`ఆదరించిన ప్రజలకు సేవ చేయడం మర్చిపోతున్నారు.
`దిక్కు మాలిన రాజకీయాలు చేస్తున్నారు.
`రాజకీయాలు వదిలేశారు.
`వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యతనిస్తున్నారు.
`ప్రజాక్షేత్రంలోకి వెళ్లే శక్తి లేదు.
`ఎన్నికలుంటే తప్ప సభలు పెట్డుకోలేరు.
`కార్యకర్తలను కలుసుకోలేరు.
`ఒకరినొకరు పరస్పర విమర్శలు చేసుకోవడం అలవాటు చేసుకున్నారు.
`అయితే అవినీతి ఆరోపణలు!
`లేకుంటే నీతి మాలిన ఆరోపణలు!
`నిత్యం అవే ఆరోపణలా!?
`నాయకులు రాసలీల బాగోతాలా!
`చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడడం లేదు!
`విమర్శలు చేయడానికి ముందూ వెనుకా ఆలోచించడం లేదు.
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాలలో నాయకుల మాటలకు హద్దూ బద్దూ లేకుండాపోతోంది. గతంలో ప్రతిదానిని రాజకీయం చేయడం అలవాటైందని పార్టీలు అంటుండేవి. ఇప్పుడు రాజకీయాలు మానేసి, అశ్లీలాలు మాట్లాడుకుంటున్నారు. ఆ నాయకుడు వ్యవహరం ఇలా, ఈ నాయకుడి చీకటి బాగోతం ఇలా అనే మాటలు తప్ప మరేం వినిపించడం లేదు. అసలు సమాజం ఏమనుకుంటోంది? అన్న ఆలోచన కూడా లేకుండాపోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా పెరిగిన తర్వాత రాజకీయాలలో కూడా విపరీత ధోరణలు పెరిగిపోతున్నాయి. ఇది సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. అసలు నాయకుల వ్యక్తిగత జీవితాలలోకి ఎందుకు తొంగి చూస్తున్నారన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది. నిజంగానే నాయకులు ఎవరి జీవితాలనైనా నాశనం చేస్తే సమాజమే ఊపేక్షించదు. కాని లేని పోని బురదను జల్లుతూ, పేరున్న మహిళలను జీవితాలను ఎందుకు రోడ్లమీదకు తెస్తున్నారో అర్దం కావడంలేదు. ఇలాంటి విషయాలు ప్రజలు కోరుకుంటున్నారనుకోవడం రాజకీయ పార్టీల అవివేకానికి పరాకాష్ట. ఓ పక్క ప్రజా సమస్యలు నలుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఎంత సేపు ఆధిప్యత రాజకీయాలు..కక్షపూరిత రాజకీయాలకు దారులు వేస్తున్నారు. పాలక ప్రతిపక్ష పార్టీలు ఒక రోజు నిందించుకున్నారంటే వేరు. నిత్యం నిందలేనా? రాసలీలల కధనలేనా? మొన్నటి దాకా కేటిఆర్ గురించి చెప్పిందే చెప్పి, రాసిందే రాసి అటు నాయకులు, మీడియా దుర్మార్గంగా వ్యవహరించింది. అసలు ప్రభుత్వ పెద్దలు కూడా ఇలాంటి విషయాలపై మాట్లాడడడం సరైంది కాదు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ లో కేటిఆర్ దోషిగా తేలితే శిక్ష పడుతుంది. కాని అది నిజమే కాదో తెలుసుకోకుండానే రకరాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి మేమేం తక్కువ తిన్నామా? అన్నట్లు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపణలుగుప్పించారు. నిజానికి ముఖ్యమంత్రి పదవిలో వున్న నాయకుడు అర్దరాత్రులు ఒంటరి ప్రయాణం చేసే అవకాశం వుంటుందా? రాజకీయ నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా కౌషిక్ రెడ్డికి తెలియదా? గతంలో మేం బురద జల్లుతాం తుడుచుకోండి? అనే రాజకీయాలు చేసేవారు. ఇప్పుడు మేం బురదే జల్లుతాం..మీరు బురదే చల్లండి.. చూసుకుందాం? అన్నట్లు వుంది. ఇవేనా ప్రజా సమస్యలు లేవా? అవి పాలక , ప్రతిపక్షాలకు పట్టవా? ప్రజలు ఎనుకున్న ప్రభుత్వాలు ఏంచేయాలి? ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీలు ఏం చేయాలన్నదానిపై స్పష్టత వుంది. కాని తెలంగాణలో ఏం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ 18నెలలు గడుస్తోంది. అనేక కార్యక్రమాలు రూపకల్పన జరుగుతున్నాయి. కాని అవి ప్రజల్లోకి చేరడంలేదు. కాని నిత్యం అదికార, ప్రతిపక్షాల మద్య జరుగుతున్న వివాదాలు మాత్రం మీడియాలో వార్తలౌతున్నాయి. పెద్ద పెద్ద హెడ్డింగులౌతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. ప్రతిపక్షాలను పాలక పక్షాలు నిందించడం వేరు. వేదించడం వేరు. గతంలో ఇదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ప్రజా సమస్యలు గాలికి వెళ్తున్నాయి. నిజంగా ప్రజల కోసం ఆలోచించే పార్టీలు ఏవైనా వున్నాయా? ఎన్నికల ముందు ఓడిపోయిన బిఆర్‌ఎస్ ఇచ్చిన హమీలు, గెలిచిన పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన హమీల ఎక్కడైనా చర్చ జరుగుతోందా? లేదు. కేవలం నిందలు, ఆరోపణలు తప్ప నిజాయితీ మాటలు ఎక్కడా లేవు. ఎంత సేపు రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్ దోచుకున్నది అంటూ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అదికారంలోకి వచ్చిన ఈ పద్దెనమి నెలల్లో లెక్కలేనంత అవినీతి జరుగుతోందని బిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. మధ్యలో బిజేపి చోద్యం చూస్తోంది. ప్రతిపక్షంగా వున్న బిజేపి కూడా ఏ ప్రజా సమస్య మీద స్పందిస్తున్న దాఖలాలు లేవు. ఏ క్షణాన ఏ పార్టీ ఎటువైపు మాట్లాడుతుందో అర్దం కావడంలేదు. ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే బిజేపి పాలక పక్షం మీదకన్నా, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ మీదనే యుద్దం చేస్తోంది.. బిఆర్‌ఎస్‌గతంలోనే చేసిన తప్పులనే తవ్వితీస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హమీల మీద ఇప్పటి వరకు బిజేపి ప్రస్తావించపోవడం గమనార్హం. బిఆర్‌ఎస్ పార్టీకి ప్రశ్నించే నైతికలేదనే అనుకుందాం? కాని బిజేపి ఏం చేస్తోంది. ఎందుకు మౌనంగా వుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తేవడం లేదు. పైగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ను ఎంత కార్నర్ చేస్తున్నారో అంతే విధంగా బిజేపిని కూడా కార్నర్ చేస్తున్నారు. అయినా బిజేపిలో ఎలాంటి చలనం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. వాటితోపాటు మరో 420 హామీలు కూడా ఇచ్చింది. వాటిపై ఏ ఒక్క బిజేపి నాయకుడికైనా అవగాహన వుందా? ఎప్పుడైనా కాంగ్రెస్ మ్యానిఫెస్టో చదివారా? అందులోని అంశాలపై చర్చించారా? కార్యచరణ ప్రకటించారా? లేదు. కనీసం ఆరు గ్యారెంటీలలో ఎన్ని అమలౌతున్నాయి. ఎన్ని అమలు కావడం లేదన్న వాటిపైనైనా బిజేపికి అవగాహన వుందా? సహజంగా ప్రబుత్వం మీద యుద్దంచేసేప్పుడు ప్రతిపక్షాలు అన్నీ కలిసి రాకపోయినా సరే, ఒకే ఎజెండాతో ఉద్యమాలు సాగిస్తాయి. కాని ఇప్పుడు పరిస్దితి భిన్నంగా వుంది. బిఆర్‌ఎస్ అధికారంలో వున్నప్పుడు ఆపార్టీని దింపడానికి, కేసిఆర్‌ను గద్దెదించడానికి ఏక కాలంలో రెండు పార్టీలు చేయాల్సినంత పోరాటం చేశాయి. అన్ని విషయాల మీద పోరాటంలో ఎవరి పై చేయి అన్నట్లుగా సాగాయి. కాని ఇప్పుడు ఆ బిజేపిలో ఆ దూకుడు లేదు. అసలు ప్రజా సమస్యల మీద స్పందనే లేదు. ముఖ్యంగా రైతుల సమస్యల మీద కూడా బిజేపి మాట్లాడలేకపోతోంది. రైతులకు రైతు భరోసాపై బిజేపి స్పందనలేదు. వృద్దాప్య పించన్లు ఎప్పుడు పెంచుతారని అడిగింది లేదు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. అది ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించిన బిజేపి నాయకుడు లేడు. విద్యార్ధినులకు లాప్ టాప్‌లు ఇస్తామన్నారు. విద్యార్దులందరికీ విద్యా భరోసా కార్డులిస్తామన్నారు. వీటి మీద బిజేపి ఎందుకు మాట్లాడడం