sena layout kabzalu chudatharama…,సేనా లేఅవుట్‌ కబ్జాలు చూడతరమా…

సేనా లేఅవుట్‌ కబ్జాలు చూడతరమా…

లేఅవుట్‌ నిర్వాహకుల కబ్జాలు నానాటికి స్థానిక ప్రజలకు శాపంగా మారుతున్నాయి. మండలంలో లే అవుట్‌ కొరకు కొనుగోలు చేసిన భూముల్లో, పక్కన ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని దర్జాగా ప్లాట్లను అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ భూములను కొనుగలు చేసి కోట్లు గడించాలన్న వారి ఆలోచన వారి వ్యాపారవ్యవహారాలకు సంబంధించినదైతే అట్టి భూములను ఆనుకుని ఉన్న భూములనే నమ్ముకుని బతుకుతున్న రైతుల జీవితాల్లో చీకట్లు మిగిల్చే పరిస్థితులకు దారి తీస్తున్నాయి. బీద ప్రజలకు సంబంధించి భూముల్లో చిన్న చిన్న తప్పిదాలు ఉంటేనే అమ్మో ఎంత పెద్ద తప్పిదమో అని భూతద్దంలో చూసి పట్టాలు చేయకుండా పక్కనబెట్టే రెవెన్యూ అధికారులు రెవెన్యూ కార్యాలయం పక్కనే నిర్వహిస్తున్న లేవుట్‌లో తప్పిదాల మీద తప్పిదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు అర్జీలు పెట్టుకున్నప్పటికి అధికారులు మాత్రం నిర్వాహకులకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. దీంతో రెచ్చిపోయిన సేన లేఅవుట్‌ నిర్వాహకులు భూములను కబ్జా చేసుకుంటూనే పోతున్నారు.

మిట్టకాలువ మాయం.!

సేన లేఅవుట్‌ కొరకు కొనుగోలు చేసిన భూములలో ఉన్న మిట్టకాలువను లేఅవుట్‌ నిర్వాహకులు అక్రమంగా కబ్జాచేసి కాలువను మాయం చేశారు. దీంతో మిట్టకాలువ పరిధిలో ఉన్న వ్యవసాయ భూములకు చెందిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కబ్జా చేసి మూసివేసిన మిట్టకాలువ కింద సుమారు 60మంది రైతులకుపైగా వ్యవసాయ భూములు కలిగి ఉన్నారు. కాలువను మూసిన విషయమై నిర్వాహకులను స్థానిక రైతులు ఇదేంటని ప్రశ్నించినప్పటికీ మీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకొండని చెప్పినట్లు సమాచారం.

పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా..?

లేఅవుట్‌ నిర్వహిస్తున్న స్థలాన్ని ఆనుకుని 29 సర్వే నంబర్‌ ఉంది. ఈ సర్వే నంబర్‌లో మొత్తం 16ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉన్నది. కొనుగోలు చేసిన భూమి పక్కన ప్రభుత్వభూమిని కబ్జా చేసినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. 516, 517, 305లను అనుకున్న ప్రభుత్వభూమిలో సుమారు 12 నుండి 15గుంటల భుమిని కబ్జాచేసి లేఅవుట్‌లో కలిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

బ్లూప్రింట్‌లో కొంత లేఅవుట్‌ చేస్తున్నది మరింత….

కుడాకు, గ్రామపంచాయితికి సమర్పించిన కొనుగోలు భూమికి సంబంధించి బ్లూప్రింట్‌లో చూపిన భూమి విస్త్తీర్ణానికి ప్రస్తుతం నిర్వాహకులు చేస్తున్న విస్తీర్ణానికి మధ్య చాలా తేడాలు ఉన్నట్లు స్పష్టంగా తెలియవస్తుంది. బ్లూప్రింట్‌ ప్రకారం 13ఎకరాల భూమిని చూపినప్పటికీ కాలువ, ప్రభుత్వ భూములు కలుపుకుని మొత్తం 16ఎకరాల విస్తీర్ణం వరకు లేఅవుట్‌ కొరకు అభివృద్ధి చేస్తున్నారు.

అధికారిక నిర్వాహకులు వేరు…పెత్తనం చేసే నిర్వహకులు వేరు..?

