ఘనంగా కాళోజి జయంతి వేడుకలు
భూపాలపల్లి నేటిధాత్రి
సాహిత్యం ద్వారా సమాజ మార్పుకు కృషి చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావును స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాళోజీ రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయని, ఆయన జీవితం అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. తన కవిత్వం ద్వారా స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి, తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన మహాకవి కాళోజి నారాయణరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు.
తెలంగాణా భాషా దినోత్సవంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న నిర్వహించడం ద్వారా కాళోజి సాహిత్య సేవలను స్మరించుకోవడం గర్వకారణమని, కాళోజి కవిత్వంలో మన భాష, మన భూమి, మన సంస్కృతి ప్రతిబింబించాయని పేర్కొన్నారు. కాళోజి కవి మాత్రమే కాదని, సామాజిక చైతన్యానికి మార్గదర్శకులని కొనియాడారు.
కాళోజి చూపిన మార్గంలో సాగితే మన భాష, మన సంస్కృతి మరింత వెలుగొందుతాయని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.