మళ్ళీ ‘పొత్తు’పొడుపు!

`చిగురిస్తున్న పాత స్నేహాలు

`తెదేపా, బిజేపిల ఎన్డీయే మానియా!

`వరుసగా ఇరు పార్టీల నేతల రహస్య భేటీలు…

`మొదట మోడీతో డిల్లీలో చంద్రబాబు 

`మునుగోడు సభ నాడే తెలంగాణలో అమిత్‌ షా కొత్త రాజకీయం

`అటు రామోజీ రావు, ఇటు జూనియర్‌ ఎన్టీఆర్‌ తో సమావేశం.

`తాజాగా లోకేష్‌ తో అమిత్‌ షా భేటీ

`చంద్రబాబుకు భద్రత మరింత పెంపు

`తెలంగాణపై ముందు ఫోకస్‌…

`ముందే చెప్పిన నేటిధాత్రి…

`ఎన్టీఆర్‌ మానియాతో తెలంగాణలో బిజేపి…

`ఆంద్రప్రదేశ్‌ లో రెండు కలిసి పోటీ…

`ఒక్క దెబ్బకు రెండు పిట్టలు…

 కేసిఆర్‌ కాదంటే చంద్రబాబు…

`బిజేపి పొత్తు రాజకీయాలు….

`తెదేపా కు రెడ్‌ కార్పెట్‌…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మళ్లీ పాత స్నేహాలు చిగురిస్తున్నాయి. పాత పొత్తులు తెరమీదకొస్తున్నాయి. దక్షిణాదిన పాగా వేయడం అంత సులువైన పని కాదని తెలుసుకున్న బిజేపి మళ్లీ పాత స్నేహాల కోసం చేతులు చాచుతోంది. హస్తం పార్టీ పాగా వేయకుండా వుండాలంటే ఏక కాలంలో దక్షిణాదిలో కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది. అందులో భాగంగా ఉభయకుశలోపరిగా బిజేపి తన వంతు ద్విపాత్రాభియన రాజకీయాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏక కాలంలో అటు వైసిపితో, ఇటు తెలుగుదేశంతో జట్టుకట్టేందుకు, తెలంగాణలో తెలుగుదేశంతో కలిసి సాగేందుకు నయా రాజకీయం రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఒంటరిగా బిజేపి పాగా వేయడం కుదరనిపని. వైసిసితో పొత్తు సాగని పని. జనసేనను నమ్ముకుంటే సీట్లొస్తాయన్న నమ్మకం లేని పని. ఇక మిగిలింది. … కొత్త మిత్రుడికన్నా, , పాత శత్రువే మేలు అన్న సామెతను బిజేపి నిజం చేయనున్నది. తెలుగుదేశం పార్టీని మళ్లీ దగ్గరకు చేర్చుకుంటోంది. తెలంగాణ ఇవ్వడం అన్నది తెలుగుదేశం పార్టీకి సుతారం ఇష్టం లేని విషయం. అందులోనూ రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో ఒక వైపే చేసి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, తెలంగాణ ప్రయోజనాలు ఏనాడు పట్టని చంద్రబాబుకు రాష్ట్ర విభజన ఏ కోశాన ఇష్టంలేదు. ఇచ్చేదా…వచ్చేదా? అన్న ధోరణిలోని తెలంగాణలో ఆనాటి తెలంగాణ తెలుగుదేశం నాయకుల రాజకీయ మనుగడ కోసం తెలంగాణ ఉత్తరం ఇచ్చిన ఘనుడు చంద్రబాబు. 2009 డిసెంబర్‌9న తెలంగాణ ప్రకటించిన వెంటనే సీమాంధ్రకుచెందిన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేల రాజీనామాలను రాజకీయం సృష్టించిందే. ఆ రాత్రంతా నిద్ర లేకుండా తెల్లారే సరికి సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలన్నీ పూర్తయ్యే దుర్మార్గపు రాజకీయాలు చేసింది చంద్రబాబు. అలాంటి చంద్రబాబుతో బిజేపి అంటకాగడం కొత్త కాదు. పైగా ఒకనాటి బిజేపికి తెలంగాణ ఇవ్వడం ఇష్టమున్నా, నాడు కూడా అద్వానీ లాంటి వారికి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని పని. ఇప్పుడు అదే ప్రధాని మోడీకి కూడా తెలంగాణ ఏర్పాటు అన్నది అసలే ఇష్టం లేని పని అన్నది పలు మార్లు ఆయన వ్యాఖ్యల ద్వారా ఆయన స్పష్టం చేసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత ఎన్నికల సందర్భంలో రాజకీయ ప్రయోజనాల కోసం తిరుపతిలో 2014లో తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నప్పుడు తెలంగాణ ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. యధాలాపంగా రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ చేసిన వ్యాఖ్యలనే అందరూ అనుకున్నారు. అరవైఏళ్లలో అలాంటి మాటలు ఎన్నో విన్న తెలంగాణ ప్రధాని కాకముందు నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం సీరియస్‌గా తీసుకోలేదు. పైగా అవి నరేంద్ర మోడీ మనసులో నుంచి వస్తున్న మాటలు అనుకోలేదు. కాని ఆయన కావాలనే అన్నారని, సమయం దొకినప్పుడల్లా తెలంగాణ మీద కసి తీర్చుకుంటున్నాడని అనేక సార్లు రుజువైంది. తాజాగా కూడా ఆయన పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును అసందర్భంగా ప్రస్తావించి బిజేపి వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తుకు పాకులాడడంతో తేలిపోతోంది. నిజానికి నరేంద్రమోడీని చంద్రబాబు దూషించినంతగా ఎవరూ తిట్టలేదు. 