అసలే లేఅవుట్‌ వ్యాపారం కోట్ల రూపాయల పెట్టుబడులు, రాబడుల వ్యవహారం. దీంతో నిర్వాహకులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. లేఅవుట్‌ నిర్వహణకు సంబంధించి రాజకీయ ప్రముఖుల అండదండలు ఉన్న వ్యక్తులే ఇందులో భాగస్వాములుగా ఉండడం అధికారికంగా కాకపోయినా అనధికారికంగా అందరికి తెలిసిన విషయమే. సరిగ్గా మండలకేంద్రంలో నిర్వహిస్తున్న లేఅవుట్‌ విషయంలో కూడా ఇదే జరుగుతన్నదని ప్రచారం జరుగుతుంది. సేనా లేఅవుట్‌కు సంబంధించి గ్రామపంచాయితికి సమర్పించిన భూముల కొనుగొళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో గంజి నవీన్‌, ఆమంచ మహేశ్వర్‌లు కొనుగోలుదారులుగా ఉన్నారు. కాని లేఅవుట్‌ నిర్వహణ తదితర వ్యవహారాలు మాత్రం స్థానిక నేతలకు దగ్గరి పరిచయస్తులు, రాజకీయ మిత్రులే చూస్తున్నారని స్థానిక ప్రజలు పలు సంధర్భాల్లో అధికారులకు సమర్పించిన దరఖాస్తులలో తెలియజేశారు. ఏదిఏమైనా వ్యాపారవ్యహరాలను అడ్డుపెట్టుకుని ప్రజలకు అన్యాయం చేసే విధంగా ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను మింగెయాలని చూసే వారి ప్రయత్నాలు మానుకోవాలని పలు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు హెచ్చరిస్తున్నారు.

కబ్జాలపై కుడా అధికారుల ద్వందవైఖరి..

మండలకేంద్రంలో సేన లేఅవుట్‌లో జరుగుతున్న కబ్జాలను గురించి కుడా అధికారులు నిర్వాహకులకు అండగా ఉండే విధంగా వ్యహరించడం పట్ల స్థానిక ప్రజలు, ప్రజాసంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేఅవుట్‌లో ప్రభుత్వ భూముల కబ్జాల గురించి కుడా అధికారులు స్పందించకుండా నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరించడం అధికారుల నిర్లక్ష్యవైఖరిని ప్రతిబింబించడంతోపాటు వారు నిర్వాహకులకు కొమ్ముకాస్తున్నారని ఒప్పుకోకనే ఒప్పుకుంటున్నారు. కుడా అనుమతి కొరకు సంబంధిత సేన లేఅవుట్‌ ఫైల్‌ టెక్నికల్‌ విభాగంలో ఉన్నట్లు సమాచారం.

లేఅవుట్‌ కబ్జాలపై రెవెన్యూ, కుడా అధికారుల పాత్రే కీలకం..

లేఅవుట్ల నిర్వహణలో భూములకు సంబంధించి క్లియరెన్స్‌ ఇచ్చేది. రెవెన్యూ శాఖ అధికారులు వారి నుండి ఫైల్‌ ముందుకు వెళ్ళిన తర్వాత కబ్జాలకు పాల్పడినట్లైతే స్థానిక రెవెన్యూ అధికారులు, కుడా అధికారులకు విషయం దృష్టికి వస్తే తగు విచారణ చేసి చర్యలు తీసుకోవడం, అనుమతుల రద్దులకు సంబంధించి రెవెన్యూ, కుడా అధికారుల పాత్రలే కీలకంగా ఉంటాయి. మరీ మండలకేంద్రం లే అవుట్‌ జరుగుతున్న కబ్జా అంశాలపై ఇదివరకే సమాచారం తెలిసినప్పటికి అధికారులు వాయిదాలను ఎంచుకుని కాలం గడుపుతున్నారు. ఇప్పటికైనా ఈ విషయాలపై స్పందించి నిర్వాహకుల ఆగడాలకు చెక్‌ పెట్టనట్లతే సమాజంలో విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదంతోపాటు ఉన్నతాధికారుల నుండి అధికారిక చర్యలకు బాధ్యులవుతారనే విషయాన్ని గుర్తెరిగితే మంచిదని అంటున్నారు పిర్యాదిదారులు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *