వాళ్లు క్రిమినల్స్‌ కాదా?

`వాళ్లనెందుకు అరెస్టు చేయడం లేదు?

`సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెట్టిన వారి ఫోటోలే క్రిమినల్‌ లిస్ట్‌ లో చేర్చుతున్నారు?

`కాసులకు కక్కుర్తి పడి అటు గర్భిణీలు, ఇటు పిండాలను చిద్రం చేస్తున్న వాళ్లు నేరస్థులు కాదా?

`వైద్యుడు దేవుడని కొలుస్తాం!

`వైద్య వృత్తిలో వుండి ప్రాణాలు పోయకుండా తీస్తున్న వారిపై చర్యలేవి?

`ప్రాణాలు తీస్తున్నా ప్రశ్నించే వారి గోడు వినేవారేరీ!

`నిత్యం భ్రూణ హత్యలు జరుగుతుంటుంటే బేటీ ఎక్కడ కాపాడబడుతోంది?

`పొత్తిళ్లలోనే ప్రాణాలు తీస్తుంటే ఆడపిల్ల పుట్టేదెలా?

`ఏసి. గదుల్లో సమీక్షలు జరిపితే ఆడపిల్లలు బతుకుతారా?

`కలెక్టర్‌ గారు మీ సమీక్షా సమావేశంలో ప్రాణాలు పోయిన రజిత గురించి చర్చించారా?

`రజిత ప్రాణాలు తీసిన డాక్టర్లపై చర్చించారా?

`నెల రోజులుగా నేటిధాత్రి అక్షరాలే అరణ్య రోధనౌతుంటేనే దిక్కులేదు?

`గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి…భ్రూణ హత్యలు ఆపాలన్న మానవత్వం మీలో వుందా?

`కళ్లు తెరవని పసి గుడ్డు ఆయువు తీస్తున్న వారిని కాపాడున్న వాళ్లే, రక్షిస్తామంటే నమ్మదగిందేనా?

`ఏసి రూముల్లో కూర్చొని చర్చిస్తే సరిపోతుందా?

`ఇప్పటి వరకు ఎన్ని ఆసుపత్రులు మూయించారు?

`ఎంత మంది డాక్టర్లను అరెస్టు చేశారు?

`వైద్యురాలు సబితను విచారించారా?

`ఆసుపత్రులకు నోటీసులిచ్చారా?

`ఓ పసిగుడ్డు, ఓ తల్లి ప్రాణాలు తీసిన వారిపైనే ఇంతవరకు చర్యలు లేవు?

`అధికారుల మీద ప్రజలకు ఇంకా నమ్మకం వుందా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వాళ్లు పనిగట్టుకొని, పాపాలు చేస్తూ, నేరాలు చేస్తూ, పసిగుడ్డులను పొత్తిళ్లలో చిదిమేస్తూ, వైద్యం ముసుగులో వ్యాపారం చేస్తూ ప్రాణాలు తీస్తుంటే వాళ్లపై చర్యలుండవా? వారిపై కేసులుండవా? వారు నేరస్ధులు కాదా? శిక్షార్హులు కాదా? క్రిమినల్స్‌ జాబితాలో వారు చేరరా? వారి సర్టిఫికెట్టు సస్పెండ్‌ చేయరా? ఆసుపత్రులు మూసేయరా? వారి సర్టిఫికెట్లు నిజమేనా? ఆసుపత్రి ఏర్పాటుకు అవసరమైన అనుమతులు తీసుకున్నారా? అన్ని రకాల సౌకర్యాలతో కూడిన వ్యవస్ధలోనే ఆసుపత్రి వుందా? అన్నవి కూడా ఎంతో ముఖ్యం. కాని ఇక్కడ అవేవీ పట్టించుకోకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిని కాపాడుతున్నదెవరు? వారికి అండగా నిలుస్తున్నదెవరు? ఎక్కడో ఏదో లోపం లేకుంటే వైద్య వృత్తి ముసుగులో గర్భిణీ ప్రాణాలకు ముప్పు తెచ్చిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఇంత కాలమెందుకు పడుతోంది? ఏం జరిగిందో అందరికీ తెలుసు. కాని వైద్య శాఖ అధికారుల అలసత్వమా? లేక అవకాశవాదమా? ఏం జరుగుతోంది? ఓ వైపు పసి ప్రాణాలు ప్రపంచం కూడకముందే కంటి దీపం ఆర్పేస్తున్న వారిని కాపాడుతూ, మరో వైపు బేటీ బచావో, బేటీ పడావో అంటూ సమీక్షలు నిర్వహించడం దేనికి సంకేతం? ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భ్రూణ హత్యలు అన్నవి నిత్యకృత్యమైపోయాయని అందరికీ తెలుసు. అందుకు ఎంతో కఠినమైన చట్టాలున్నాయని తెలుసు. అయినా వైద్య వృత్తిలో వున్నవారు అబార్షన్లు చేయడం ఆపడంలేదు. అధికారులకు తెలిసినా వారు చర్యలకు ఉపక్రమించడం లేదు? తాజాగా హన్మకొండ కలెక్టరేట్‌లో బేటీ బచావో, బేటీ పడావో అనే విషయం మీద కొన్ని గంటల పాటు జిల్లా స్ధాయిలో అన్ని శాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. అదే సమావేశానికి జిల్లా వైద్యాధికారులు కూడా హజరయ్యారు. ఇటీవల భ్రూణ హత్యతోపాటు, రజిత అనే మహిళ ప్రాణం కూడా పోయింది. ఆ కుటుంబం వీధిన పడిరది. ఇద్దరు చిన్నారుల జీవితం ఆగమ్య గోచరమైంది. వారికి తల్లిలేకుండాపోయింది. వారి భవిష్యుత్తు అంధకారమైంది. ఎవరు వారిని చూసుకున్నా, కన్నతల్లి ప్రేమను పంచి, పెంచి పెద్ద చేసేంత పెద్ద మనసు మరొకరికి వుండదు. అలాంటి తల్లిని ఇద్దరు చిన్నారులకు దూరం చేసిన వారు దర్జాగా తిరుగుతుంటే, ఆ పిల్లలు నిత్యం కన్నీళ్లతో జీవితం గడపాల్సిన స్ధితికి కారణమైనవారిని గుర్తించరా? వారిని శిక్షించరా? మరి ఇలాంటి సమీక్ష సమావేశంలో ఇంత పెద్ద సంఘటనపై చర్చ జరిగిందా? కనీసం కలెక్టర్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారా? సంబంధిత అధికారులకు గుర్తు చేశారా? కలెక్టర్‌ తిరిగి పంపిన ఫైలు గురించి మాట్లాడారా? ఓ వైపు పెద్దఎత్తున భ్రూణ హత్యలు జరుగుతుంటే అరికట్టేందుకు సమీక్షలు ఎందుకు నిర్వహించలేదు? : 

కేంద్ర ఫ్రభుత్వం ఎనమిదేళ్లుగా బేటీ బచావో…బేటీ పడావో అనే కార్యక్రమం అమలు చేస్తోంది. అందుకు అవసరమైన నిధులు కూడా పెద్దఎత్తున వెచ్చిస్తోంది. ఆ నిధులు వినియోగమౌతున్నాయే…తప్ప ఎక్కడా వాటి ఫలితాలు పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు కూడా ఆడ పిల్లను బతికిద్దాం…వారిని చదివిద్దామని ప్రధాన కూడళ్లలో పెద్ద పెద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? అమలు మీద చిత్తశుద్ధి అవసరం లేదా? ముందు రిజిత సంగతి తేల్చండి? ఆమె మరణానికి కారకులైన వారిని ముందు అరెస్టు చేయండి? వారిని శిక్షించండి? అప్పుడు అధికారుల మీద ప్రజలకు నమ్మకం కల్గుతుంది. ఓ వైపు కలెక్టర్‌ రజిత మరణంమీద జిల్లా అధికారులు రూపొందించిన నివేధికలో ఏదో లోపముందని గ్రహించి, ఫైలు తిప్పి పంపించినప్పుడైనా అధికారుల్లో చలనం వుండొద్దా? సాక్ష్యాత్తు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్‌రావు స్పందించి ఈ విషయాన్ని తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ను చూసుకొమ్మని ఆదేశాలు జారీ చేసినా అధికారుల్లో కించిత్‌ స్పందన లేదా? తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ ఓ కమిటీ ఏర్పాటు చేసిందన్న సంగతి తెలిసినా జిల్లా వైద్య అధికారులు కదలినట్లు లేదు. తాజాగా ప్రభుత్వ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన సంఘటనలో ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అంతే కాదు ఏదైనా ప్రభుత్వాసుపత్రిలో సంఘటనలు జరిగి, వైద్య అందడంలో ఏదైనా లోపం జరిగిన సందర్భాలలో వైద్యులను బాధ్యులు చేయడం చూస్తుంటాం. ఆ కుటుంబాలను ప్రభుత్వ ఆదుకోవడం తెలిసిందే! మరి డబ్బులు ఖర్చు చేసి, వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను నమ్మితే వారు ప్రాణాలు పోయాల్సిన వారి చేతుల్లో ప్రాణాలు పోతే వారి బాధ్యత లేదా? వారికి శిక్షలుండవా? రిజత కేసులో ఫైలు మూసేయడానికి అవసరమైన మార్గాలు అన్వేషిస్తున్నారే గాని, రజిత మరణంతో అనాధలైన చిన్నారులను ఆదుకోవాలన్న బాధ్యత వైద్యాధికారులకు లేదా? కనీసం వారిలో మానవత్వం కూడా లేదా? కర్తవ్యం గాలికి వదిలేశారా?అందరూ మర్చిపోయారు…మీరెందుకండీ…రజిత కేసులో న్యాయం అంటూ… ఇంకా సాగదీస్తున్నారు?:

ఇది ఎవరో కాదు…రియా ఆసుపత్రికి చెందిన ఓ డాక్టర్‌ నేటిధాత్రికి ఫోన్‌ చేసి అన్న మాటలవి. అసలు అబార్షన్‌కు కారణమైన వైద్యురాలు సబిత. మా తప్పేముంది? అంటూ నేటిధాత్రితో చెబుతూ మమ్మల్ని వదిలేయండి? అంటున్నారు. దయచేసి ఇకనైనా ఆపండి…అందరూ మర్చిపోయిన దాన్ని మళ్లీ రేపుతున్నారు? మేమేదో మేనేజ్‌ చేసుకున్నాం…ఇంకా ఆ విషయాన్ని లైమ్‌లైట్‌లోకి తేకండీ అంటున్నారు. వారికి ఒక గర్భిణీ ప్రాణం చిన్నగా కనిపిస్తోంది. అదేదో సినిమాలో నేను కోడిని కోస్తాను…మనిషిని చంపుతాను? రెండిరటీనీ ఒకే రీతిగా చూస్తాను…అంటూ విలన్‌ చెప్పినప్పుడు విన్నాం. కాని ఇప్పుడు రియా ఆసుపత్రి వైద్యుడు కూడా పరోక్షంగా అదే విషయాన్ని చెప్పినట్లు అనిపించకమానదు. ఇద్దరు చిన్నారులు జీవితాలు ఏం కావాలి? అన్నది మాత్రం ఎవరూ ఆలోచించడంలేదు? అటు ఆసుపత్రులు ఆలోచించక, ఇటు ప్రభుత్వ అధికారులు ఆలోచించక, పసి పిల్లలను దిక్కులేకుండా వదిలేద్దామా? వారికి ఓ దారి చూపిస్తామన్న మాటలే ఎక్కడా వినిపించడం లేదు? ఎంత సేపు మేనేజ్‌ చేశాం…అంటున్నారు? అంటే అర్దమేమిటో వారికే తెలియాలి? ఆ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామన్న మాట మాత్రం వారి నోటి నుంచి రావడంలేదు? మీకు చేత కాకుండా పోలీసు శాఖకు అప్పగించండి?:

వైద్యాధికారులకు ఇది కొత్త సమస్య కాకపోవచ్చు. కాని ఒక ప్రాణం అన్నది సమాజానికి ఎప్పుడూ పెద్ద సమస్యే…అసలు సమస్యే…అన్ని మీడియా సంస్ధల వదిలేశాయి? మీకుందుకు? అని నేటిధాత్రిని అనడం కూడా వైద్యులకు తగనిది. ఆ కుటుంబానికి ఏం చేయాలో చెప్పండి? అన్నది మాట మాత్రం ఎక్కడా వినిపించడం లేదు? ఇదీ మన వ్యవస్ధ దౌర్భాగ్యం. నెలల కింద జరిగిన ఈ సంఘటనను ఆసుపత్రులు, వైద్యులు, వైద్యాధికారులు, ఆఖరుకు వైద్యురాలు సబిత కూడా మర్చిపోయింది. మళ్లీ ఆమె పనుల్లో ఆమె నిమగ్నమైంది. రోజుకు ఎన్ని అబార్షన్‌ కేసులు వస్తే, అన్నీ పూర్తి చేస్తూనే వుంది. తన పాపపు పని ఆపడం లేదు. ఈ విషయాలన్నీ అందరకీ తెలుసు. ఒక్కటి వికటించి ఏదో జరిగినంత మాత్రాన ఆపుతామా? అన్నట్లు వైద్యంలో భ్రూణ హత్యల వ్యాపారం సాగిస్తూనే వున్నారు…! కలెక్టర్‌ గారు ఇక ప్రజలకు మీపైనే ఆశ. 

మీరు సత్వర న్యాయం జరిపిస్తారననే నమ్మకంతోనే చాలా మంది వున్నారు. రజత విషయంలో ఫైలు తిరిగి పంపినప్పుడు మీరు ఎలాగైన దోషులను శిక్ష పడేలా చేస్తారని అనుకుంటున్నారు? మీరు మరి కాస్త మనసు పెడితే…వైద్యుల ముసుగులో పసి ప్రాణాలను గాలిలో కలుపుతున్న వారిని శిక్షిస్తే తప్ప , ఇతర వైద్యుల్లో భయం కలగదు..! మీరు మరింత గట్టిగా ఈ విషయంపై దృష్టిసారితే తప్ప…అసలు దోషులు బైటకు రారు…బేటీ బచావో…బేటీ పడావో సార్ధకం కాదు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *