అక్రమంగా పశువులను తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు
మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్
మంచిర్యాల,నేటి ధాత్రి:
అక్రమంగా పశువులను తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ తెలిపారు.ఆయన మాట్లాడుతూ రాబోయే బక్రీద్ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా అక్రమంగా పశువులను తరలించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపన్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను డీసీపీ సందర్శించి,అక్కడ అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించారు.విధుల్లో ఉన్న అధికారులు,సిబ్బందికి పలు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు.డీసీపీ మాట్లాడుతూ ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో అక్రమ జంతు రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని తెలిపారు.జిల్లావ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని,ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పశువుల సంతలు,చెక్ పోస్టుల పనితీరుపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.జిల్లాలో ఎక్కడైనా చట్టవిరుద్ధంగా ఆవులు,దూడలను అక్రమంగా రవాణా చేయడం, వధించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి జరిగే జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్ పోస్టుల వద్ద 24 గంటల నిఘా కొనసాగుతోందని తెలిపారు.చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా పశువులను తరలించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనుమానాస్పద కార్యకలాపాలు, పశువుల అక్రమ రవాణా గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.పండుగల సమయంలో పరస్పరం మతాలను గౌరవించుకుంటూ శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏసిపి వెంకటేశ్వర్లు,కోటపల్లి ఎస్సై రాజశేఖర్,భీమారం ఎస్సై రాజేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు
