సెంటిమెంట్‌ రగిల్చి లబ్ధిపొందే యత్నం.. బీఆర్‌ఎస్‌పై పీసీసీ చీఫ్ ఫైర్..

సెంటిమెంట్‌ రగిల్చి లబ్ధిపొందే యత్నం.. బీఆర్‌ఎస్‌పై పీసీసీ చీఫ్ ఫైర్

 

బీఆర్‌ఎస్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్ రగిల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. నగరంలోని రవీంద్ర భారతిలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభలో మహేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సెంటిమెంట్ రగల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేవుళ్ల విషయంలో సీఎం ఒక సామెతగా చెప్పారని.. దాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు.

హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్‌లో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులో వస్తాయని వెల్లడించారు మహేష్ గౌడ్. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మారుతుందని తెలిపారు. అవినీతికి అలవాటు పడ్డ కేసీఆర్ కుటుంబం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా అవినీతి అని ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు.కాగా.. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభ‌ను రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ దయానంద్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, జగ్గారెడ్డి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు. రోశయ్య వర్ధంతి సందర్భంగా వి.హనుమంతరావును రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సత్కరించింది. అలాగే రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పేద విద్యార్థులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ స్కాలర్ షిప్‌లు అందజేశారు.

తక్కువ రేట్లకే భూములు ధారాదత్తం.. సర్కార్‌పై బీజేపీ నేతల ఫైర్..

తక్కువ రేట్లకే భూములు ధారాదత్తం.. సర్కార్‌పై బీజేపీ నేతల ఫైర్

 

హిల్ట్‌కు వ్యతిరేకంగా ఈనెల 7న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టబోతున్నామని రామచందర్ రావు ప్రకటించారు. హిల్ట్ పాలసీపై ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు.

 రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ ఈరోజు (సోమవాం) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీ నేతలు (BJP Leaders) కలిశారు. సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్‌ రావు (State BJP Chief Ramachandar Rao) మీడియాతో మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇండస్ట్రియల్‌కు కేటాయించిన భూములను హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్‌గా మారుస్తూ కోట్ల రూపాయలు అవకతవకలకు తెర లేపుతున్నారని ఆరోపించారు. మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేట్లకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.

6 లక్షల 30 వేల కోట్ల విలువైన 9292 వేల ఎకరాల భూములను కేవలం 5 వేల కోట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా..? పరిపాలన చేస్తుందా.. అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టే ఇండస్ట్రియల్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టి లబ్ధి పొందుతున్నారని వ్యాఖ్యలు చేశారు. హిల్ట్‌కు వ్యతిరేకంగా ఈనెల 7న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టబోతున్నామని ప్రకటించారు. హిల్ట్ పాలసీపై ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు వెల్లడించారు.హిల్ట్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని.. ప్రభుత్వ వైఫల్యాను వ్యతిరేకంగా 7న నిరసన దీక్ష చేపట్టబోతున్నామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. కాగా.. రామచందర్ రావుతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ఇతర నేతలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version