నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలను అందించడం కోసం వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 216 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని,నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. అనంతరం హాజీపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే తో కలిసి సందర్శించారు.భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జాతీయ రహదారి 63 నిర్మాణంలో భాగంగా భూసేకరణ కార్యక్రమానికి సంబంధించి అవార్డుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.వివిధ రకాల ధ్రువపత్రాల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా ధ్రువపత్రాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ డి.ఈ.సజ్జత్ భాషా, ఈ.ఈ.లక్ష్మీనారాయణ, ఎ.ఈ.ఈ.అనూష,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.