ప్రత్యేక అధికారిణికి సన్మానం
దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో పదవతరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఆ పాఠశాల ప్రత్యేక అధికారిణి మంజులను జిల్లా కలెక్టర్ గుండ్రాతి హరిత, ఆర్జేడీ, జిల్లా విద్యాశాఖ అధికారి రాజీవ్‌లు హరిత ప్రసాదం (మొక్క), శాలువాతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిణి మంజుల మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో నిరుపేద విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారని, వారి భవిష్యత్తు కోసం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉన్నతవిద్యను అందిస్తున్నామన్నారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని తెలిపారు. అందుకు గుర్తించిన ప్రభుత్వం అవార్డుతో పాటు పాఠశాల అభివద్ధి కోసం 50వేల నగదు పారితోషికాన్ని అందిస్తున్నదని అన్నారు. నగదు బహుమతిని జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కలెక్టర్ చేతుల మీదుగా అందుకోనున్నట్లు ప్రత్యేకాధికారిణి మంజుల తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకురాళ్లు సుభాషిని, స్రవంతిలు పాల్గొన్నారు.