ఆంధ్రప్రదేశ్‌ కు విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల అమలు విషయంలో కేంద్రం చేసిన తొండి రాజకీయాన్ని చంద్రబాబు బాగానే తూర్పారపట్టారు. మొదట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ పని చేసినా ఆహా…ఓహో అని తెగ పొడిగిన చంద్రబాబు, తీరా 2019 ఎన్నికల సమయం దగ్గరపడినప్పుడు ఎన్డీయేనుంచి బైటకు వచ్చాడు. ఎన్డీయే కన్వీరన్‌ పదవికి చంద్రబాబు రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేస్తున్నాడని చంద్రబాబు నిప్పులు చెరిగారు. కాకపోతే చంద్రబాబుని, ఆయన మాటలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నమ్మలేదు. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు జీరో అయ్యారు. 23 ఎమ్మెల్యే సీట్లకు పరిమితమయ్యారు. ఇక ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో కోలుకునే పరిస్ధితి కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావాలంటే ఎలాగైనా మరో పార్టీతో పొత్తు లేకుండా పోటీ సాధ్యం కాని పని. ఎన్నికల్లో ఒంటరి పోరు వల్ల లాభం లేదు. ఇక జనసేనకు అంత సీన్‌ లేదు. ఒక వేళ పొత్తుతో ఏదైనా లాభం జరిగినా మరునాటి నుంచే తలపొటు తప్పదు. రెండున్నరేళ్లు మేము..మరో రెండున్నరేళ్లు మీరు అన్న కాన్సెప్ట్‌ అమలు పర్చాల్సి రావచ్చు. లేకుంటే కేంద్రంలో మళ్లీ బిజేపి అధికారంలోకి వస్తే, జనసేన లాంటి పార్టీతో మహారాష్ట్ర లాంటి రాజకీయాలకు తెరతీయొచ్చు. ఇలాంటి వాటిలో ఎంతో దూర దృష్టితో వుండే చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి రావాలి. జనసేనను పక్కకు తప్పించాలి. అంటే బిజేపితో సఖ్యత కావాలి. కలిసి సాగాలి. కాంగ్రెస్‌తో వెళితే మొదటికే మోసం రావొచ్చు. పైగా ఆ పార్టీని ఆదరించేందుకు ప్రజలు కూడ సిద్దంగా లేదు. ఎటు తిరిగి చూసినా బిజేపేని పట్టుకొని ఎన్నికల గోదారి ఈదడమే సరైందన్న నిర్ణయానికి వచ్చి కొత్త రాజకీయం మొదలుపెట్టారు. అందుకే ఈ వరస బేటీలు…దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా చంద్రబాబును డిల్లీకి ప్రధాని మోడీ ఆహ్వానించారు.

పనిలో పనిగా చంద్రబాబుతో ఐదు నిమిషాలు రాజకీయం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో లంచ్‌చేశారు. అంటే ఇప్పుడే తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూసుకున్నారు. కాకపోతే చంద్రబాబు అడిగిన సెక్యూరిటీ పెంచేశారు. చంద్రబాబుకు జడ్‌ కేటగిరిలో 12 సెక్యూరిటీ వుంది. ఇప్పుడు దాన్ని 24చేశారు. అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అందులోనూ దేశంలో బిజేపి ఎలాంటి రాజకీయాలు చేస్తుందో తెలిసిన సమయంలో చంద్రబాబుకు సెక్యూరిటీ విషయంలో జగన్‌కు ఇష్టంలేని పని చేశారు. అంటే పొత్తు పొడుపుకు సంకేతాలు పంపించారు. ఇక ఇదిలా వుంటే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్రజల దృష్టంతా మునుగోడు కేంద్రీకృతమై వుంది. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన సభకన్నా, కేంద్ర మంత్రి అమిత్‌షా ఈనాడు అధినేత రామోజీరావును, సినీ నటుడు ఎన్టీఆర్‌ను కలసి వార్తలకే ప్రాధాన్యం పెరిగింది. రాజగోపాల్‌రెడ్డి పెట్టిన కోట్ల రూపాయల ఖర్చ గంగలో కలిపిపనట్లైంది. భవిష్యత్‌ రాజకీయాలను ఎంచుకునే సమయంలో రాజగోపాల్‌ రెడ్డి రాజకీయం కోసం బిజేపి ఆలోచిస్తుందా?

అందుకే తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రాజకీయంగా ప్రధాన శత్రువులైన తెలుగుదేశం పార్టీని, మళ్లీ కలుపుకుపోతే తప్ప బిజేపికి మనుగడ లేదు. అందుకే ఎలాగూ తెలుగేదేశం పార్టీకి తెలంగాణలో ఎవరో ఒకరు దిక్కు కావాలి. ప్రజలు కూడా ఎన్టీఆర్‌వైపు చూస్తున్నారు. ఏదో రకంగా ఎన్టీఆర్‌ను రాజకీయాల్లో ఇరికిస్తే, ఆయనకు తెలంగాణ రాజకీయాలు అప్పగిస్తే, సీమాంధ్రలోనూ ఓట్లు కురిపించేందుకు ఉపయోగపడతాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన స్ధానాలు కొన్ని వున్నాయి. వాటిలో తెలుగుదేశం కీలక భూమిక పోషించినా, మిగతా ప్రాంతాల్లో బిజేపికి బలం పెంచుకునే అవకాశం వుంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారం పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. సీమాంధ్ర రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ప్రస్తావన కనుమరుగౌతుంది. లోకేష్‌ను నాయకుడిగా గుర్తించేందుకు అవకాశం ఏర్పతుంది. అవసరమైతే సీమాంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణలో ఎన్ని వేషాలేసేందుకైనా కుదురుతుంది. ఇప్పటికే పదేళ్లుపాటు ఉమ్మడి రాజధాని అన్నది కొనసాగుతోంది. అమరావతిలో చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప జగన్‌ చేసిందేమీ లేదు. దాంతో మళ్లీ అమరావతి మీద దృష్టిపెట్టడం కాన్న, తెలంగాణ రాజకీయాల మీద సమయం కేంద్రీకరించడం మేలన్న ఆలోచన చంద్రబాబు చేస్తున్నారు. బిజేపి కూడా అందుకు సై అన్నట్లే కనిపిస్తోందన్న వార్తలే వినిపిస్తున్నాయి. చంద్రబాబు, మోడీ పాత మిత్రులే. బిజేపి, తెలుగుదేశం పార్టీలు ఎన్‌డిఏలో మొదటినుంచి ఆప్తులే. కేసిఆర్‌ ఎలాగూ తిరుబాటు జెండా ఎగరేశాడు. కేంద్రంపై కత్తులు నూరుతున్నాడు. ఈ విషయంలో బిజేపికి, ప్రధాని నరేంద్ర మోడీకి పీకల దకా కోపం వుంది. ఎలాగైనా టిఆర్‌ఎస్‌ను కట్టడిచేయాలంటే, తెలుగుదేశం పార్టీని లేపాలి. లేకుంటే కాంగ్రెస్‌ లేచి నాట్యం చేస్తుంది. చేతికి బలమొస్తే కమలాన్ని పీకేస్తుంది. అందుకు ఒక్క దెబ్బకు రెండుపిట్టలు…అటు టిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలి…ఇటు కాంగ్రెస్‌ను రాష్ట్ర రాజకీయాలకు దూరం చేయాలి. ఇదే ఇప్పుడు బిజేపి లక్ష్యం…తెలంగాణలో అధికారమే లక్ష్యం..! తెలుగుదేశంతో మళ్లీ సాగడమే నయా రాజకీయం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!