వరంగల్/ గీసుకొండ,నేటిధాత్రి:
గీసుకొండ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ గత కొన్నేళ్లుగా తన పుట్టినఊరి అభివృద్ధి కోసం,సమాజంలో పేదరికంతో బాధపడుతున్న అభాగ్యులను ఆదుకుంటూ గీసుకొండ గ్రామ శ్రీమంతుడుగా ప్రసిద్ధిగాంచారు. లక్ష్మీనారాయణ చేస్తున్న సేవాకార్యక్రమాలను గుర్తించిన రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ వారు, అతనికి ఒకేషనల్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక చేసి, రోటరీ క్లబ్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఘనంగా సత్కరించారు.రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ అధ్యక్షుడు కురువెళ్ల రాజగోపాల్ రావు అధ్యక్షతన ఏర్పాటైన ఈసమావేశంలో వంగాల రమేష్, డాక్టర్ సి. శరత్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై అవార్డు అందజేశారు.వీరితోపాటు ఈకార్యక్రమంలో రోటరీ క్లబ్ బాధ్యులు మామిడాల సుధాకర్,తోట వైద్యనాధ్,అనంతుల కుమారస్వామి,గుమడవెళ్లి సురేష్, రామగిరి రవిందర్, గీసుకొండ హైస్కూల్ ఉపాధ్యాయులు విటోభా, కర్ణకంటి రాంమూర్తి, గీసుకొండ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా అవార్డు గ్రహీత పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అనే సంకల్పంతో తాను సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాననీ, నేడు రోటరీ క్లబ్ వారి ఒకేషనల్ ఎక్సలెన్సీ అవార్డు తో తనపై బాధ్యత పెరిగిందని భావిస్తున్నానీ, మున్ముందు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని, తనకు అవార్డు అందజేసిన వరంగల్ రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలిపారు.