ప్రతిభాపాటవాల ఆవిష్కరణకు వేసవి శిబిరాలు
విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభాపాటవాలను ఆవిష్కరించడానికి వేసవి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయని మాధవ స్మారక సమితి అధ్యక్షుడు అలువాల బిక్షపతి తెలిపారు. బుధవారం హన్మకొండ కాకాజీకాలనీలోని శ్రీవివేకానంద యోగా కేంద్రంలో మాధవ స్మారక సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా మాధవ స్మారక సమితి అధ్యక్షుడు అలువాల బిక్షపతి, వ్యవసాయ శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ పొల్సాని శ్రీనివాస్‌రెడ్డి, ఎంజిఎం రిటైర్డు ఆర్‌ఎంఓ బందెల మోహన్‌రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ వేసవి శిబిరాలతో విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభాపాటవాలను ఆవిష్కరింపచేస్తామన్నారు. విద్యార్థులు ఈ వేసవి శిబిరాలలో పాల్గొనడం ద్వారా పలు విషయాలను నేర్చుకోగలుగుతారన్నారు. ఈ శిబిరానికి 150మంది విద్యార్థులు హాజరుకావడం అభినందనీయమని పేర్కొన్నారు. వారంరోజులపాటు నిర్వహించే ఈ శిబిరంలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు, భారతీయ సాంప్రదాయక ఆటలు, నీతి కథలు, సంస్కృత భాషా తరగతులు, ఆకర్షణీయమైన చేతిరాత, గీత, శ్లోకాలు, సుభాషితాలపై శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శిబిర నిర్వాహకులు దాస్యం రామానుజం, సత్తు రామనాథం, మిట్టపెల్లి వేణు, తాత ఓదెలు, లోకేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.