నేటి నుండే సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం..
సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి ..
జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం…
మందమర్రి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కే వన్ ఏ గని సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర నేటి నుండి నాలుగు రోజుల పాటు జాతర జరిగే నేపథ్యంలో సింగరేణి సంస్థ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మంగళవారం కంక వనం తో జాతర ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగామందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ హాజరయ్యారు. సమ్మక్క సారలమ్మ గద్దెలపై కంకవనాన్ని ప్రతిష్టించారు.భక్తులకు ఇబ్బందులు కలగకుండా సింగరేణి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది.జాతరకు కార్మికులు , కార్మికేతరులు, భక్తులు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యుల తో కలిసి వచ్చి మొక్కులు చెల్లించుకోవాలని మందమర్రి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ కోరుతున్నారు.మహిళలకు మరుగుదొడ్లు, స్నానపు గదులు, క్షౌరషాలలు ఏర్పాటు చేస్తున్నారు. బెల్లంపల్లి ,మందమర్రి, రామకృష్ణాపూర్, గద్దెరాగడి ప్రాంతాల నుంచి నుంచి భక్తుల పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది.సుమారు 10 నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. జాతర ప్రాంగణం మొత్తం కనిపించేలా పెద్ద టవర్ ఏర్పాటు చేశారు.టవర్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో చోరీలు జరిగే అవకాశం ఉంటే వారిని పసికట్టేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్,మందమర్రి సిఐ పి రమేష్ ల ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ ఎస్సై జె శ్రీధర్ నేతృత్వంలో సుమారు 150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు.సుమారు 300 కు పైగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. కంక వనం కార్యక్రమంలో సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
