చిత్రకళలో తృతీయ బహుమతి సాధించిన ఇరుకుల్ల వీరేశం
20 వేల రూపాయల నగదు
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:-
ఓదెల మండలం జిలకుంట గ్రామానికి చెందిన గ్రామీణ యువ ఫోటోగ్రాఫర్ ఇరుకుల్ల వీరేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన అవార్డు సాధించారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదాపూర్ లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ నిర్వహించిన అఖిల భారత చిత్రకళా పోటీలో
ఇరుకుల్ల వీరేశం తీసిన ఛాయాచిత్రం తృతీయ బహుమతిని గెలుచుకుంది.
2018లో ప్రారంభమైన ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్ అండ్ ఎగ్జిబిషన్ దేశంలోని సమకాలీన కళా పద్ధతులను అనుసంధానించడానికి ఈ సంస్థ ప్రతి ఏటా చిత్ర కళాకారులను గుర్తించి సన్మానిస్తోంది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన 5వ ఎడిషన్ పోటీలో వీరేశం ఈ బహుమతి గెలుపొందారు.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి 600 మంది చిత్రకారులు తాము గీసిన చిత్రాలను ఈ పోటీలకు పంపించగా యువ చిత్రకారుడు వీరేశం తీసిన ఫోటోకు తృతీయ స్థానం దక్కింది. శనివారం హైదరాబాదు లోని మాదాపూర్ లో అంగరంగ వైభవంగా నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా వీరేశం 20 వేల రూపాయల నగదు తో పాటు ప్రశంసా పత్రాన్ని అందు కున్నారు.
ఈ సందర్భంగా బహుమతి విజేత వీరేశం మాట్లాడుతూ…. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తాము తీసిన ఛాయాచిత్రానికి తృతీయ బహుమతి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువకళాకారులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నారు.
ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ కె. లక్ష్మి ఐఏఎస్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలో పాల్గొన్న కళాకారులు రూపొందించిన 162 ఉత్తమ చిత్రాలను మాదాపూర్ లోని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన కొరకు ఉంచినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రథమ బహుమతి సాధించిన కర్ణాటక కు చెందిన చంద్రకాంత్ పాటిల్ మరియు దేశంలోని వివిధ చిత్రకారులతోపాటు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.