగాణ వీరప్పన్ అలియాస్ పోతారం శ్రీను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనుతోపాటు కలప స్మగ్లింగ్‌లో ఆయనకు సహకరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం కమీషనరేట్‌లోని మంథని పోలీస్‌స్టేషన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఒక స్కార్పియో వాహనం, భారీగా టేకు కలపను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఖేల్ ఖతమేనా…?
తెలంగాణ, మహారాష్ట్రలో యథేచ్చగా కలప వ్యాపారం చేస్తున్న తెలంగాణ వీరప్పన్ కథ ఈ అరెస్టుతో ముగిసినట్లేనా అనే అనుమానం కలుగుతుంది. గత 10సంవత్సరాలుగా పోలీసులకు కోట్ల రూపాయల కలప వ్యాపారం చేస్తూ అధికారులను సైతం ఇతగాడు గడగడలాడించాడు. కొత్తకొత్త పద్ధతుల్లో కలప వ్యాపారం చేస్తూ ఫారెస్ట్ అధికారులు, పోలీసుల కళ్లు గప్పి తిరిగి ఎట్టకేలకు చిక్కాడు. కలప స్మగ్లింగ్‌లో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. ఎవరు సహకరిస్తున్నారు. తదితర విషయాలు పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
సూత్రధారులకు గుబులు
తెలంగాణ వీరప్పన్ అలియాస్ శ్రీను అరెస్టుతో ఇంతకాలంగా అతనికి సహకరిస్తున్న కొందరికి గుబులు మొదలైనట్లు తెలిసింది. అరెస్టు అయిన తెలంగాణ వీరప్పన్ తమ పేరు ఎక్కడ చెబుతాడోనని వారు భయపడుతున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా వాటాలు అందుకుంటూ స్మగ్లర్‌కు సహకరిస్తూ వస్తున్న వారు సైతం తమ పేర్లు ఎక్కడ చెబుతాడోనని వణికిపోతున్నారట. మొత్తానికి తెలంగాణ వీరప్పన్ అరెస్టు అటు అధికారుల్లో ఇటు రాజకీయ నాయకుల్లో గుబులు రేపుతుందట.