సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలికి సన్మానం
నేటి ధాత్రి అయినవోలు:-
సావిత్రిబాయి పూలే జయంతి మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐనవోలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐనవోలు గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దల సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ మాట్లాడుతూ, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా స్త్రీ విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన ఆమె ఆలోచనలు నేటికీ మహిళలకు, ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. సమాజ నిర్మాణంలో మహిళా ఉపాధ్యాయులు పోషిస్తున్న కీలక పాత్ర అమూల్యమైందని పేర్కొంటూ వారి త్యాగం, సేవాభావాన్ని ఈ సందర్భంగా ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లకొండ సురేష్, ఉపసర్పంచ్ అడ్డగూడి సతీష్, వార్డు సభ్యులు దూపెల్లి రాజు, సుజాత కుమార్, నాగలక్ష్మి అశోక్, సరిత జాన్సన్, కొత్తూరి రాజు, పురుషోత్తం, చందు, ప్రవీణ్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