లేదు. ఎందుకు మౌనంగా వుంటున్నారు. నిజంగా బిఆర్‌ఎస్ పార్టీ పదేళ్లకాలంలో తప్పులు చేస్తే శిక్షించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది. నిజంగా కేసిఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేసినట్లైతే ఎందుకు ఉపేక్షిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. ప్రజలు కేసిఆర్ పాలన వద్దనుకున్నారు. కేసిఆర్ నాయకత్వం అవసరమే లేదనుకున్నారు. ఫామ్ హజ్ పాలన వద్దని నిర్ణయంతీసుకున్నారు. ప్రజలను కలవని కేసిఆర్ వద్దనే ఓడిరచారు. ఇంకెందుకు కేసిఆర్ ప్రస్తావన. ఓ వైపు కేసిఆర్ సిఎం. రేవంత్‌రెడ్డి పేరు కూడా ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడం లేదు. అయినా కేసిఆర్ పేరుతో కాంగ్రెస్ పార్టీకి ఏం పని. ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీని మర్చిపోయారు. కాంగ్రెస్‌ను గెలిపించారు. కేసిఆర్ వద్దనుకున్నారు. ఇంట్లో రెస్టు తీసుకునేలా చేశారు. ఓడిస్తే ఇంట్లో కూర్చుంటానని కేసిఆర్ చెప్పారు. అదే చేస్తున్నారు. వదిలేయండి? అధికారంలోవున్నప్పుడు గెలిపించిన ప్రజలే కేసిఆర్ బైటకు రావాలని ఉద్యమాలు చేశారు. ప్రగతి భవన్ దాటి రావాలని డిమాండ్ చేశారు. ఆయన రాకపోతే ప్రజలే ప్రజాస్వామ్య పద్దతిలో ఓడిరచి, ప్రగతి భవన్ నుంచి గెంటేశారు. ఇంకా ఎందుకు కేసిఆర్ పేరును కాంగ్రెస్ కలవరిస్తోంది. పలవరిస్తోంది. కేసిఆర్ ముచ్చట చెప్పకుండా వుండలేరా? కేసిఆర్ ప్రస్తావన లేకుండా ప్రభుత్వం నడపలేరా? కేసిఆర్ పేరెత్తకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేరా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే కేసిఆర్ పేరును గుర్తు చేస్తుంటే ప్రజలు కూడా ఇష్టపడడం లేదు. కాంగ్రెస్ నాయకులు కూడా కేసిఆర్ గురించి మనకెందుకు అంటున్నారు. ప్రజలు మర్చిపోదామనుకున్నా, కేసిఆర్‌ను కాంగ్రెస్ నాయకులే మర్చిపోకుండాచేస్తున్నారు. కేసిఆర్‌ను పదే పదే గుర్తు చేసి జపం చేస్తున్నారు. అలాంటప్పుడు కేసిఆర్‌పై కేసులు పెట్టినా జనం పట్టించుకోరు. పైగా కేసిఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారన్న సంకేతాలు వెళ్లే అవకాశం వుంటుంది. కేసిఆర్ ఆనవాలు చెరిపేస్తామంటూనే నిత్యం బిఆర్‌ఎస్ నాయకులకన్నా, కాంగ్రెస్ నాయకులే కేసిఆర్ జపం చేస్తున్నారు. పొద్దుకు పదుల సార్లు గుర్తు చేస్తున్నారు. కేసిఆర్ తప్పులు నిత్యం ఎత్తి చూపుతూ పోతుంటే లాభం లేదు. కేసిఆర్ కన్నా మంచి పాలన అందించే ప్రయత్నం చేయండి. కేసిఆర్ చేయని సంక్షేమాన్ని అందించండి. అంతే కాని పూట పూటకు, కేసిఆర్ ప్రస్తావన ఎందుకు? అంతే కాదు కాంగ్రెస్ నాయకులకన్నా సిఎంతోపాటు, ఇతర నాయకులంతా బిఆర్‌ఎస్ నాయకులు కేటిఆర్, హరీష్‌రావు, కవితల పేర్తు ప్రస్తావిస్తూ జనం వారి పేర్లను మదిలో నింపుకునేలా చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు బిఆర్‌ఎస్ నాయకుల పేర్తు తప్ప, కాంగ్రెస్ నాయకుల పేర్లు మర్చిపోయేలా పాలకులే చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఓ రైతు సభలో వేదిక మీద వున్న పెద్దలెవరో తెలియదని ఓ రైతు అన్నాడంటే అర్దం ఏమిటి? రెండేళ్లు దగ్గరకు వస్తున్నా, మంత్రుల పేర్లు కూడా జనం నాలుకల మీద ఆడడంలేదు. కాంగ్రెస్ పార్టీ వల్ల బిఆర్‌ఎస్ నాయకులను ప్రజలు మర్చిపోవడం లేదు. ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ను గుర్తు చేసుకోవడం కాంగ్రెస్‌పెద్దలు మర్చిపోండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రచారం చేసుకోంది.