ఈనెల 29న స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల?
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాద్:సెప్టెంబర్ 24 తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామపంచాయతీలు మండలాల పరిధిలో రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియ చేపట్టారు. మండలలోని ఎంపీటీసీలు సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డిఓలు గ్రామాల్లోని వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు పూర్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు.. సంబంధిత అధికారులతో కలెక్టర్లు సమావేశమయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికలను రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని జిల్లాల కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే పోలీసు, పోలింగ్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతారని, అంత మొత్తం లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ వద్ద లేరని కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదించారు.
తమ వద్ద ఉన్న సిబ్బంది ఆధారంగా రెండు, మూడు విడతల్లో పోలింగ్నిర్వహించాలని కోరారు. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చిన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రతిపాదనలు పంపగా.. సమస్యాత్మక గ్రామాలు, మండలాలు ఉన్న జిల్లాల కలెక్టర్లు మాత్రం మూడు విడతల్లో ఎలక్షన్స్ నిర్వహించాలని నివేదించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు గోప్యంగా ఉంచారు. బీసీ రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీచేసిన అనంతరమే రిజర్వేషన్లు ప్రక్రియకు సంబంధించిన జాబితాను పంచాయతీరాజ్ శాఖ, బుధ, లేక గురువారం విడుదల చేయనుంది.
మరోసారి ప్రభుత్వంతో సంప్రదించి ఎన్ని విడుతల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకొనున్నారు.అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 29న షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది, అక్టోబర్ రెండో వారంలో ఫస్ట్ విడత నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది, నవంబర్ 10 కల్లా సర్పంచ్ ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.