చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు
భూపాలపల్లి నేటిధాత్రి
పోషణలోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు తెలిపారు..
గురువారం గణపురం మండలం బుర్రకాయలగూడెం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులు పూల బొకే అందించి ఆమెకు స్వాగతం పలికారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ, “మీ పేరేంటి… నాకోసం ఎదురు చూస్తున్నారా?” అంటూ వారిని పలకరించారు. తరువాత ఆమె పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం 140 మంది చిన్నారులు పోషణలోపంతో బాధపడుతున్నారని, వారికి తగిన వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన పోషకాహారాన్ని అందించాలని ఆమె సూచించారు. అలాగే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం గురించి, అలాగే కిశోర బాలికలకు పంపిణీ చేస్తున్న పల్లి, మిల్లెట్ చిక్కీలువివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 8,550 మంది కిశోర బాలికలకు పల్లి, మిల్లెట్ చిక్కీలు అందిస్తున్నామని అధికారుల నుండి సమాచారం అందుకున్న ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ బావుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు పోషణ మాసంలో భాగంగా సీమంతాలు చేసి ఆరోగ్య పరిరక్షణ చర్యలు పాటించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేపించుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ సుఖ ప్రసవాలతో పాటు ఆరోగ్య వంతమైన బిడ్డలకు జన్మనివ్వాలని సూచించారు.
అంతకు ముందు రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టర్ పరిశీలించారు. ఎలాంటి వ్యాధులకు సేవలకు వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశాలకు ఆశా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు విచ్చేసిన ప్రభరి అధికారి పౌసమి బసుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సిపిఓ బాబురావు, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి ఉప వైద్యాధికారి డా శ్రీదేవి, డా ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు