`ఇంకెంత కాలం కాలయాపన!?
`తల్లులు చనిపోతున్నా పట్టించుకోరా?
`జిల్లా వైద్య విభాగం రూపొందించిన రిపోర్ట్ ను కలెక్టర్ తిప్పి పంపినా స్పందనేది?
`డిఎంఅండ్ హెచ్‌ఓ సమాచారమిచ్చే తీరికలేదా?
`రియా ఆసుపత్రిలో పేషెంట్ రజితను ఎలా చేర్చుకున్నారు?
`శ్రీచక్రకు ఎందుకు పంపించారు?
`ఒక్క రోజులో సేకరించే సమాచారానికి నెలల సమయం కావాలా?
`అసలు రియా, శ్రీ చక్ర ఆసుపత్రులకు ఎలా అనుమతులిచ్చారు?
`అంతా గందరగోళం వ్యవహారం?
`తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఎథిక్స్ కమిటీ సభ్యులు ఏం రిపోర్టు ఇస్తారు అన్నది సర్వత్రా ఉత్కంఠ?
`ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆగని భ్రూణ హత్యలు?
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రాణాలు పోయడం మర్చిపోయిన కొందరు స్వార్ధపరులు ప్రాణాలు తీయడం నేర్చుకున్నారు. అవి కూడా పసి ప్రాణాలు. ప్రపంచాన్ని చూడాల్సిన ప్రాణాలు. అమ్మ కడుపులో చల్లగా పెరగాల్సిన ప్రాణాలు…కళ్లు తెరవకముందే ఆరిపోతున్నాయి…ప్రాణాలు పురిటిదాకా రాకుండానే పోతున్నాయి? ప్రాణాలు నిలపాల్సిన సమయంలో పసి ప్రాణాలు తీయడం కూడా వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఇది ఎంత దర్మార్గమైన చర్యలో అర్ధం చేసుకోవచ్చు. వారి వ్యాపారం కోసం, ఆదాయం కోసం, కోట్లకు పడగడలెత్తడం కోసం మహిళలే అరకొర చదువులతో వైద్య చేస్తూ, భ్రూణ హత్యలు చేయడమే వైద్యంగా పెట్టుకుంటున్నారు. నిత్యం భ్రూణ హత్యలతోనే క్లినిక్‌లు నడుపుతున్నారు. అలాంటివారిలో సబిత అనే వైద్యురాలు ఒకరు. ఇదంతా ప్రపంచానికి తెలుసు. ఆమె ఇప్పటికే మూడు సార్లు పట్టుబడిన సంగతి తెలుసు. తాజాగా రజిత అనే ఓ మహిళకు అబార్షన్ చేసే క్రమంలో జరగరాని ఘోరం జరిగిందన్నది అందరికీ తెలుసు. కాని అదంతా తారు మారు చేశారు…తప్పుడు నివేదిక తయారు చేశారు… కనీసం భయం లేకుండా దాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. ఆయనకు దానిపై అనుమానం వచ్చి, తిరిగి పంపారు…అయినా వైద్యాధికారుల్లో చలనం లేదు…స్పందన కరువు…! రజిత అనే గృహణి శ్రీచక్ర ఆసుపత్రిలో చనిపోయిందన్న నిజం అందిరకీ తెలిసిందే.
శ్రీ చక్ర ఆసుపత్రికి రజిత అనే గృహిణి ఎక్కనుంచి వచ్చిందంటే రియా ఆసుపత్రి నుంచి అన్నది కూడా తెలిసిందే. రియా ఆసుపత్రికి రజిత ఎలా వచ్చింది? ఎక్కడినుంచి వచ్చింది? ఎవరు రిఫర్ చేశారు? ఏ పరిస్ధితుల్లో రజిత రియా ఆసుపత్రిలో చేరిందన్న విషయం పూర్తిగా ఆసుపత్రి వైద్యుడు రవి చెబుతూనే వున్నారు. నేటిధాత్రికి కూడా ఆ విషయం వెల్లడిరచారు. అలాంటిది ఎంక్వౌరీ కమిటీకి రజిత రియా ఆసుపత్రికి ఎలా వచ్చిందన్న విషయాన్ని వెల్లడిరచకుండా వుంటారా? ఎవరిని మభ్యపెడదామని డిఎంఅండ్ హెచ్‌ఓ చూస్తున్నారు. ఎవరిని కాపాడేందుకు నివేదికను తప్పుల తడకగా తయారు చేశారు? రజిత మరణం మీద డిఎంఅండ్‌హెచ్‌ఓ తయారు చేసిన నివేధిక అంతా అతుకుల బొంతగా వుందని, అర్ధం పర్ధం లేకుండా వుందన్న సంగతి జిల్లా కలెక్టర్ కూడా చెప్పేశారు. ఆ నివేదికను తిరిగి వెనక్కి పంపిచారు. అయినా జిల్లా వైద్య యంత్రాంగం మాత్రం కదిలినట్లు లేదు. స్పందిస్తున్నట్లు అసలే కనిపించడం లేదు? నేటిధాత్రికి రిజత అనే గర్భిణీని సబిత అనే వైద్యురాలు రియా ఆసుపత్రికి రిఫర్ చేసిందన్న సంగతిని పేరుతో సహా డాక్టర్ రవి వెల్లడిరచారు. అదే విషయాన్ని ఎంక్వరీ కమిటికీ కూడా చెప్పి వుంటాడు? కాని దాన్ని తారు మారు చేయాల్సిన అవసరం డిఎంఅండ్‌హెచ్‌ఓకు ఏమొచ్చిందనేది ఇక్కడ తేలాల్సిన అసలు పాయింట్? రజిత అనే గర్భిణీకి అబార్షన్ ఎవరు చేశారని రియా ఆసుపత్రి వైద్యుడు రవిని నేటిధాత్రి ప్రశ్నించింది? మా ఆసుపత్రికి వచ్చే సరికే రిజతకు అబార్షన్ చేయడం జరిగిందన్న సంగతిని ఆయనే స్వయంగా వెల్లడిరచారు. ఇంత స్పష్టంగా డాక్టర్ . రవి చెప్పినా నివేదికను జిల్లా వైద్యాదికారులు ఎందుకు తారు మారుచేశారు? తప్పుల తడక నివేదిక ఎందుకు రూపొందిచారు? ఇక్కడ మరో విషయంపై కూడా లోతుగా ఎంక్వౌరీ జరగాల్సిన అవసరం వుంది.
అసలు అబార్షన్ వికటించి, ప్రాణాపాయ స్ధితిలో వున్న రిజిత గురించి పూర్తి వివరాలు సేకరించకుండానే రియా ఆసుపత్రి జాయిన్ చేసుకున్నదా? అన్నది కూడా ఇక్కడ తేలాల్సివుంది? మరి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ, ప్రపంచానికి తెలియకుండా, జరిగిన సంఘటనలు వెలుగులోకి రాకుండా మభ్యపెడుతున్న రియా ఆసుపత్రి లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయొద్దన్నదానికి విచారణ కమిటి ఎందుకు ప్రశ్నించలేదు? రియా ఆసుపత్రికి ఎందుకు ఇంతవరకు నోటీసులివ్వలేదు? మా దగ్గర ఆబార్షన్ కాలేదన్న విషయాన్ని మాత్రమే నమోదు చేసి, మిగతా విషయాలన్నీంటిని కమిటి ఎందుకు వదిలేసింది? ఆసుపత్రి మీద చర్యలకు ఎందుకు రిపోర్టు చేయాలేదు? తూతూ మంత్రంగా రిపోర్టు తయారు చేసి చేతులు దులుపుకుంటే చాలని అనుకున్నారా? రియా ఆసుపత్రి వైద్యులు వెల్లడిరచిన వివరాల ప్రకారం తమ ఆసుపత్రిలో రిజితను జాయిన్ చేసుకున్నా, తమ వల్ల కాకపోవడంతోనే రిజితను శ్రీచక్ర ఆసుపత్రికి పంపడం జరిగిందన్న సంగతిని కూడా డాక్టర్ రవి చెప్పేశారు. మరి శ్రీచక్ర ఆసుపత్రి ఎలా జాయిన్ చేసుకున్నది? రజిత మరణానికి శ్రీచక్ర వైద్యులు ఎలా కారణమయ్యారో అన్నది దానిపై అధికారులు ఎంతో సీరియస్‌గా వుండాల్సిన అవసరం వుండేది. అసలు రియా ఆసుపత్రి ఎలా వుంది? శ్రీచక్ర ఆసుపత్రి ఎలా వుంది? అన్నది ఓసారి పరిశీలిస్తే, ఏదైనా జరగరానిది జరిగితే, గత కరోనా సమయంలో విజయవాడలో రమేష్ ఆసుపత్రికిలో జరిగినదానికంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం వుంది. కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేకుండా వుంది. ఏదైనా ఫైర్ ఆక్సిడెంటు అయినా వెనకనుంచి వెళ్లేందుకు గాని, ఫైర్ ఇంజన్ ద్వారా నీళ్లు చల్లేందుకు కూడా స్ధలం కూడా లేదు. అలాంటి భవనాల్లో ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోవడం? వాటికి అధికారులు లైసెన్సులు ఇచ్చేడం కూడా పెద్ద మాఫియాగా తయారైంది! సరే….లైసెన్సులు ఇచ్చేప్పుడు ఏదైనా విషయంలో షరతులు ఉల్లంఘించినా, రజిత లాంటి మహిళ భ్రూణ హత్యలో ప్రాణాలు కోల్పోతే కూడా ఆ ఆసుపత్రుల మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అన్నది అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. డిఎంఅండ్‌హెచ్‌ఓ ఫోన్లోకి అందుబాటులోకి రారు?:
ఎన్ని సార్లు డిఎంఅండ్‌హెచ్‌ఓకు ఫోన్ చేసినా కట్ చేస్తుంటారు..లేకుంటే పోన్ ఎత్తరు. ఆగష్టు 19నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా డిఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు పోన్ లిప్ట్ చేయడంలేదు. అసలు నివేదిక మళ్లీ తయారు చేస్తున్నారా? అన్న సంగతి కూడా చెప్పడానికి ఆయనకు సమయం చాలడం లేదా? లేక మీడియాకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? ఓ మహిళ ప్రాణం తీసిన వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఎవరినీ లెక్క చేయడం లేదా? రజిత మరణం మీద తయారు చేసిన నివేధిక కలెక్టర్ రిటన్ పంపిన తర్వాత కూడా కదిలేందుకు డిఎంఅండ్‌హెచ్‌ఓకు సమయంలేదా? లేక కలెక్టర్ ఆర్డరును కూడా బేఖాతరు చేస్తున్నారా? అసలు రిజిత మరణం విషయంలో అసలైన దోషులను ఎందుకు ఆయన దాచిపెడుతున్నారన్నది తేలాల్సిన అవసరం వుంది? వైద్యురాలు సబిత అనుచరుడి తిరకాసు మాటలు?: వైద్యురాలు సబిత నేటిధాత్రిని లీగల్‌గా చూసుకుంటామని కొత్త రాగం అందుకున్నారు? అంటే ప్రాణాల మీద ప్రాణాలుతోపాటు, నిత్యం భ్రూణ హత్యలు చేస్తూ, పట్టుబడి కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే వ్యవస్ధలను వైద్యురాలు సబిత ఎలా మేనేజ్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అంటే రెడ్ హాండెడ్‌గా పట్టుకున్న వైద్య అధికార సిబ్బంది, నివేదికలు సమర్పించిన సిబ్బంది, అరెస్టు చేసిన పోలీసులందరిదీ తప్పని నిరూపించుకుంటానని భహిరంగంగానే చెబుతున్నారంటే చట్టాలు కూడా లెక్కలేవా? జైలు జీవితం అనుభవించి కూడా మారని తీరుతో, మళ్లీ, మళ్లీ అవే తప్పులు చేస్తున్నాం, పాపాలు మూట గట్టుకుంటున్నామన్న బాధ కించిత్తు కూడా లేకుండా లేదు. పైగా తమ తప్పులను ఎత్తి చూపడం తప్పంత దోరణితో నేటిధాత్రికి దమ్‌కీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారంటే ఇక అర్ధం చేసుకోండి? ఇక సామాన్యుల పరిస్ధితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు? రంగంలోకి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ :
గర్భిణీ రజిత మరణం, భ్రూణ హత్యలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్పందించింది. ఈ మేరకు కౌన్సిల్ చైర్మన్ రాజలింగం నేటిధాత్రితో మాట్లాడారు. రజిత మరణంపై జరిగిన పూర్తి స్ధాయి నివేదిక రూపొందించేందుకు ప్రత్యేకంగా ఓ కమిటి ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఉపాధ్యాయవైద్యులతో కమిటి ఏర్పాటైంది. గైనిక్ డాక్టర్ నిర్మల, పిల్లల డాక్టర్. శేషుమాధవ్‌లతో కమిటీ ఏర్పాటైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి హరీష్‌రావు చొరవతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రంగంలోకి దిగింది. వంద గొడ్లనుతిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కొట్టుకుపోయిందని తప్పుల మీద తప్పులు నేరాలు చేస్తూ, పసి ప్రాణాలను కర్కషంగా చంపేస్తున్నవారికి ఎన్నటికైనా శిక్ష తప్పదు…!