త్వరలో కేటిఆర్‌ పాదయాత్ర!

 

-హరీష్‌ రావుకు సమన్వయ బాధ్యత.

-పాదయాత్రతోనే బిఆర్‌ఎస్‌కు జైత్రయాత్ర..

-జూన్‌ లోనే మొదలైన సన్నాహాలు.

-ఈ నెలలో పూర్తి కానున్న ఏర్పాట్లు.

-శ్రావన మాసంలో పాదయాత్ర మొదలు.

-బాసర నుంచి తొలి అడుగు

-భద్రాద్రితో ముగింపు.

-సరికొత్త తరహాలో పాదయాత్రకు శ్రీకారం.

-మూడు సంవత్సరాల పాటు సాగేలా ప్రణాళికలు సిద్దం.

-ఎన్నికలకు ఏడాది వరకు ప్రజలతోనే మమేకం.

-తెలంగాణ ఉద్యమ స్పూర్తితోనే అడుగులు.

ప్రతి నియోజకవర్గంలో కనీసం నెల రోజులు.

-ప్రతి ఊరును పలకరిస్తూ రూట్‌ మ్యాప్‌కు స్కెచ్‌లు.

-ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందడుగులు.

-ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ నిరసనలు.

-సమస్యలపై పోరాటాలు…

-ప్రభుత్వం మీద ధర్నాలు.

-జన సమీకరణలో సరికొత్త నిర్ణయాలు.

-జనం స్వచ్చందంగా మమేకమయ్యేలా ఏర్పాట్లు.

-స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం.

-సార్వత్రిక ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ ప్రభంజనం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు త్వరలో తెలంగాణలో పాదయాత్ర చేపట్టనున్నారు! పార్టీకి చెందిన ముఖ్యుల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. ఈ యాత్ర బాధ్యతలు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు సమన్వయం చేస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేత వచ్చి మళ్ళీ మేమే దిక్కవుతామన్న అతి విశ్వాసం నుంచి బిఆర్‌ఎస్‌ పెద్దలు బైటకు రావాలన్న డిమాండ్‌ పార్టీ శ్రేణులలో కనిపిస్తోంది. ఏ మాత్రం అవకాశం వున్నా బలపడాలన్న కసితో బిజేపి వుంది. ప్రజలు కూడా ఓసారి బిజేపికి అవకాశం ఇద్దామన్న ఆలోచనతో వున్నారు. ప్రజల దృష్టి అటు వైపు నుంచి మారాలి. పైగా అహంకారంతోనే బిఆర్‌ఎస్‌ ఓడిపోయిందన్న అపవాదు నుంచి కూడా బైటపడాలి. మంచో, చెడో కేసిఆర్‌ బైటకు రాడు అన్నది జనం అలవాటు చేసుకున్నారు. పైగా వయసు రిత్యా, ఆరోగ్య పరంగా ఆయన ప్రజల్లో నిత్యం మమేకం కావడం అంత సులువు కాదు. అందుకే కేటిఆర్‌ ను ఇక పూర్తి స్థాయిలో రంగంలోకి దింపాలి. కేటిఆర్‌ ను నాయకుడుగా జనం కూడా ఆమోదించాలి. అంటే కేటిఆర్‌ పాదయాత్ర చేయడమే తక్షణ కర్తవ్యం. బిఆర్‌ఎస్‌ లో మాస్‌ లీడర్‌ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం కేసిఆర్‌, హరీష్‌ రావ్‌. ఇంకా చెప్పాలంటే కవిత కూడా మాస్‌ లీడరే. కేటిఆర్‌ క్లాస్‌ లీడర్‌. మొన్నటి దాకా క్లాస్‌ లీడర్‌గా కేటిఆర్‌ ను అందరూ కీర్తించారు. అధికారం పోగానే కేటిఆర్‌ ను గుర్తించడం మర్చిపోయారు. అధికారం వున్నప్పుడు కొనియాడిన వాళ్లే ఇప్పుడు కేటిఆర్‌ నాయకత్వాన్ని శంకిస్తున్నారు. అదే మాస్‌ లీడర్‌ ఇమేజ్‌ అధికారం వున్నా లేకపోయినా మార్పు వుండదు. కేటిఆర్‌ కు ఇప్పుడు ఆ ముద్రే అడ్డంకిగా మారుతోంది. కేటిఆర్‌ లో అనర్గళమైన వాక్చాతుర్యం వుంది. తెలంగాణ యాసను గొప్పగా ఆవిష్కరించే మాటకారి తనం వుంది. కానీ అది క్లామ్‌ ముద్రలో ఇరుక్కుపోయింది. ఉన్న ఫళంగా ఆ చక్రం నుంచి కేటిఆర్‌ బైటపడాలి. ఎందుకంటే క్లాస్‌ లీడర్లు అవకాశం వచ్చినప్పుడే వెలుగుతారు. మాస్‌ లీడర్లు అవకాశాన్ని వెతుక్కొని చరిత్ర సృష్డిస్తారు. కేసిఆర్‌ తెలంగాణ సాధించడానికి మాస్‌ ఇమేజే పనికొచ్చింది. ఎప్పటికీ పనికొస్తుంది. కేటిఆర్‌ కు ప్రజల్లో మమేకమయ్యే మాటకారి తనం పుష్కలంగా వుంది. కానీ కేటిఆర్‌ లో చాలా మార్పులు రావాలి. మంత్రిగా వున్న సమయంలో రాష్ట్రాభివృద్ది కోణంలో మేధావులతో, అధికారులతో మమేకమైనంతగా సామాన్య జనంలో ఇముడలేకపోయారు. ఆయా సమయాలలో ఆయన హవ భావాలు స్పష్టంగా కనిపించేవి. అదే హరీష్‌ రావు విషయంలో ఎక్కడ వున్నా ఒకే తీరుగా వుంటుంది. అటు ప్రజలతో గాని, ఇటు నాయకులతో గాని, అధికారులతోనూ ఆయన కలివిడి తనం ప్రదర్శిస్తారు. అందుకే హరీష్‌ రావు మాస్‌ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కేటిఆర్‌ కూడా మాస్‌ లీడర్‌ ఇమేజ్‌ కోసం ఆరాటపడుతున్నారు. క్లాస్‌ ఇమేజ్‌ నుంచి బైట పడాలని ఆలోచిస్తున్నాడు. ఏ దేశ రాజకీయాలలు చూసినా మాస్‌ లీడర్ల చరిత్ర చెరిగిపోదు. ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ లను గుర్తుపెట్టుకున్నట్లు గతంలో పని చేసిన ఏ ముఖ్యమంత్రి ప్రజల గుండెల్లో లేరు. తెలంగాణ విషయంలో కేసిఆర్‌ తప్ప మరొకరు కనిపించరు. అమెరికా లో ట్రంప్‌ లాంటి మాస్‌ లీడరే కావాలని కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ లాంటి మాస్‌ లీడర్‌నే ప్రజలు మూడు సార్లు ఆదరించారు. రేవంత్‌ రెడ్డి కూడా మాస్‌ ఇమేజ్‌ తోనే లీడర్‌గా స్థిరపడ్డారు. సీనియర్లను పక్కకు తోసేసి సిఎం. అయ్యారు. జనం పల్స్‌ తెలుసుకోవడమే మాస్‌ లీడర్‌ విజయం. జన బాహుళ్యంలో మమేకమైనప్పడే నాయకుడికి చరిత్రలో స్థానం.

కేటిఆర్‌ పాదయాత్రతోనే బిఆర్‌ఎస్‌కు జైత్రయాత్ర మొదలౌతుందనే నమ్మకం శ్రేణుల్లో వుంది.

