విషాదంలో ప్రజలు వినోదంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య
* మీర్జాగూడలో రోడ్డు ప్రమాద ఘటన వద్ద ఎమ్మెల్యేకు నిరసన సేగ
•ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకుండా ప్రారంభోత్సవాలు
* ఎమ్మెల్యే బాటలోని ఆయన అనుచర గణం
* నియోజకవర్గ ప్రజలు చీదరించుకుంటున్న పట్టింపులేని ఎమ్మెల్యే
•అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాలే యాదయ్య
•ఆస్తులు, పదవులను కాపాడుకునేందుకే ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కాలే యాదయ్య
•మాజీ ఎమ్మెల్యేగా మారెందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్న ప్రజలు
చేవెళ్ల, నేటిధాత్రి:
అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శనివున్నట్లు చేవెళ్ల నియోజకవర్గం ఓటర్ల దుస్థితి. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కాలే యాదయ్య నియోజకవర్గ ప్రజల్ని నిండా ముంచుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో తన ఆస్తులను, పదవిని కాపాడుకునేందుకే పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజల మీద ప్రేమతో కాదని స్థానిక ప్రజలు అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికై పార్టీలు మారినట్లు చెబుతున్న ఎమ్మెల్యే ఇప్పటివరకు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, నియోజకవర్గ ప్రజలు వరుసగా మూడు సార్లు కాలే యాదయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఓరగబెట్టింది ఏమి లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* ఘోర రోడ్డు ప్రమాద ఘటన వద్ద ఎమ్మెల్యేకు నిరసన సేగ
హైదరాబాదు బీజాపూర్ జాతీయ రహదారి చేవెళ్ల నియోజకవర్గం మీర్జాగూడ వద్ద ఈనెల 3వ తేదీన సోమవారం ఉదయం 6.15 గంటలకు ఘోర రోడ్డు రోడ్డు ప్రమాదం జరిగితే తాఫీగా అందరూ వచ్చాక 9 గంటలకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యకు స్థానిక ప్రజల నుంచి నిరసనసెగ తగిలింది. ఈ ప్రమాదానికి కారణం గత 10ఎళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులే కారణమంటూ ఎమ్మెల్యే కాలే యాదయ్యను స్థానిక ప్రజలు అడ్డంగా నిలదీశారు. 2018 లో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పనులు ప్రారంభం కావాల్సి ఉండగా మీరేం చేశారని ఎమ్మెల్యేను స్థానికులు సూటిగా ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే మీరేం చేస్తున్నారని, ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారని స్థానికులు నిలదీశారు. అనంతరం ఎమ్మెల్యే గో బ్యాక్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఓ సందర్భంలో ఎమ్మెల్యే పై స్థానిక ప్రజలు రాళ్లుతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యే చేసేది ఏమీ లేక నోరు మెదపకుండా సైలెంట్ గా అక్కడి నుంచి పారిపోయాడు. గత ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నియోజకవర్గ ప్రజల నుంచి పలు గ్రామాల్లో నిరసన సెగ తగిలింది. అయినగాని ఎమ్మెల్యే కాలే యాదయ్యలో ఎలాంటి మార్పు రాదని వచ్చే ఎన్నికల్లో కాలే యాదయ్య మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోతారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
•శవాల మీద ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
ఒకవైపు నియోజకవర్గం ప్రజలంతా ఘోర రోడ్డు ప్రమాదంలో 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయి తీవ్ర ఆవేదనలో శోకసంద్రంలో ఉంటే అదేమీ పట్టనట్లు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తో కలిసి షాబాద్ మండలంలో పలు ప్రారంభోత్సవాలు చేశారు.ఈ ఘోర రోడ్డు ప్రమాదం వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా యావత్తు దేశ వ్యాప్తంగా ఈ ఘటన ప్రజలందరినీ కలిచివేయటం, అందరు దిగ్బ్రాంతికి గురై శోక సంద్రంలో మునిగిపోయారు. ఓవైపు శవాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అవుతుండగానే మానవత్వం లేని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఆయన అనుచరులతో కలిసి మానవత్వాన్ని మంట కలిలిపేలా షాబాద్ మండల పరిధిలో మాచన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్, పునరుద్ధరించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, పార్కును ప్రారంభించారు. అనంతరం పార్కులో ప్రారంభమైన క్రీడా పరికరాలపై విన్యాసాలు చేస్తూ ఆనందం పొందారు.
•రంగులు మార్చడంలో మమ్మల్ని మించిన వారే లేరయ్యా.
చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం, వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తాజా ఎమ్మెల్యే కాలే యాదయ్య రంగులు మార్చడంలో మిమ్మల్ని మించిన వారే లేరయ్యా అన్న ధోరణిలో, విశ్వదాభిరామ వినురవేమా అని వేమన పద్యాన్ని నిజం చేశారు.కేవలం నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ఊసరవెల్లి రంగులు మార్చినట్టు పార్టీల జెండాలను మార్చటంలో తాజా ఎమ్మెల్యే కాలే యాదయ్య చరిత్ర సృష్టించారు.వరుసగా మూడుసార్లు కాలే యాదయ్యను నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మూడుసార్లు పార్టీలను మార్చి తమ ఆస్తులను, పదవులను కాపాడుకునేందుకే,అవకాశవాద రాజకీయాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇది నియోజకవర్గ ప్రజల పాలిట శాపంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కేఎస్ రత్నం కూడా ఊసరవెల్లిలా తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్, టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి బిజెపి పార్టీల జెండాలను మార్చి చరిత్ర సృష్టించారు. మరి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాలే యాదయ్య 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొంది టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేరారు. 2019లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందగా, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామేన భీమ్ భరత్ పై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అనంతరం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేస్తున్నారని పలువురు కాంగ్రెస్ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇలా గెలుపొందిన మూడుసార్లు అధికార పార్టీలో లేకుంటే తన ఆస్తులు, పదవులను కాపాడుకుకోలేననే భయంతోనే రంగులు మార్చడంలో ఒకరిని మించి ఒకరు తయారయ్యారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గత 20 ఏళ్లుగా,నాలుగు పర్యాయాలు చేవెళ్ల నియోజకవర్గం (ఎస్సీ)నుంచి ప్రాతినిధ్య ఊహించిన ఇద్దరు (మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య) ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ ఆదర్శంగా నిలిచారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలు మారిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో వారి ఆస్తులు, పదవులను కాపాడుకునేందుకే పార్టీలు మారుతున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలపై ప్రేమతో కాదని నియోజకవర్గ ప్రజలు బల్లగుద్ది చెబుతున్నారు.
•ఎమ్మెల్యే కాలే యాదయ్య ఏపార్టీలో ఉన్నారో బహిరంగ ప్రకటన చయాలి
బీఆర్ఎస్ పార్టీ భీ పామ్ పై గెలుపొందిన ఎమ్మెల్యే కాలే యాదయ్య అసలు తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా…? లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కోనసాగుతున్నరో నియోజకవర్గ ప్రజలకు బహిరంగ ప్రకటన చేయాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో కోనసాగితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పిలుపుల్లో ఎందుకు పాల్గొనటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయన అనుచర కాంగ్రెస్ పార్టీ నేతలు ఆపార్టీ కండువాలు వేసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైతుండగా మరి ఆయన ఎందుకు కాంగ్రెస్ కండువా వేసుకోవటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వేటు పడి ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యేను ఈసారి ఇంటి బాట పట్టిస్తామని ఓటర్లు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధికై తమ ఎమ్మెల్యే కాలే యాదయ్యకు భగవంతుడు మంచి బుద్ధి, మంచి జ్ఞానాన్ని ప్రసాదించి హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
