గీతాంజలిలో రోడ్డు భద్రతపై అవగాహన
నర్సంపేట,నేటిధాత్రి:
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజల్లో చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో గీతాంజలి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రోడ్డు భద్రత అవగాహనా సదస్సును ఘనంగా నిర్వహించారు. నిత్యం ఆందోళనకు గురిచేస్తున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాల పాటన అత్యంత కీలకమని కార్యక్రమంలో పాల్గొన్న విద్యావేత్తలు తెలిపారు.ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ కొర్ర సారయ్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, అతివేగం, ఓవర్‌లోడింగ్ వంటి కారణాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం మాత్రమే సరైన మార్గమని ఆయన వివరించారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్. రాజేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు పాఖాల రోడ్డు కూడలి వరకు రోడ్డు భద్రత నినాదాలతో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించేలా ప్రోత్సహించాలని సూచించారు.
ఒక చిన్న నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడంతో పాటు రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టివేస్తుందని పేర్కొన్నారు. అలాంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ కుటుంబంతో సంతోషంగా జీవించాలని హితవు పలికారు.