ఏ పార్టీ అధినేతలైనా, అగ్రనేతలైనా పార్టీ శ్రేణులకు ధైర్యమిచ్చే పనులు చేయాలి. వారికి వెన్నుదన్నుగా నిలవాలి. క్యాడర్‌ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. దేశ రాజకీయాలలో పాదయాత్రలు ఇప్పుడు సక్సెస్‌ పుల్‌ ఫార్ములా…ఒకప్పుడు ప్రజా సమస్యల మీద పాదయాత్రలు సాగేవి. ఇప్పుడు పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు సాగిస్తున్నారు. గతంలో ఎన్ని పాదయాత్రలు వున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ పాదయాత్రలకు ఆధ్యుడని అంటారు కాని తెలంగాణలో పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది కేసిఆర్‌. తెలంగాణలో కృష్ణా జలాల సాధన కోసం పాదయాత్ర చేశారు. తర్వాత నల్గొండ జిల్లా ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం కోసం పాదయాత్ర నిర్వహించారు. కాకపోతే రాజకీయ అవసరాలు, ముఖ్యమంత్రి పదవి కోసం సాగిన తొలి పాదయాత్ర మాత్రం వైఎస్‌ దే కావడం గమనార్హం. ఇక అప్పటినుండి ఎవరైతే ముఖ్యమంత్రి కావాలనుకుంటారో పాదయాత్ర ను ఆనవాయితీ చేసుకున్నారు. సక్సెస్‌ కూడా అయ్యారు. దాంతో రాజకీయంతో రాజ్యాధికారానికి పాదయాత్ర సక్సెస్‌ ఫార్మాలాగా మార్చుకున్నారు. వైఎస్‌ఆర్‌ తర్వాత ఏపి. సిఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపి. తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రి అయ్యారు. చివరికి ఏపి. మంత్రి లోకేష్‌ కూ సుమారు ఏడాదిన్నరకు పైగా పాదయాత్ర చేశారు. ఈ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ గెలుపులో కీలక భూమిక పోషించారు. తెలంగాణలో బిజేపి నాయకుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అధ్యక్ష హోదాలో ప్రజా సంగ్రామ యాత్ర చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిసిసి. అధ్యక్షుడు హోదాలో పాదయాత్ర నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారు. జాతీయ స్థాయిలో రాహుల్‌ గాంధీ కూడా రెండు దఫాలుగా పాదయాత్ర చేశాడు. దేశమంతా చుట్డి వచ్చారు. పార్టీ బలం పెంచారు. జాతీయ రాజకీయాలలో తాను పప్పును కాదు, నిప్పునని నిరూపిస్తున్నాడు. పాదయాత్రలు అలా ప్రజలను కదిలిస్తాయని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కరలేదు. తెలంగాణ లో షర్మిల పాదయాత్ర చేశారు. నిజానికి ఆమె తెలంగాణ రాజకీయాలు కాకుండా మొదట్లోనే ఏపి. రాజకీయాలను ఎంచుకొని అక్కడ పాదయాత్ర చేస్తే ఫలితం మరో రకంగా వుండేది. అంటే పాదయాత్ర వృధా కాదన్నది తెలుస్తోంది. అందుకే తెలంగాణ లో కేటిఆర్‌ తన రాజకీయ ప్రస్థానంలో బలమైన నాయకుడుగా ఎదగాలని చూస్తున్నారు. పాదయాత్రకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు జూన్‌ లోనే మొదలయ్యాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జూలై నెలలో పూర్తి చేస్తారు. ప్రస్తుతం ఆశాడ మాసం నడుస్తోంది. శ్రావణ మాసం వచ్చే సరికి అన్ని రకాల ఏర్పాట్లు ఎలా చేయాలన్న దానిపై కార్యాచరణ ఓ వైపు వేగంగా జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లుగా సజావుగా సాగితే శ్రావన మాసంలో మంచి రోజు కోసం చూస్తున్నారు. ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. గోదావరి నదీ పుణ్య స్నానమాచరించి బాసర సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి నుంచి పాదయాత్ర కు తొలి అడుగు వేయనున్నారు. అక్కడి నుంచి ఉత్తర తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలను కలుపుకుంటూ పాదయాత్ర చేస్తారు. అయితే ఈ పాదయాత్ర వినూత్నమైన పద్దతి అనుసరించాలని చూస్తున్నారు. రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడవాలి. అన్న లెక్కలు కాకుండా, ప్రజలతో మమేకమౌతూ ఎంత సమయం కేటాయించాలన్న దాని కోణంలో పాదయాత్ర సాగనునున్నది. సహజంగా పాదయాత్ర అంటే కార్యకర్తలు, నాయకులు వెంట రాగా రోజుకు 14 కిలోమీటర్లు, మధ్యలో భోజన విరామం, రోడ్ల మీద ప్రజలను పలకరిస్తూ సాగించారు. కానీ కేటిఆర్‌ పాదయాత్ర అలాంటి లెక్కలు కాకుండా ఈ తరానికి కూడా తెలంగాణ ఆత్మ గౌరవం నూరి పోసేలా సాగుతుంది. సరిగ్గా పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఎలా వుండేది. కేసిఆర్‌ పాలనలో ఎలా వుండేది. గతంలో ఊరు చెరువు ఎలా వుండేది. కాంగ్రెస్‌ పాలనలో ఎలా వుంది. అన్న విషయాలను ప్రజలకు తెలిసేలా సాగనున్నది. చెట్టు, పుట్టా, చేను, చెలక, చెరువు, కాలువలు, వాగులు, ఒర్రెలు ఎలా వున్నాయన్నది ప్రపంచానికి చూపేలా సాగుతుంది. పదేళ్లలో కేసిఆర్‌ తవ్వించిన కాలువలు, వాటిలో పారిన నీరు, పండిన పంట పొలాలు, పదేళ్ల క్రితం బావులు ఇలా అన్ని విషయాలను పంచుకుంటూ సాగుతుంది. దాంతో కేటిఆర్‌ క్లాస్‌ లీడర్‌ నుంచి మాస్‌ లీడర్‌ షిప్‌ వచ్చేలా వుంటుంది. ఈ పాదయాత్ర కనీసం రెండు సంవత్సరాలకు పైగా, అవసరమైతే మూడు సంవత్సరాల పాటు సాగేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం వుండగా కేటిఆర్‌ పాదయాత్ర ముగిస్తారు. అప్పుడు కేసిఆర్‌ రంగ ప్రవేశం చేస్తారు. ఈ పాదయాత్ర లో తెలంగాణ ఉద్యమ స్పూర్తిని మరో సారి రగిలిస్తూ ముందుకు సాగుతారు. ఒక్క హైదరాబాదు పరిధి నియోజకవర్గాలు కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాలలో యాత్ర సాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం నెల రోజుల పాటు యాత్ర సాగేలా కసరత్తు చేస్తున్నారు. సహజంగా ప్రతి నియోజకవర్గంలో సుమారు నాలుగు మండలాలు వుంటాయి. మండలానికి కనీసం ముప్పైకి పైగా గ్రామాలుంటాయి. మొత్తం నూటా యాభై గ్రామల ప్రజలను కలుసుకునే విధంగా యాత్ర సాగించాలనుకుంటారు. అప్పుడు మా ఊరికి కూడా కేటిఆర్‌ వచ్చాడన్న తృప్తి కేడర్‌లో వుంటుంది. ఎన్నికల సమయంలో ప్రచానికి పనికి వస్తుంది. ఇలా ప్రతి ఊరిలో ప్రజలను పలకరిస్తూ, వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందకు సాగుతారు. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ నిరసనలు కూడా పెద్ద ఎత్తున చేపడతారు. అదే సమయంలో పాదయాత్ర సాగుతున్న ప్రాంతాలలో సమస్యలపై పోరాటం చేస్తారు. అవసరాన్ని బట్టి ధర్నాలు, రాస్తా రోకోలు చేసుకుంటూ వెళ్తారు. దాంతో జన సమీకరణపై కూడా పార్టీ ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం వుండదు. ప్రజలే స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఇదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కూడా సులువుగా జరిగిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించడానికి దోహదమౌతుంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు పూర్తి చేసి భద్రాద్రిలో పాదయాత్రను ముగించేలా ప్లాన్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!