వినతులను సకాలంలో పరిష్కరించాలి.

#వినతులను సకాలంలో పరిష్కరించాలి*

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఆర్టిఐ యాక్ట్,ప్రజావాణి దరఖాస్తుల పరిష్కరణపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వివిధ సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు సమర్పించిన వినతులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో
ఆర్టిఐ యాక్ట్, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కరణ పురోగతి,శాఖల వారిగా కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీఐపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,చట్టం అమలు..ఎదురయ్యే సవాళ్లు చట్టాన్ని సమర్ధవంతంగా ఉపయోగించడం వంటి అంశాలపై కలెక్టర్ అధికారులకు కూలంకషంగా వివరించారు.పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో సరైన రూపంలో అందించాలని అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత జవాబుదారీతనం పెంచడానికి ఆర్టీ ఐ చట్టం అమలు చేయడం జరుగుతున్నదని అన్నారు.ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షిస్తూ ప్రతివారం స్వీకరించిన సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ఆ వారంలోనే ఖచ్చితంగా పరిష్కరించాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని శాఖల అధికారులు వారి శాఖల ద్వారా అమలు చేసే కార్యాచరణ ప్రణాళిక వెంటనే సమర్పించాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కొండా సురేఖ స్వీకరించిన…

ప్రజల నుంచి విజ్ఞప్తులను వినతులను స్వీకరించిన మంత్రి కొండా సురేఖ

హన్మకొండ, నేటిధాత్రి:

అటవీ,పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ హనుమకొండ రామ్ నగర్ లో తమ నివాసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు రాంనగర్ లోని తమ నివాసానికి చేరుకుని తమ సమస్యలను మంత్రి కొండా సురేఖకి విన్నవించారు. వారి సాధకబాధకాలను మంత్రి కొండా సురేఖ గారు సహృదయంతో విని సంబంధిత పలువురు అధికారులతో అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. సులువుగా పరిష్కరించాల్సిన సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను మంత్రి సురేఖ మందలించారు. మరోసారి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలకు వెనకాడనని మంత్రి సురేఖ వారికి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఏ సమస్యలున్నా ప్రజలు తనను సంప్రదించవచ్చునని కొండా సురేఖ ప్రజలకు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం దిశగా అధికారుల నుంచి సరైన స్పందన లేనిపక్షంలో తనకు తెలియజేయాలని వారికి సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలజీవితాల్లో వెలుగులు నింపేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని మంత్రి కొండా సురేఖ వారికి భరోసానిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version