# మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్.
# చంద్రయ్యపల్లిలో గ్రామసభలో పాల్గొన్న ప్రజలు,అధికారులు.
నర్సంపేట,నేటిధాత్రి:
అర్హత గల రైతులకు ఈ నెల 26 నుండి రైతు భరోసా పథకం అమలు అవుతుందని నర్సంపేట మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,కొత్త ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఇండ్లు 4 పథకాలు అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం గురువారం నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లిలో గ్రామసభ పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి
అధ్యక్షతన జరిగింది.గ్రామ ప్రత్యేక అధికారి రజినీకాంత్ సమక్షంలో మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్,మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయి కుమార్,ఎపిఓ ఫాతిమా మేరీ ఆయా పథకాల లబ్ధిదారుల జాబితాలు చదివి వినిపించారు.కొందరు అర్హులకు పథకాల లిస్ట్ లో పేర్లు రాకపోవడంతో అధికారులను నిలదీశారు.ప్రభుత్వం చేపట్టిన పథకాలు నిరంతర ప్రక్రియ అని మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్ గ్రామస్థులకు తెలుపగా అందరూ శాంతించారు.గ్రామంలో ఉన్న అర్హత గల ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా సహకరించాలని మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి అధికారులకు విన్నవించారు.అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఏఓ తెలిపారు.ఇందరమ్మ ఆత్మీయ భరోసాలో అర్హుల పేర్లు రాలేదని మాజీ ఉప సర్పంచ్ భాషబోయిన శ్రీను తెలుపగా జాబితాలో పేర్లు రానివారు,ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డుల కోసం మరల దరఖాస్తులు చేసుకోవాలని పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు వరంగంటి ప్రవీణ్ రెడ్డి,మాజీ సర్పంచ్లు బరిగేల లావణ్య కిషోర్,అజ్మీర పాపయ్య, ఏడెల్లి రాజీరెడ్డి, భాషబోయిన రవి, ఏఎన్ఎం కోమల,గ్రామస్తులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మెమొరాండం
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల లబ్ధిదారుల ఎంపిక పట్ల అర్హత గల ప్రతీ ఒక్కరికీ పథకాలు అందేలా చేయాలని కోరుతూ భారత్ రాష్ట్ర సమితి పార్టీ చంద్రయ్యపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు జరుపుల వీరన్న ఆధ్వర్యంలో గ్రామ సభలో అధికారులకు మెమొరాండం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్లు బరిగేల లావణ్య కిషోర్,అజ్మీర పాపయ్య,మాజీ వార్డు మెంబర్ ఉప్పుల రాజు,జితేందర్,రవి,తదితరులు పాల్గొన్నారు