“పేదల ఆకలికేకలు లేకుండా చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం”
రాజాపూర్ మండలానికి 433 కొత్త రేషన్ కార్డులు.
జడ్చర్ల /నేటి ధాత్రి
రాష్ట్రంలోనీ పేదల ఇళ్లల్లో ఆకలికేకలు లేకుండా చూడటమే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి వెల్లడించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలోని జెకె ప్యాలెస్ లో నిర్వహించిన నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని,మండల కేంద్రంలో రూ. 30 లక్షలతో వేస్తున్న సిసి రోడ్డు మరియు అండర్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యంమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది ప్రతి పేద కుటుంబానికి భరోసా అని ప్రస్తావించారు. భవిష్యత్తుకు ఆర్థిక బలంతో పాటు, పేదల ఆకలి తీర్చడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఈ ప్రక్రియ కీలకమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
రాజాపూర్ మండలానికి 433 కొత్త రేషన్ కార్డులు,1667 పాత కార్డులకు ఆడిషన్స్ పూర్తయ్యాయని తెలిపారు. గతంలో అర్హులు ఎన్నో ఏళ్లు రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయని గుర్తు చేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.