నిండా ముంచేస్తున్న ‘చిట్‌’ వ్యాపారులు

-మోసపోతున్న సభ్యులు

-కోర్టు నుంచి తెచ్చుకుంటున్న ఐపీ

-నిస్సహాయ స్థితిలో బాధితులు

-బయటికి చెప్పలేని పరిస్థితి

-ఫిర్యాదులు చెద్దామంటే అంతా అనధికారమే

మంచిర్యాల, నేటి ధాత్రి:(కాగజ్‌నగర్‌ టౌన్‌)

చిట్టీలో చేరి నాలుగు డబ్బులు వేసి పొదుపు చేసుకుందామంటే ఇప్పుడు అసలు డబ్బులకే ఎసరు వచ్చే పరిస్థితి ఏర్పడింది. కాగజ్‌నగర్‌ పట్టణంలో కొంతమంది లైసెన్సులు లేని చిట్టీవ్యాపారుల వద్ద చిట్టీలు వేసి మోసోతున్నారు. చిట్టీ నిర్వాహకుడు చేతులెత్తేస్తే ఏమి చేయాలో తెలియక సభ్యులంతా భయాందోళన చెందున్నారు. వార్డుల్లో ఉన్న పలుకుబడి, కొన్ని సంవత్సరాలుగా చిట్టీలు నడుపుతున్నారన్న నమ్మకం కొద్ది వార్డులోని సభ్యులంతా చిట్టీలో చేరుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ చిట్టీలు ఎత్తుకున్న వారికి సకాలంలో డబ్బులు చెల్లించక పోవటంతో తలకు మించిన భారమవుతుండటంతో లైసెన్సులు లేని చిట్టీ వ్యాపారులు ఏకంగా కోర్టు నుంచి ఐపీ తెచ్చుకుంటున్నారు. సభ్యులందరికి కోర్టు నుంచి నోటీసులు జారీ అవుతున్నాయి. అందరి పేర్లు బయట పడుతుండటంతో చేసేదీ ఏమీ లేక అంతా హైరానపడుతున్నారు. పట్టణంలో ఇప్పటికే నలుగురు వ్యక్తులు ఐపీ(దివాళా పిటీషన్‌)లు సమర్పించారు. ఇక అలాగే మరికొంత మంది కూడా ఇదే బాటలు పడుతున్నట్టు తెలియటంతో తమ డబ్బులు తమకు చెల్లించాలని సంబంధిత వ్యక్తులపై రుణదాతలు ఒత్తిడి తెస్తున్నారు.

పోలీసుల సోదాలతో కదిలిన డొంక

రాష్ట్ర వ్యాప్తంగా మార్చిలో పోలీసులు లైసెన్సులు లేని చిట్టీ వ్యాపారులపై ఏకకాలంలో దాడులు నిర్వహించటంతో ఈ దందా ఇప్పుడు వెలుగు చూసింది. ఒక్కొక్కరి వద్ద లక్షల్లో డబ్బులు చెలామణి అవుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. చిట్టీలు వేసిన వారు భయాందోళనకు గురికావటంతో చిట్టీల వ్యాపారులు అంతా సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే ఇదే అదనుగా కొందరు లైసెన్సులు లేని చిట్టీ వ్యాపారులు కోర్టును ఆశ్రయించి ఐపీలు తెచ్చుకున్నారు. దీంతో సభ్యులందరికీ నోటీసులు వచ్చాయి. చేసేదీ ఏమీ లేక అంతా లోలోనా ఆందోళన పడుతున్నారు. బయటికి చెప్పుకుంటే పరువు పోతుంది.కోర్టులు, కేసులు ఎందుకని కొంతమంది వదిలేస్తున్నారు. మరికొందరు మాత్రం తమ డబ్బులు తమకు వచ్చేట్టు చూడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణంలో పేరొందిన వ్యాపారి ఏకంగా రూ.4కోట్ల మేర చిటీలు నడిపి చేతులెత్తేశాడు. ఈ సంఘటన జరిగిన పక్షం రోజుల్లోనే మరోవ్యాపారి ఇదే బాటలోకి వెళ్లటం పట్టణంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆరు సంవత్సరాల క్రితం కూడా కాగజ్‌నగర్‌ బాలాజీనగర్‌కు చెందిన ఓ మహిళ చిట్టీల పేరిట కోట్లు వసూలు చేసింది. అలాగే ఇదే బాలాజీనగర్‌కు మరో మహిళ కోట్ల రూపాయల చిట్టీలు వేసి అందరినీ బురిడీ కొట్టించి ఐపీ పెట్టి హైదరాబాద్‌కు టికానా మార్చింది.

కాగజ్‌నగర్‌లో పెరుగుతున్న ఆర్థిక నేరాలు

కాగజ్‌నగర్‌ పట్టణంలో ఆర్థిక నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాగజ్‌నగర్‌ పట్టణంలో టీకొట్టు వ్యాపారం చేసే రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు అందరినీ కొన్ని ఏళ్లుగా మచ్చిక చేసుకొని నమ్మించి ఏకంగా లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఇక్కడి నుంచి రాత్రికి రాత్రే ఉడాయించాడు. దీంతో అప్పులిచ్చిన వారంతా తాము మోసపోయామని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ పరువు ఎక్కడ పోతుందోనని అంతా గుట్టుగానే ఉన్నారు. అలాగే కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో ఐకేపీ రుణాల్లో గోల్‌మాల్‌ జరిగి కోట్ల రూపాయిల స్కాం జరిగినట్టు తేలింది. సదరు మహిళ సంఘం సభ్యురాలు కోర్టును ఆశ్రయించి ఐపీ తెచ్చి చేతులెత్తేసింది. వీరితోపాటు పలువురు వ్యాపారులు కూడా చేసిన అప్పులు తీర్చలేక కూడా కోర్టును ఆశ్రయించి ఐపీ తెచ్చుకోవటం చర్చనీయాంశమైంది. కాగజ్‌నగర్‌ మార్కెట్‌లో ఓ సీఎస్పీ సెంటర్‌ నడిపే వ్యక్తి కోట్ల రూపాయల అప్పులు చేసి ఇబ్బందులకు గురికావటంతో తిరిగి చెల్లించలేక ఆత్మహత్యే శరణ్యం అంటూ వీడియో తీసుకొని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడంతో పోలీసులు ఆ వ్యక్తిని కాపాడిన విషయం కూడా ఇటీవల వెలుగు చూసింది.

*లైసెన్సులు తీసుకోవాల్సిందే
శంకరయ్య, సీఐ, కాగజ్‌నగర్‌*

లైసెన్సులు లేకుండా చిట్టీ వ్యాపారాలు చేయరాదు. గత నెలలో తాము పట్టణంలో అనధికార చిట్టీ దందా చేసే వారిపై ఏకకాలంలో దాడులు నిర్వహించాం. లైసెన్సులు లేకుండా చిట్టీ వ్యాపారం చేస్తే తప్పకుండా కేసులు నమోదు చేస్తాం. చిట్టీ నిర్వహించి ఎవరైనా మోసిగిస్తే ఫిర్యాదు చేయాలి. అలాగే సమాచారం కూడా అందజేస్తే గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *