దోచిన సొమ్మును దోసుకుపోయారు..!

దోచిన సొమ్మును దోసుకుపోయారు..!

నకిలీ ఏసీబీ అధికారుల పేరిట టోకరా

వరంగల్ ఆర్టీఏ అధికారులకు ఫోన్ చేసి రూ.10లక్షల 20వేలు లాగేసిన దుండగులు

ఏసీబీ డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన బాధిత ఎంవీఐ

మిల్స్ కాలని పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసిన ఆర్టీఏ అధికారులు

జరిగిన సంఘటనను ధృవీకరించిన వరంగల్ ఆర్టీఏ అధికారులు

నేటిధాత్రి, వరంగల్.

 

ఏసీబీ అధికారులమంటూ చెప్పి ఆర్టీఏ అధికారులను మోసం చేసిన ఘటన వరంగల్‌లో సంచలనం సృష్టించింది. నకిలీ ఏసీబీ అధికారుల పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు వరంగల్ ప్రాంతంలోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను (ఎంవీఐలు) సంప్రదించి రూ.10 లక్షల 20 వేల రూపాయలు లాగేశారు. ఇటీవల ఏసీబీ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నకిలీ గ్యాంగ్ ఆ అవకాశం దక్కించుకుంది.

 

సమాచారం మేరకు, అక్టోబర్ 18న, 98868 26656, 98804 72272, 95919 38585 నంబర్ల నుంచి వరుసగా ఎంవీఐలకు ఫోన్లు చేశారు. “మీపై అవినీతి ఆధారాలు ఉన్నాయి, అరెస్ట్ కాకుండా ఉండాలంటే డబ్బులు పంపించండి” అంటూ బెదిరించగా, భయంతో ఎంవీఐలు దశలవారీగా రూ.10 లక్షల 20వేలు తెలియని అకౌంట్లకు పంపినట్లు సమాచారం. తర్వాత జైపాల్ రెడ్డి ఎంవీఐకి అనుమానం రావడంతో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను సంప్రదించాడు. విచారణ జరిపిన డీఎస్పీ “అలాంటి కాల్స్ మేము చేయమని, ఇలాంటి వ్యక్తులు నకిలీ ఏసీబీ పేరుతో మోసం చేస్తున్నారు” అని స్పష్టం చేశారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అధికారులకు సూచించారు. అయితే, మోసపోయిన అంశం బయటకు రావద్దని ఎంవీఐలు గుట్టుగా ఉంచేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.

 

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, మిల్స్ కాలనీ పోలీసులు మాత్రం ఇప్పటివరకు అధికారిక ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఇదే అంశంపై నేటిధాత్రి వరంగల్ ప్రతినిధి ఫోన్ ద్వారా ఆర్టీఏ అధికారులను సంప్రదించగా నిజమే అని తెలిపారు. పోలీసు స్టేషన్ లో సైతం పిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇక ఈ ఘటనపై చర్చలు ముదురుతున్నాయి. అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ అధికారుల పనిని, నకిలీ ఏసీబీ అధికారులు పేరిట దుండగులు చేయడంతో వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో కలకలం రేగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version