smashanallo realeastate, స్మశానాల్లో రియలెస్టేట్‌

స్మశానాల్లో రియలెస్టేట్‌

భూకబ్జాలు, ఇండ్ల కబ్జాలు, చెరువులు, కుంటల కబ్జాల గురించి తరచు మనం వింటూనే ఉన్నాం. ఇటీవల ఇవి మరి ఎక్కువైపోయాయి. నూతన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి స్థానికంగా భూములకు రెక్కలు రావడంతో కబ్జారాయుళ్ళ కబ్జాలకు అంతే లేకుండా పోయింది. అధికారుల అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించడం, ప్రజలను ఇబ్బందులకు గురిచేసి భూములు లాక్కోవడం వంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కబ్జాల్లో ఓ కొత్తరకం కబ్జాకు తెర తీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే…వర్థన్నపేట నియోజకవర్గంలో ఉన్న ఐనవోలు నూతన మండలంగా ఏర్పడిన తర్వాత కొందరు రియాల్టర్లు మండలకేంద్రానికి ముందుభాగంలో కొంతభూమిని కొనుగోలు చేసి ప్లాట్లను చేసి అమ్మకానికి ఉంచారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే వారు కోనుగోలు చేసిన భూమికి ముందు, పక్కన గ్రామానికి సంబంధించిన స్మశానవాటికలు ఉన్నాయి. దీంతో ఇండ్లస్థలాల కొరకు ఏర్పాటు చేసిన వెంచర్‌లో స్మశనాలు ఉంటే ఎవరు కోనుగోలు చేయడానికి ముందుకు రారనే ఉద్దేశ్యంతో అధికార పార్టీ నేతల అండదండలతో కలిసి గ్రామ ప్రజలకు సంబంధించిన స్మశానవాటికను అభివృద్ధి పేరుతో ఎత్తివేసేందుకు కొంతమంది పథకం రచించారు. తరతరాలుగా స్మశానవాటిక కోసం ప్రజలు వినియోగించుకుంటున్న స్థలాన్ని మార్చేందుకు రియాల్టర్లు విఫలయత్నం చేస్తున్నారు.

రియల్టర్‌ వ్యాపారం కోసం…

భూముల వ్యాపారం చేసుకుంటే దానికి ఎవరు అడ్డు చెప్పరు. అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకుని లేఅవుట్లు నిర్వహించుకోవచ్చు. కాని అనువు గాని చోటని తెలిసి కూడా అక్రమంగా స్థలాన్ని కొనుగోలు చేసి, ప్లాట్లు చేసి అమ్ముకొని కోట్లు గడించడానికి రియల్టర్లు చేస్తున్న ప్రయత్నంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే అప్పన్నంగా సంపాదించేందుకు రియల్టర్లకు సహకరిస్తున్న కొంతమంది నాయకులపై ప్రజలు మండిపడుతున్నారు.

అధికారపార్టీ నేత,కార్పోరేటర్‌ భర్త నయాదందా

ఇటీవలే అధికార పార్టీ నుండి కీలక నాయకుడిగా ఎదిగి స్థానిక శాసనసభ్యునికి అత్యంత నమ్మిన బంటుగా ఉంటున్న ఓ కార్పోరేటర్‌ భర్తకి సంబంధించిన ఈ లేఅవుట్‌ కోరకు స్థానిక నాయకులు స్మశానవాటికలను అప్పగించడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. కార్పొరేటర్‌ భర్త, ఓ అధికార పార్టీ నాయకుడి చేష్టలతో జనం అసహించుకుంటున్నారు. అధికారం ఉంది కదా అని ప్రజలకు సంబంధించిన స్మశాన స్థలాలను కబ్జా చేసి లేఅవుట్లు వేయడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండలకేంద్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో ఇంత జరుగుతున్నా స్థానిక నాయకులుగానీ, ఎమ్మెల్యేగానీ ఈ విషయంపై ఎంతమాత్రం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావీస్తోంది. కార్పొరేటర్‌ భర్త మరో అధికార పార్టీ నాయకుడిని కలుపుకుని స్మశనాల్లోనే లేఅవుట్లు చేసి ఇంత బహిరంగంగా ప్లాట్లను అమ్మకానికి పెట్టినా ఇటు అధికారులుగానీ, అటు అధికార పార్టీ నాయకులుగానీ ఎంత మాత్రం నోరుమెదపకపోవడంపై దీని వెనకాల వీరి హస్తం కూడా ఉంటుందని పలువురు అంటున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని తమకున్న కబ్జా తెలివితో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తరతరాలుగా ఉంటున్న స్మశాన స్థలాన్ని కబ్జా చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడంపై స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అనుమతులు రాక ముందు తప్పుడు ప్రకటనలు…

మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన లే అవుట్‌కు కుడా నుండి ఇంకా ఎలాంటి అనుమతి రాకముందే కోనుగొలుదారులు ఆకర్షించి ప్లాట్లను అమ్ముకోవాలని నిర్వహకులు చేస్తున్న తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. లేఅవుట్‌ ముందు వెంచర్‌ పరిసరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు, పోలీస్‌స్టేషన్‌లు నిర్మించబోతున్నట్లు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు బాగోతం చాటున వారికి స్థానిక పాలకులు,ముఖ్య నాయకుల అండదండల ఉన్నాయని పలువురు చెప్పుకుంటున్నారు. ఇకనైనా అధికారులు, అధికార పార్టీ నాయకులు స్పందించి స్మశానాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *